కొత్త ఓటర్ల నమోదుకు మరో అవకాశం

New Voters Online Applications Warangal - Sakshi

సాక్షి, జనగామ: జిల్లాలో 6,76,586 మంది ఓటర్లు ఉన్నారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల పరిధిలో అధికారులు ఓటర్ల ముసాయిదా విడుదల చేశారు. శాసన సభను రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితా, కొత్త ఓటర్లకు అవకాశం కల్పించడంపై ఎన్నికల కమిషన్‌ అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల ఏర్పాట్లుపై జిల్లాస్థాయి అధికారులతోపాటు రెవెన్యూ శాఖ అధికారులకు అవగాహన సదస్సులను సైతం నిర్వహించారు. అదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దీంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో మునిగిపోయింది.
 
కొత్త సాంతికేతిక పరిజ్ఞానంతో..
అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త సాంతికేతిక పరిజ్ఞానం ఉపయోగించనున్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటును సరిచూసుకునే యంత్రాలకు వీవీ ప్యాట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈవీఎం మిషన్లపై పలు రాజకీయ పార్టీలతోపాటు పలువురు అనుమానం వ్యక్తం చేస్తుండటంతో ఈ సారి వీవీ ప్యాట్లను అమర్చనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటు ఎవరికి నమోదైందో రశీదు ద్వారా తెలుసుకోవచ్చు. 1 జనవరి 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరు నూతన ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 ఏళ్లు నిండి ఓటు హక్కు లేని వారి నుంచి ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత కొత్త ఓటర్లకు ఓటు హక్కు కల్పిస్తారు. ఈనెల 25వ తేదీ వరకు అభ్యంతరాలు, ప్రతిపాదనల స్వీకరణ, 15, 16వ తేదీల్లో అభ్యంతరాల స్వీకరణకు గ్రామ సభలు, ప్రత్యేక క్యాంపులు, అక్టోబర్‌ 4వ తేదీన అభ్యంతరాల పరిష్కారానికి తుది గడువు, 7వ తేదీ వరకు మార్పులు, చేర్పులతో జాబితా ముద్రణ, అనంతరం 8వ తేదీన ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఈ జాబితా ప్రకారమే శాసన సభ ఎన్నికలను నిర్వహిస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top