పడకలు లేవని ముప్పు తిప్పలు

No Beds in Government Hospitals in Hyderabad - Sakshi

ఉస్మానియాకు వెళితే.. నిలోఫర్‌కు..

నిలోఫర్‌కు వెళితే.. ఖాళీలు లేక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరణ

కూతురి వైద్యం కోసం ఓ తండ్రి కష్టాలు

సాక్షి,సిటీబ్యూరో: చిత్రంలో కనిపిస్తున్న ఈయన పేరు మొయిజ్‌. పాతబస్తీకి చెందిన ఇతడు ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి ఇతడి కూతురు సయిదా ఫజాబేగం(10) తీవ్ర అస్వస్థతకు గురవడంతో స్థానికం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించాడు. పరీక్షించిన అక్కడి వైద్యులు నిలోఫర్‌కు రిఫర్‌ చేశారు. దీంతో బిడ్డను తీసుకుని రెండు రోజుల క్రితం నిలోఫర్‌కు వచ్చాడు. ఆస్పత్రిలో పడకలు ఖాళీ లేకపోవడంతో బాలికను చేర్చుకునేందుకు నిరాకరించిన వైద్యులు.. ఉస్మానియాకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో బిడ్డను తీసుకుని ఉస్మానియాకు వెళ్లగా ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యులు లేరని చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో చేసేది లేక మొయిజ్‌.. బాలల హక్కుల సంఘ అధ్యక్షుడు అచ్యుతరావును ఆశ్రయించాడు. బాలికకు మానవతా దృక్పధంతో చికిత్స చేయాల్సిందిగా బంజారాహిల్స్‌లోని ఓ చిన్నపిల్లల కార్పొరేట్‌ ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు.

తీవ్ర జాప్యం వల్ల అప్పటికే బాలిక కాలుతో పాటు మాట కూడా పడిపోయింది. ఇన్‌ఫెక్షన్‌ మరింత ముదిరింది. బాలిక కండరాల క్షీణతకు సంబంధించిన గుయిల్లిన్‌ బారో సిండ్రోమ్‌ (జీబీఎస్‌)తో బాధపడుతోందని, వెంటనే ఇంజక్షన్‌ ఇవ్వాలని, ఒక్కో ఇంజక్షన్‌కు రూ.27 వేల చొప్పున మొత్తం రూ.12.50 లక్షలకు పైగా ఖర్చవుతుందని సదరు ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్థిక స్తోమత లేక పోవడంతో శుక్రవారం మధ్యాహ్నం కూతురును తీసుకుని మరోసారి ఉస్మానియాకు పరుగులు తీశాడు. అప్పటికే పడకలన్నీ నిండిపోవడంతో చేర్చుకునేందుకు నిరాకరించి, మళ్లీ నిలోఫర్‌కు రిఫర్‌ చేశారు. దీంతో మధ్యాహ్నం ఆయన మరోసారి తన బిడ్డను నిలోఫర్‌కు తీసుకొచ్చాడు. సాయంత్రం పొద్దుపోయే వరకు ఆస్పత్రిలో చేర్చుకోలేదు. అదే మంటే పడకలు ఖాళీ లేవని చెప్పుతున్నారని, ఏం చేయాలో అర్థం కావడం లేదని బాలిక తండ్రి మొయిజ్‌ బోరున విలపించడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఒక్క మొయిజ్‌ మాత్రమే కాదు.. వైరల్‌ జ్వరాలతో బాధపడుతూ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందే ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ ఆస్పత్రులకు చేరుకుంటున్న అనేక మంది సామాన్యులకు ఇదే అనుభవం ఎదురవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top