‘పది’పై ప్రత్యేక దృష్టి

Next Tenth Result Says On District Collector Adilabad - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్‌ జిల్లా.. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మాత్రం గత కొన్నేళ్లుగా చివరి స్థానాల్లోనే నిలుస్తోంది. మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులు పరీక్షలకు రెండు నెలల ముందు నుంచి చర్యలు తీసుకుంటున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదు. ఈసారి కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మెరుగైన ఫలితాల సాధన కోసం ఇప్పటినుంచే ప్రత్యేక తరగతుల ద్వారా విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల ద్వారా బోధించే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.

చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థులు అలసిపోకుండా స్నాక్స్‌ కోసం కూడా నిధులను విడుదల చేశారు. కొంతమంది ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా, మరికొంతమంది కలెక్టర్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయులకు ఉదయం, సాయంత్రం వీలున్న సమయంలో తరగతులు నిర్వహించాలని, టీచర్లపై ప్రత్యేకంగా ఒత్తిడి తేవడం లేదని విద్యా శాఖాధికారులు చెబుతున్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఇప్పటినుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించే విషయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఏదేమైనా ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో విద్యార్థులకు మేలు జరగనుంది.
 
ఈ యేడాదైనా మెరుగయ్యేనా..
గత రెండేళ్లుగా ఫలితాల పరంగా వెనుకబడిన జిల్లా ఈసారైనా టాప్‌–10లోనైనా ఉంటుందా అని పలువురు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించకపోవడంతోనే ఫలితాల పరంగా కింది స్థానంలో ఉంటున్నామని విద్యావంతులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈసారైనా పక్కా ప్రణాళికతో విద్యాబోధన చేపడితే మెరుగైనా ఫలితాలు సాధించగలుగుతామని పేర్కొంటున్నారు. ముఖ్యంగా గణితం, ఆంగ్లం, సైన్స్‌ సబ్జెక్టుల్లో అధిక మంది విద్యార్థులు ఫెయిల్‌ అవుతున్నారని, ఆయా సబ్జెక్టులపై విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా ఫలితాలు సాధించేలా చూడాలని కోరుతున్నారు.

కుంటుపడుతున్న విద్యావ్యవస్థ..
జిల్లాలో విద్యావ్యవస్థ కుంటుపడుతోంది. గత కొన్నేళ్లుగా రెగ్యులర్‌ ఎంఈఓలు లేరు. ఇన్‌చార్జీలతోనే పాఠశాలల పర్యవేక్షణ కొనసాగుతోంది. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకే ఎంఈఓ బాధ్యతలు అప్పగించడంతో వారు ఏ పనిని పూర్తిస్థాయిలో చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం డీఈఓ, ఉప విద్యాధికారి, ఎంఈఓ పోస్టులు ఇన్‌చార్జీలతోనే కొనసాగుతున్నాయి. ఎంఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు పూర్తి సమయం కేటాయించకపోవడంతో పాఠశాలలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో యాభై శాతం మంది విద్యార్థులకు అక్షరాలు రాయడం, చదవడం రావడం లేదు. దీని ప్రభావం ఉన్నత తరగతికి వెళ్లిన విద్యార్థులపై ప్రభావం పడుతోంది.

స్నాక్స్‌ కోసం నిధులు..
జిల్లాలో 455 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 63 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్యంలో 4,502 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరందరూ మార్చిలో నిర్వహించే పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 17 నుంచి జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ప్రత్యేక తరగతుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులు అలసిపోకుండా ఉండేందుకు రూ.22లక్షల 51వేల నిధులను విడుదల చేశారు. సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయుల అకౌంట్లలో డబ్బులను జమ చేయనున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.5 చొప్పున కేటాయించనున్నారు. వంద రోజుల పాటు ఈ ప్రక్రియ జరగనుంది. 

మంచి స్పందన ఉంది..
ఈ నెల 17 నుంచి కలెక్టర్‌ పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం నిధులను కూడా విడుదల చేశారు. ఉపాధ్యాయుల నుంచి కూడా మంచి స్పందన ఉంది. ఎవరిపై కూడా ఒత్తిడి తేవడం లేదు. వారికి వీలున్న సమయంలో ప్రత్యేక తరగతులు బోధించాలని సూచించాం. పదిలో ఈ విద్యా సంవత్సరం మంచి ఫలితాలు సాధిస్తాం. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపడుతున్నాం. – డాక్టర్‌ రవిందర్‌ రెడ్డి, డీఈఓ, ఆదిలాబాద్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top