ఇంటి దగ్గరే రైలు ఎక్కొచ్చు! | New Train Service To Be started Soon | Sakshi
Sakshi News home page

ఇంటి దగ్గరే రైలు ఎక్కొచ్చు!

Mar 5 2018 2:09 AM | Updated on Mar 5 2018 2:09 AM

New Train Service To Be started Soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌.. ప్రయాణికుల డిమాండ్‌ అధికంగా ఉన్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఇదొకటి. నిత్యం ఈ సర్వీసు దాదాపు 1,600 మందిని గమ్యం చేరుస్తుంది. అయితే హైదరాబాద్‌ నుంచి బయలుదేరేటప్పుడు ఇందులో ప్రయాణించే నగర వాసుల్లో దాదాపు 700 మంది గచ్చిబౌలి, లింగంపల్లి, కూకట్‌పల్లి పరిసరవాసులే ఉంటున్నారని రైల్వే గుర్తించింది.

ఇంతమంది వేరువేరు రవాణా సాధనాల ద్వారా సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రావటం కొంత వ్యయప్రాయాసలకోర్చటమే. దీంతో అసలు రైలునే వారికి సమీపంలోకి తీసుకెళ్తే ఎలా ఉంటుందని భావించిన రైల్వే, లింగంపల్లి స్టేషన్‌లోనే వారు ఎక్కేలా ఏర్పాటు చేసింది. దీనివల్ల సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్రయాణికుల ఒత్తిడి తగ్గడమే కాకుండా దాదాపు రెండు గంటల పాటు ప్రయాణించి సికింద్రాబాద్‌ స్టేషన్‌ చేరుకునే పని స్థానిక ప్రయాణికులకు తగ్గింది.  

ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గేలా..
నగరంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడలు ప్రధాన రైల్వే స్టేషన్లుగా ఉన్నాయి. ముఖ్యమైన రైళ్లన్నీ ఇక్కడి నుంచే బయలుదేరుతున్నాయి. ప్రయాణికులు ఈ మూడు చోట్లకే వెళ్లి ఎక్కాల్సి రావటంతో, దూరం నుంచి వచ్చే ప్రయాణికులు లగేజీతో అక్కడి వరకు వెళ్లటం కొంత ఇబ్బందిగా మారింది. ఇది ఆ రైల్వే స్టేషన్‌లు కిక్కిరిసి పోవటానికి కారణమవడమే కాకుండా సిటీ ట్రాఫిక్‌పై కూడా ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం పై మూడు ప్రధాన స్టేషన్లు విస్తరించటానికి వీళ్లేకుండా ఉంది.

ప్రయాణికుల డిమాండ్‌ ఆధారంగా రైళ్ల సంఖ్య పెంచితే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్స్‌ సంఖ్య కూడా పెంచాల్సి ఉంటుంది. కానీ స్థలాభావంతో కొత్త ప్లాట్‌ఫామ్స్‌ నిర్మాణం సాధ్యంకావటం లేదు. ఇప్పటికే చాలా రైళ్లు ప్లాట్‌ఫామ్స్‌ ఖాళీ అయ్యే వరకు నగర శివారులోనే నిలపాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే నాగులపల్లి, చర్లపల్లిల్లో పెద్ద శాటిలైట్‌ టెర్మినల్స్‌ నిర్మించి కొన్ని రైళ్లను వాటి నుంచి నడపాలని నిర్ణయించారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థలం అప్పగించే విషయంలో అంత వేగంగా స్పందించకపోవటంతో ఆ ప్రతిపాదన పెండింగులోనే ఉండిపోయింది. చర్లపల్లిలో మాత్రం రైల్వేకు అందుబాటులో ఉన్న 50 ఎకరాల స్థలంలో చిన్న టెర్మినల్‌ నిర్మాణానికి రైల్వే యంత్రాంగం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈలోపు కొన్ని రైళ్లను వేరే ప్రాంతాలకు పొడిగించటం ద్వారా ప్రయాణికులకు చేరువగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.  

ఇటీవల బీదర్‌–గుల్బర్గా మార్గం అందుబాటులోకి రావటంతో బీదర్‌లో పిట్‌లైన్స్‌ సిద్ధం చేసింది. దీంతో తాజాగా మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ను బీదర్‌ నుంచి నడపటం ప్రారంభించారు. సాయంత్రం బీదర్‌లో మొదలయ్యే ఆ రైలు వికారాబాద్, లింగంపల్లి మీదుగా సికింద్రాబాద్‌ వస్తుంది. గతంలో సికింద్రాబాద్‌లో రాత్రి పదిన్నరకు బయల్దేరేది. ఇప్పుడు కూడా అదే సమయానికి సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరేలా షెడ్యూల్‌ సిద్ధం చేశారు. త్వరలో ఇదే తరహాలో కాకినాడకు నడిచే గౌతమి ఎక్స్‌ప్రెస్‌ కూడా శివారు ప్రాంతం నుంచి ప్రారంభం కాబోతోంది.

మరికొన్ని రైళ్లను కూడా..
ఇప్పుడు దీన్ని ఈ ఒక్క రైలుకే పరిమితం చేయకుండా మరిన్ని ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కూడా విస్తరించే యోచనలో రైల్వే ఉంది. ఇప్పటికే గౌతమి ఎక్స్‌ప్రెస్‌ను కూడా పొడిగించేందుకు రైల్వే బోర్డు అనుమతి కోరిన దక్షిణ మధ్య రైల్వే యంత్రాంగం, గోదావరి, నర్సాపూర్‌సహా వేరే రాష్ట్రాలకు వెళ్లే కొన్ని రైళ్ల విషయంలోనూ యోచిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement