హై రిస్క్ కాదు.. నోరిస్క్! | no use with High Risk Center | Sakshi
Sakshi News home page

హై రిస్క్ కాదు.. నోరిస్క్!

Aug 10 2014 12:27 AM | Updated on Oct 9 2018 7:52 PM

గర్భిణులకు ఎటువంటి వైద్య సేవలనైనా క్షణాల్లో అందించేందుకు మెదక్ ఏరియా ఆస్పత్రిలో దాదాపు రూ.11లక్షలతో ఏర్పాటు చేసిన హైరిస్క్ కేంద్రం వల్ల ఈ ప్రాంత మహిళలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది.

మెదక్ మున్సిపాలిటీ: గర్భిణులకు ఎటువంటి వైద్య సేవలనైనా క్షణాల్లో అందించేందుకు మెదక్ ఏరియా ఆస్పత్రిలో దాదాపు రూ.11లక్షలతో ఏర్పాటు చేసిన హైరిస్క్ కేంద్రం వల్ల ఈ ప్రాంత మహిళలకు ఎటువంటి ఉపయోగం  లేకుండా పోయింది. అత్యవసర సమయాల్లో గర్భిణులను  హైదరాబాద్ తదితర ప్రాంతాలకు పంపించకుండా ఇక్కడే వైద్య సేవలందిస్తామని అధికారులు ఊదరగొట్టారు.

 అయితే ఈ హైరిస్క్ ఆస్పత్రి పనితీరు ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. ఎవరైనా అధికారులు ఈ ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు వచ్చినప్పుడు మాత్రం కేంద్రంలో రిస్క్‌చేసి ఆపరేషన్లు చేస్తున్నామంటూ ఊదరగొడుతున్న వైద్యు లు అత్యవసర సమయాల్లో గర్భిణులను  ప్రైవేట్ ఆంబులెన్స్‌ల్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. వీరిని 108లో పంపించాలంటే సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుందని గర్భిణులను ప్రైవేట్ ఆంబులెన్స్‌ల్లో తరలిస్తున్నారు. చీటికి మాటికి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఇబ్బందులు హైరిస్క్ సెంటర్ ఏర్పాటుతో తప్పుతాయని భావించిన గర్భిణులకు అవస్థలు మాత్రం తప్పడం లేదు.

సోమవారం వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ తండాకు చెందిన మాలి అనే గర్భిణి మెదక్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కాగా ఆమెకు రక్తం తక్కువగా ఉందంటూ చికిత్స చేశారు. నెలలు నిండటంతో ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఆమెను ప్రైవేట్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. హైరిస్క్ కేంద్రంలో ఆపరేషన్ చేయాలని బంధువులు కోరినప్పటికీ  రక్తం అందుబాటులో లేదంటూ వైద్యులు ఆమెను హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. అదే విధంగా మెదక్ పట్టణంలోని నవాబుపేట వీధికి చెందిన పుష్ప అనే గర్భిణిని ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

కాగా ఈమెకు షుగర్ లెవల్ అధికంగా ఉండటంతో ఇక్కడ ఆపరేషన్ చేస్తే ఇబ్బందులు తలె త్తుతాయని, అందుకని హైదరాబాద్‌కు రెఫర్ చేసినట్లు వైద్యులు చెబుతున్నారు. హైరిస్క్ వస్తే గర్భిణులకు అవస్థలు తప్పుతాయని, చీటికి మాటికి హైదరాబాద్ వెళ్లాల్సిన దుస్థితి రాదని భావించామని పలువురు గర్భిణులు వాపోతున్నారు. ఈ మాత్రం దానికే హైరిస్క్ అంటూ లక్షలు ఖర్చుపెట్టి ఆర్భాటం చేయడం దేనికని గర్భిణులు, వారి బంధువులు  ప్రశ్నిస్తున్నారు.

 వసతులు లేవు:  సూపరింటెండెంట్
 సెంటర్‌లో అన్ని వసతులు లేక పోవడంతోనే గర్భిణులను హైదరాబాద్‌కు రెఫర్ చేయాల్సి వస్తుందని మెదక్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ పీసీ శేఖర్ తెలిపారు. ఆస్పత్రిలో ముఖ్యంగా బ్లడ్ బ్యాంకు తదితర వసతులు లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement