Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

టీడీపీ గుండాలు చేసిన విధ్వంసకాండను సిట్‌ అధికారులకు వివరిస్తూ, వారి బెదిరింపుల నుంచి తమను రక్షించాలంటూ వేడుకుంటున్న తిరుపతి జిల్లాలోని రామిరెడ్డిపల్లి వాసులు
కచ్చితంగా ‘పచ్చ’ కుట్రే!

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే ఏకైక లక్ష్యంగా పోలింగ్‌ సందర్భంగా టీడీపీ విధ్వంస కాండకు బరి తెగించిందని పూర్తి ఆధారాలతో బట్టబయలైంది. వైఎస్సార్‌­సీపీకి అనుకూలంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు మహిళలు, వృద్ధులను ఓటింగ్‌కు దూరం చేసేందుకు టీడీపీ పక్కా పన్నాగంలో దాడులకు తెగబడి విధ్వంసం సృష్టించిందని స్పష్టమైంది. అందుకు సంబంధించి వీడియో రికార్డింగులు, ఫొటోలతో సహా కీలక ఆధారాలను సిట్‌ సేకరించింది. పోలింగ్‌ సందర్భంగా రాష్ట్రంలో యథేచ్ఛగా సాగిన టీడీపీ గూండాగిరీ­పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వరుసగా రెండో రోజు ఆదివారం విచారణ నిర్వహించింది. సిట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న అదనపు డీజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలోని బృందం అనంతపురం జిల్లా తాడిపత్రితో పర్యటించగా, ఇతర బృందాలు పల్నాడు, తిరుపతి జిల్లాల్లో పర్యటించి విచారణ నిర్వహించాయి. దాడులు, దౌర్జన్యాలతో భీతిల్లిన ప్రాంతాలను పరిశీలించాయి. పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలను పరిశీలించడంతోపాటు బాధితుల అభిప్రాయాలు తెలుసుకున్నాయి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ ఎంత పక్కాగా పన్నాగాన్ని అమలు చేసిందన్న దానిపై సిట్‌ అధికారులు ఓ అంచనాకు వచ్చినట్టు సమా­చారం. దాడులను అరికట్టడంలో పోలీసుల వైఫ­ల్యంపై కూడా సిట్‌ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చి­నట్లు తెలిసింది. బాధితులతో మాట్లాడి దాడులు ఎలా జరిగాయన్నది తెలుసుకోవడంతోపాటు కీలకమైన వీడియో, ఫొటో ఆధారాలను సేకరించారు. ప్రధానంగా పల్నాడు, అనంతపురం జిల్లాల్లో పోలీసులు టీడీపీకి కొమ్ము కాసినట్టు.. బాధితులు ఫోన్లు చేసినా సరే స్పందించకుండా ఉదాసీనంగా వ్యవహరించినట్టు నిగ్గు తేలింది. పోలింగ్‌ రోజున, తరువాత హింసాత్మక ఘటనలపై విచారణ ప్రక్రియను రెండు రోజుల్లో ముగించాలని ఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రెండు రోజుల విచారణ ద్వారా తాము గుర్తించిన అంశాలతో ప్రాథమిక నివేదికను సిట్‌ ఇన్‌చార్జ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఈసీకి సోమవారం సమర్పించనున్నారు. పూర్తి స్థాయి విచారణకు మరింత సమయం కావాలని ఆయన కోరే అవకాశం ఉంది.అక్రమాలకు పాల్పడటమే లక్ష్యంగా విధ్వంసంపక్కా పన్నాగంతో దాడులకు తెగబడి ఎన్నికల అక్రమాలకు పాల్పడాలన్నదే టీడీపీ కుట్రన్నది బట్టబయలైంది. అందుకోసమే పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు వరుస దాడులతో టీడీపీ శ్రేణులు బీభత్సం సృష్టించాయి. ప్రశాంతమైన తిరుపతి జిల్లాలో టీడీపీ ఏ విధంగా దాడులకు తెగబడిందీ వెలుగులోకి వచ్చింది. చిత్తూరు నుంచి రప్పించిన 2 వేల మంది రౌడీలతో చంద్రగిరి నియోజకవర్గంలోని కూచువారిపల్లెలో టీడీపీ విధ్వంసం.. రామిరెడ్డిపాలెం సర్పంచ్‌ చంద్రశేఖర్‌రెడ్డిని హత్య చేసేందుకు బరితెగించి దాడులకు పాల్పడిన కుతంత్రం.. అనంతరం తిరుపతిలోని ఎస్వీయూ, శ్రీపద్మావతి విశ్వవిద్యాలయాల ప్రాంతాల్లో దాడులు, ప్రతిదాడులకు సంబంధించిన కీలక ఆధారాలను సిట్‌ సేకరించింది. తిరుపతి రూరల్‌ మండలం ఎం ఆర్‌పల్లి సీఐపై టీడీపీ నేతలు రాడ్లతో దాడి చేస్తే, ఎందుకు కేసు నమోదు చేయలేదని సిట్‌ అధికారులు ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ దాడిపై కూడా కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్ట్‌ చేయాలని ఆదేశించింది. రెండు కేసుల్లో కూడా నిందితులు అందరినీ అరెస్ట్‌ చేయాలని స్పష్టం చేసింది. తాడిపత్రిలో అయితే టీడీపీ గుండాగిరికి ఏకంగా పోలీసులే దన్నుగా నిలవడం.. పోలీసులే దాడులకు పాల్పడి ఆస్తులు ధ్వంసానికి పాల్పడిన వీడియో, ఫొటో ఆధారాలను సిట్‌ సేకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.– పల్నాడు జిల్లా పమిడిపాడు గ్రామంలోని వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ బూత్‌ ఏజంట్‌ షేక్‌ మాబుపై టీడీపీ వర్గీయుల దాడి, ఉప్పలపాడులో ఇరువర్గాల దాడులు, ప్రతిదాడులు, దొండపాడు గ్రామంలో వాహనాలపై దాడి ఘటనల వెనుక టీడీపీ పక్కా పన్నాగం కూడా బట్టబయలైంది. ఈ ఘటనల వీడియోలను పరిశీలించి దాడుల తీవ్రతపై సిట్‌ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. మాచర్ల నియోజకవర్గం కారెంపూడిలో బీసీ వర్గీయులపై టీడీపీ గుండాలు యథేచ్చగా సాగించిన దాడులు, దాచేపల్లిలో టీడీపీ వర్గీయులు తెగబడి సృష్టించిన విధ్వంసకాండ వెనుక కుట్ర వెలుగులోకి వచ్చింది. పోతురాజుగుట్టలో బేడ బుడగ జంగాల కాలనీపై జరిగిన దాడిని ఆ తర్వాత 14వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు కారెంపూడిలో వరుసగా టీడీపీ రౌడీ మూకలు సాగించిన విధ్వంసాలకు సంబంధించిన వీడియో ఆధారాలను సేకరించారు.ఇవిగో ఆధారాలు..– పోలింగ్‌ రోజున పక్కా పన్నాగంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని బాధితులు సిట్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కేవలం ఫిర్యాదులు చేయడమే కాకుండా అందుకు సంబంధించిన వీడియో రికార్డులు, ఫొటోలను సాక్షంగా సిట్‌ అధికారులకు సమర్పించారు. చంద్రగిరి నియోజకవర్గంలో విధ్వంసకాండకు నాంది పలికిన కూచువారిపల్లిలో టీడీపీ సృష్టించిన బీభత్సం గురించి బాధితులు సిట్‌ అధికారులకు వివరించారు. – రామిరెడ్డిపల్లి సర్పంచ్‌ కొటాల చంద్రశేఖర్‌రెడ్డిని అంతమొందించే కుట్రలతోనే టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారని స్థానికులు సిట్‌ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కారును తగలబెట్టిన ఘటన మొదలు సర్పంచ్‌ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇల్లు, కారు ధ్వంసం చేసి, నిప్పటించడం వరకు విధ్వంసకాండ కొనసాగిన తీరును విడమరచి చెప్పారు. సర్పంచ్‌ ఇంట్లోని వృద్ధురాలిని బలవంతంగా బయటకు ఈడ్చుకొచ్చారన్నారు. ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి, విలువైన వస్తువులను దోచుకెళ్లడంతో పాటు పెట్రోల్‌ బాంబులతో ఇంటిని దగ్ధం చేశారని చెప్పారు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారని తెలిపారు. అప్పటికే సిద్ధం చేసుకున్న రాళ్లు, కర్రలతో టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడ్డారన్నారు. – రామిరెడ్డిపల్లి పోలింగ్‌ బూత్‌ వద్ద టీడీపీ వర్గీయులు ఎలా దాడులకు తెగబడిందీ బాధితులు వివరించారు. ఇప్పటికీ టీడీపీ నాయకుల బెదిరింపులు ఆగడం లేదని, రామిరెడ్డిపల్లిలో ఎవరినీ వదలమని.. చంపేస్తామంటూ బెదిరించారని.. మీరే రక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నారు. టీడీపీ గుండాల బెదిరింపులకు గ్రామంలో పది కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లి పోయాయని సిట్‌ అధికారుల దృష్టికి తెచ్చారు. – అనంతపురం జిల్లా తాడిపత్రిలోని విధ్వంసకాండపై సిట్‌ ఇన్‌చార్జ్‌ అదనపు డీజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో అధికారుల బృందానికి బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ సభ్యులు సిట్‌ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దాడులు అరికట్టడంలో పోలీసుల వైఫల్యం, బాధితులపై తిరిగి పోలీసులు దౌర్జన్యానికి దిగడం, ఆస్తులు ధ్వంసం చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటో ఆధారాలను సమర్పించారు.– పల్నాడు జిల్లాలోని నరసారావుపేట, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో టీడీపీ హింసాకాండపై బాధితులు సిట్‌ అధికారుల వద్ద తమ ఆవేదన వెళ్లగక్కారు. మంత్రి అంబటి రాంబాబు సిట్‌ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల రోజున పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ వర్గీయుల దాడి, రూరల్‌ సీఐ రాంబాబు వ్యవహరించిన తీరుపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.– పల్నాడు జిల్లా కారెంపూడిలో ఈ నెల 14న ఉదయం నుంచి రాత్రి వరకు టీడీపీ గుండాలు సాగించిన దౌర్జన్యకాండను బాధితులు సిట్‌ అధికారులకు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లాలోని దాచేపల్లి నగర పంచాయతీలో ఇరికేపల్లి, కేసానుపల్లి, తంగెడ, మాదినపాడు, దాచేపల్లిలో టీడీపీ రౌడీ మూకలు తెగబడి బీభత్సం సృష్టించిన తీరును బాధితులు వివరించారు.

Chandrababu to go America without Anticipatory bail
ముందస్తు బెయిల్‌ లేకుండా విదేశాలకు చంద్రబాబు

సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గుట్టుచప్పుడు కాకుండా అమెరికా వెళ్లడం కలకలం రేపుతోంది. ఒకవైపు చంద్రబాబుపై సీఐడీ జారీ చేసిన లుక్‌ అవుట్‌ నోటీసు అమలులో ఉండగా మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇంకా విచారణలోనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు చంద్రబాబును శనివారం తెల్లవారుజామున కొద్దిసేపు నిలువరించారు. చంద్రబాబు దేశం విడిచి వెళ్లకూడదని సీఐడీ గతేడాది లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా? అని ప్రశ్నించడంతో చంద్రబాబు కంగు తిన్నారు. తటపటాయిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చిన తరువాత ఇమిగ్రేషన్‌ అధికారులు పలు దఫాలు సీఐడీ అధికారులతో చర్చించారు. అనంతరం ఎట్టకేలకు అనుమతించారు. పార్టీ ఖాతాల్లోకి అవినీతి నిధులు..టీడీపీ హయాంలో జరిగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌తోపాటు ఫైబర్‌ నెట్, అసైన్డ్‌ భూములు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్కిల్‌ స్కామ్‌ కేసులో సీఐడీ ఆయన్ని అరెస్ట్‌ చేయగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా ఫైబర్‌ నెట్‌ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీఐడీ వాదనలు వినిపించింది. కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను టీడీపీ బ్యాంకు ఖాతాలకు తరలించిన విషయాన్ని న్యాయస్థానానికి నివేదించింది. దీనిపై చంద్రబాబును కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. షరతులు బేఖాతర్‌!స్కిల్‌ స్కామ్‌ కేసులో నిందితులైన చంద్రబాబు, ఆయన మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్‌పై సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. సీఐడీ అదనపు డీజీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని అందులో స్పష్టం చేసింది. అయితే సీఐడీ ముందస్తు అనుమతి లేకుండానే చంద్రబాబు అమెరికా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ న్యాయస్థానంలో విచారణలో ఉంది. దీంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంద్రబాబు న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులతో చర్చించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్, ఫైబర్‌ నెట్, అసైన్డ్‌ భూములు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే న్యాయస్థానంలో చార్జ్‌షీట్లు దాఖలు చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు ఇమిగ్రేషన్‌ అధికారులకు తెలియచేశారు. సీఐడీకి సమాచారం ఇచ్చిన తరువాతే విదేశాలకు వెళ్లాలని చెప్పారు. చార్జ్‌షీట్లను పరిగణలోకి తీసుకున్న తరువాత న్యాయస్థానం విధించే షరతులను పాటించాలన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి అమెరికా వెళ్లేందుకు సమ్మతించారు. సీఐడీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని మరోసారి చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. న్యాయస్థానం విధించే షరతులు, ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్నారు. అనంతరం ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అనుమతించడంతో చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలసి దుబాయి మీదుగా అమెరికా వెళ్లారు.చికిత్స కోసం అంటున్న టీడీపీ వర్గాలుచంద్రబాబు తన విదేశీ పర్యటన గురించి చివరి వరకు ఎవరికీ తెలియనివ్వలేదు. కొద్ది రోజుల పాటు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించిన ఆయన అమెరికా పర్యటన విషయంలో మాత్రం గోప్యత పాటించారు. వైద్య పరీక్షల కోసమే ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ చంద్రబాబు చికిత్స కోసం అమెరికా వెళ్లారు. వారం తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారని పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు నారా లోకేష్‌ కూడా నాలుగు రోజుల క్రితం చడీ చప్పుడు లేకుండా అమెరికా వెళ్లినట్లు సమాచారం.

Today is the fifth phase of polling
నేడే ఐదో దశ పోలింగ్‌

ముంబై/లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 స్థానాలకు ఈరోజు పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, స్మృతి ఇరానీ, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, తదితర కీలక నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఈరోజే పోలింగ్‌ చేపడుతున్నారు. ఏడు దశలను చూస్తే ఈ ఐదో దశలోనే అత్యంత తక్కువ(49) స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఈ 49 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ 40కిపైగా చోట్ల విజయం సాధించడం విశేషం. దీంతో ఈ దశ బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారైనా మెరుగైన ఓటింగ్‌ సాధించేలా ఓటర్లు పోలింగ్‌ ప్రక్రియలో భారీగా పాలుపంచుకోవాలని ముంబై, థానె, లక్నో నగర ఓటర్లకు ఈసీ ఆదివారం విజ్ఞప్తి చేసింది. బరిలో కీలక నేతలుకేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌(లక్నో), పియూశ్‌ గోయల్‌( నార్త్‌ ముంబై), కౌశల్‌ కిశోర్‌(మోహన్‌లాల్‌గంజ్‌), సాధ్వి నిరంజన్‌ జ్యోతి(ఫతేపూర్‌), శంతను ఠాకూర్‌ (పశ్చిమబెంగాల్‌లోని బంగావ్‌), ఎల్‌జేపీ(రాంవిలాస్‌) నేత చిరాగ్‌ పాశ్వాన్‌ (బిహార్‌లోని హాజీపూర్‌), శివసేన శ్రీకాంత్‌ షిండే(మహారాష్ట్రలోని కళ్యాణ్‌), బీజేపీ నేత రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణి ఆచార్య( బిహార్‌లోని సరణ్‌), ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌(ముంబై నార్త్‌ సెంట్రల్‌)ల భవితవ్యం సోమవారమే ఈవీఎంలలో నిక్షిప్తం కాబోతోంది. విపక్షాలు అధికారంలోకి వస్తే అయోధ్య బాలరామాలయం పైకి బుల్డోజర్లను పంపిస్తారని మోదీ తీవ్ర విమర్శలు, ఎన్‌డీఏ 400 చోట్ల గెలిస్తే రాజ్యాంగాన్ని ఇష్టమొచ్చినట్లు మారుస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తుందని కాంగ్రెస్‌ విమర్శలతో ఐదో దశ ప్రచారపర్వంలో కాస్తంత వేడి పుట్టించింది. ఒడిశాలో ఐదు లోక్‌సభ స్థానాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ కింద 35 ఎమ్మెల్యే స్థానాల్లోనూ సోమవారం పోలింగ్‌ జరగనుంది. బిజూ జనతాదళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ పోటీచేస్తున్న హింజీలీ అసెంబ్లీ స్థానంలో ఈరోజే పోలింగ్‌ ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగోదశ ముగిశాక 543 స్థానాలకుగాను 23 రాష్ట్రాలు,యూటీల్లో ఇప్పటిదాకా 379 స్థానాల్లో పోలింగ్‌ పూర్తయింది. ఆరో దశ పోలింగ్‌ మే 25న, ఏడో దశ జూన్‌ ఒకటిన జరగనుంది.

Telangana State Cabinet Meeting By Revanth Reddy On Monday
నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ఎను­ము­ల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవా­రం మధ్యాహ్నం 3 గంటలకు సచివాల­యంలో రాష్ట్ర మంత్రివర్గ సమావే­శం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు.. మంత్రివర్గ భేటీ నిర్వహణ కోసం పలు షరతులతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్‌ కుమార్‌ ఆదివా­రం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు.అత్యవసరమైన అంశాలు మాత్రమే..లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు.. అత్యవ­సర­మైన, నిర్ణీత గడువులోగా అమలు చేయాల్సిన అంశాలను మాత్రమే కేబినెట్‌ భేటీలో చర్చించాలని ఈ లేఖలో ఈసీ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ఫ­లితాలు జూన్‌ 4న వెల్లడికానున్న నేపథ్యంలో.. అప్పటి వరకు నిరీక్షించడం సాధ్యం కాని, అత్యవస­రమైన అంశాలను మాత్రమే మంత్రివర్గ సమావేశం ఎజెండాలో చేర్చా­లని పేర్కొంది. మంత్రివర్గ సమావేశం ఎజెండాలో ప్రతిపాదించిన రుణ­మాఫీ, హైదరాబాద్‌ ఉమ్మ­డి రాజధాని వంటి అంశా­లను లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాయి­దా వేసుకో­వాలని సూచించింది. ఇక ఎన్నిక­ల నిర్వ­హణలో పాలుపంచుకున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులెవరినీ సమావేశానికి హాజరుకావాలని కోరరాదని ఆదేశించింది.కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లు, పంటల సాగుపై నిర్ణయాలు!వాస్తవానికి గత శనివారమే కేబినెట్‌ భేటీ నిర్వ­హించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈసీ అనుమతి కోరింది. ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వాయి­దా వేసు­కుంది. సోమవారంలోగా ఈసీ అనుమతించకుంటే మంత్రులతో కలసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు కూడా. కానీ తాజాగా ఈసీ అనుమతి ఇవ్వడంతో ప్ర­భు­త్వం అత్యవసర అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి తొల­­గి­పోయింది. ఈ భేటీలో కాళేశ్వరం బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు, ధాన్యం కొనుగోళ్లు, వర్షాకాలం పంటల సాగు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

Congress government is ready to fill nominated posts
‘కోడ్‌’ పోగానే పందేరం!

సాక్షి, హైదరాబాద్‌: అధికార కాంగ్రెస్‌ పార్టీ మరో­మారు నామినేటెడ్‌ పదవుల పందేరానికి సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి ముందు 37 మంది పార్టీ నేతలను పలు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధిష్టానం అనుమతితో రెండో జాబితాను కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందులో 17 మందికి చాన్స్‌ ఇవ్వనున్నట్టు గాంధీభవన్‌ వర్గాల సమాచారం. తొలిదఫాలో అవకాశం దక్కిన 37 మంది, ఈ 17 మంది కలిపి.. ఒకేసారి పదవీబాధ్యతలు తీసుకునేలా ఏర్పాట్లు చేసే యోచనలో సీఎం రేవంత్‌ ఉ­న్నా­రని తెలిసింది. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే మలి దఫా జాబితాను ప్రకటిస్తారని సమాచారం. ఎవరెవరికన్న దానిపై కాస్త స్పష్టత తొలిదఫా నామినేటెడ్‌ పదవుల్లో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు, టికెట్లు ఆశించి దక్కని వారికి అవకాశం ఇచ్చారు. రెండో దఫాలో కూడా ఇదే తరహాలో పదవులు ఇవ్వనున్నట్టు తెలిసింది. తొలి దఫాలో పీసీసీ అనుబంధ విభాగాల్లో.. చేనేత, ఎక్స్‌ సరీ్వస్‌మన్, సేవాదళ్‌లకు అవకాశం రాలేదు. దీంతో రెండో జాబితాలో ఈ విభాగాలకు చెందిన నేతలకు నామినేటెడ్‌ పదవులు దక్కుతాయని సమాచారం. వారితోపాటు ఆరేడుగురు పార్టీ జిల్లా అధ్యక్షు­లు, మరో ఇద్దరు యూత్‌ కాంగ్రెస్‌ నేతల పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం. గత ఎన్నికల్లో టికెట్‌ ఆశించి దక్కని కొందరికి ఈ జాబితాలో చాన్స్‌ ఇవ్వనున్నట్టు తెలిసింది. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన మైనార్టీ నేతల్లో కీలకమైనవారికి ఇప్పటికే నామినేటెడ్‌ పదవులు రాగా.. రెండో దఫాలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు గాం«దీభవన్‌ వర్గాలు చెప్తున్నాయి. జూన్‌ 6వ తేదీన లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగియనుంది. తర్వాత కొన్నిరోజుల్లోనే గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన నాలుగైదు రోజుల్లోనే రెండో దఫా నామినేటెడ్‌ జాబితా విడుదల, అందరి పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతు, విద్యా కమిషన్లు కూడా.. వ్యవసాయం, విద్యా రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని.. ఈ క్రమంలో రాష్ట్రంలో రైతు, విద్యా కమిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోందని గాంధీ భవన్‌ వర్గాలు చెప్తున్నాయి. ఈ కమిషన్ల ఏర్పాటు విషయంలో కూడా సీఎం రేవంత్‌ ఓ అభిప్రాయానికి వచ్చారని అంటున్నాయి. రెండో దఫా నామినేటెడ్‌ జాబితాతోపాటు ఆ రెండు కమిషన్ల నియామకం కూడా చేపట్టాలని భావిస్తున్నారని పేర్కొంటున్నాయి. రైతు కమిషన్‌ చైర్మన్‌గా ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి, విద్యా కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళిలను నియమించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయి. వ్యవసాయ, విద్యా శాఖలకు అనుబంధంగా పనిచేస్తూ.. కీలక అంశాల్లో సలహాలు, సూచనలు ఇచ్చే దిశగా ఆ కమిషన్లు పనిచేస్తాయని నేతలు అంటున్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాల నిర్మూలన, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ వంటి కీలక అంశాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తాయని చెప్తున్నారు. పోటీ చేసి ఓడినవారికి లేనట్టే! గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన వారికి మలి దఫా నామినేటెడ్‌ పదవుల్లో కూడా స్థానం దక్కదని తెలుస్తోంది. ఈ విషయంలో స్పష్టమైన అభిప్రాయంతో ఉన్న రేవంత్‌రెడ్డి.. ఎన్ని విజ్ఞప్తులు, ఒత్తిళ్లు వచ్చినా తొలిదఫాలో అలాంటి వారికి అవకాశం కల్పించలేదు. ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంగా కూడా ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాయకులు ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జులుగా మాత్రమే కొనసాగుతారని, ఎలాంటి నామినేటెడ్‌ పదవుల్లో వారికి అవకాశం ఉండదని గాం«దీభవన్‌ వర్గాలు చెప్తున్నాయి.

High BP with cellphone
సెల్‌ఫోన్‌తో హై బీపీ!

సాక్షి, అమరావతి: మొబైల్‌ ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్‌ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేల్చారు. ‘యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌ – డిజిటల్‌ హెల్త్‌’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్‌జౌలోని సదరన్‌ మెడికల్‌ వర్సిటీ పరిశోధకులు మొబైల్‌ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని గుర్తించారు.130 కోట్ల మందిలో రక్తపోటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30–79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82 శాతం మంది తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే. భారత్‌లో 120 కోట్ల మందికిపైగా మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హైబీపీ వల్ల వచ్చే హైపర్‌ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్‌లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12 శాతం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్‌లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది.కండరాలపై ఒత్తిడి..మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఫోన్‌ను పట్టుకోవడంతో కండరాలు ఒత్తిడికి గురవడంతో పాటు తీవ్ర తలనొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం, ఇయర్‌ఫోన్లు్ల, హెడ్‌ఫోన్లను నిరంతరం ఉపయోగించడంతో టిన్నిటస్‌ (చెవుల్లో నిరంతరం రింగింగ్‌ సౌండ్‌ వినిపించే పరిస్థితి) వంటి చెవి సమస్యలు వస్తాయంటున్నారు. ఫోన్‌ స్క్రీన్‌పై ఎక్కువ సేపు చూడటంతో కంటిపై ఒత్తిడి పెరిగిన కళ్లుపొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు.

UK post study visa cancellation
యూకే పోస్టు–స్టడీ వీసాలు రద్దు!

లండన్‌: యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లోకి వలసలను అరికట్టడానికి ప్రధానమంత్రి రిషి సునాక్‌ కొత్తరకం ఆలోచనలు చేస్తున్నారు. యూకేలో గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కల్పించే పోస్టు–స్టడీ వీసాను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై సొంత మంత్రివర్గం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడం గమనార్హం. యూకే పోస్టు–స్టడీ వీసా పథకం 2021లో ప్రారంభమైంది. దీనితో భారతీయ విద్యార్థులు అధికంగా ప్రయోజనం పొందుతున్నారు. యూకేలో యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్‌ అభ్యసించిన తర్వాత రెండేళ్లదాకా ఇక్కడే ఉంటూ ఉద్యోగాలు చేసుకొనే వెసులుబాటు లభిస్తోంది. ఒకవేళ ఈ వీసాను రద్దుచేస్తే భారతీయ విద్యార్థులే ఎక్కువగా నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో యూకేలోకి వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవన్నీ చట్టబద్ధంగానే జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. వలసలను అరికట్టే చర్యల్లో భాగంగా పోస్టు–స్టడీ వీసాలపై ఆంక్షలు విధించడమా లేక శాశ్వతంగా రద్దు చేయడమా అనే దానిపై ప్రధాని రిషి సునాక్‌ తర్జనబర్జన పడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనను పలువురు యూకే మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి గిలియన్‌ కీగన్, విదేశాంగ మంత్రి డేవిడ్‌ కామెరూన్‌ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

Rain Forecast For 3 Days In Andhra Pradesh
అండమాన్‌కు ‘నైరుతి’.. రానున్న మూడ్రోజులూ వానలే

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరా­వతి: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందుగా అంచనా వేసిన విధంగానే నైరుతి రుతు­పవనాలు ఆదివారం దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఇవి చురుగ్గా కదులుతూ దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, మాల్దీవులు, కొమరిన్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. రానున్న రెండ్రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా­యని ఐఎండీ వెల్లడించింది. ఇక ఈ రుతు పవ­నాలు మే 31న కేరళను తాకనున్నట్లు భారత వాతా­వరణ విభాగం అంచనా వేస్తోంది. ఇంకా ముందు రావడానికి కూడా అవకాశం ఉంది. ఆ తర్వాత ఏపీలోకి 2–3 తేదీల్లో ప్రవేశిస్తాయి. లా నినా పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాధారణంగా కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బలహీనపడ్డ ద్రోణి.. మూడ్రోజులు వర్షాలు..మరోవైపు.. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమల మీదుగా సముద్ర మట్టానికి 3.1 కి.మీల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న మూడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలలో సోమవారం.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలలో మంగళవారం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, వీటితో పాటు గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ తెలిపారు.పెదకూరపాడులో 55 మిల్లీమీటర్ల వర్షంఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడులో 55.5 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయిలో 40 మిల్లీ మీటర్లు, జగ్గయ్యపేట 39.5, అల్లూరి జిల్లా అడ్డతీగల 38, చింతపల్లి 36, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి 35.2, అనకాపల్లి రావికమతం 35.2, అల్లూరి జిల్లా రాజవొమ్మంగి 35, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 47 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. తుపానుగా మారనున్న అల్పపీడనం..మరోవైపు.. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింతగా బలపడి 24 నాటికి వాయుగుండంగా మారనుంది. అనంతరం తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Flying Car is ready
గాల్లో తేలిపోతూ..కార్‌లో ఎగిరిపోతూ..

ఫుల్లు ట్రాఫిక్‌.. ఐదారు కిలోమీటర్లు వెళ్లాలన్నా అరగంట పట్టేస్తోంది.. హాయిగా గాల్లో ఎగిరెళితే బాగుండు అనిపిస్తుంటుంది కదా..నిజంగానే అలా ఉన్నచోటు నుంచి గాల్లో ఎగిరెళ్లిపోయే..ఫ్లయింగ్‌ కార్‌ రెడీ అయింది. దాని పేరు హెక్సా.అమెరికాకు చెందిన ‘లిఫ్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇన్‌ కార్పొరేషన్‌’ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. తాజాగా జపాన్‌లోని టోక్యో నగరంలో జరిగిన ‘సుషి టెక్‌ టోక్యో–2024’ కార్యక్రమంలో దీన్ని ప్రదర్శించారు. పది మీటర్ల ఎత్తులో తిప్పుతూ.. షోలో ఈ ఫ్లయింగ్‌ కార్‌ను కేవలం బొమ్మలా పెట్టడం కాదు.. గాల్లో తిప్పి మరీ చూపించారు. కారులో కూర్చున్న వ్యక్తి.. దాన్ని పది మీటర్ల ఎత్తులో అటూ ఇటూ తిప్పాడు. ఈ ‘హెక్సా’ ఫ్లయింగ్‌ కార్‌ వెడల్పు 4.5 మీటర్లు, ఎత్తు 2.6 మీటర్లు, 196 కిలోల బరువు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. గాల్లో ఎగిరేందుకు 18 ప్రొపెల్లర్లు (మోటార్లు, రెక్కలు) బిగించారు. సెకన్లలోనే ఎటు కావాలంటే అటు తిప్పగలిగేలా ఏర్పాట్లు చేశారు. ఇది రీచార్జబుల్‌ బ్యాటరీలతో నడుస్తుంది. ఇది గంటకు 100 కిలోమీటర్ల వరకు వేగంతో వెళ్లగలదని కంపెనీ తెలిపింది. నేల మీదేకాదు.. నీటిలోనూ సురక్షితంగా ల్యాండ్‌ అవుతుందని పేర్కొంది. త్వరలోనే వీటిని అమ్మకానికి పెట్టనున్నట్టు వెల్లడించింది. ఇంతకీ ధరెంతో తెలుసా.. రూ.4.12 కోట్లు మాత్రమే.భవిష్యత్తు ఫ్లయింగ్‌ కార్లదే.. కిక్కిరిసిపోయి, అడుగు కూడా కదలని ట్రాఫిక్‌ సమస్యతో అల్లాడుతున్న నగరాల్లో భవిష్యత్తులో ఇలాంటి ఫ్లైయింగ్‌ కార్లు దూసుకుపోవడం ఖాయమని సుషి టెక్‌ షోలో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. అత్యవసరమైన మందులు, ఇతర సామగ్రి రవాణాకూ ఇవి అద్భుతంగా తోడ్పడతాయని చెప్పారు. ముఖ్యంగా ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు.. ఫ్లయింగ్‌ కార్లతో ఎంతో ప్రయోజనం ఉంటుందని టోక్యో గవర్నర్‌ యురికో కోయికే పేర్కొన్నారు. - సాక్షి, సెంట్రల్‌డెస్క్‌

DPC is set up for promotions of AE and ADA posts in Agriculture Department
పదోన్నతులు ఎలా ?

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయశాఖలో పదోన్నతులు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఈఓ నుంచి ఏఓకు, ఏఓ నుంచి ఏడీఏ పోస్టులకు పదోన్నతులు నిర్వహించేందుకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు ఉత్తర్వు లు ఇచ్చారు. వ్యవసాయశాఖ డైరెక్టర్‌ కన్వీనర్‌గా, సహకార శాఖ కమిషనర్, ఉపకార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శులు సభ్యులుగా రెండేళ్ల కాల పరిమితితో డీపీసీని ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖలోని మొదటి, రెండోస్థాయి గెజిటెడ్‌ పోస్టుల్లో పదోన్నతులు కల్పించడమే దీని ఉద్దేశమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలంటే, ఆయా పోస్టుల్లో ప్రస్తుతమున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలి. ఉదాహరణకు ఏఓ నుంచి ఏడీఏ పోస్టుల్లోకి ప్రమోషన్‌ ఇవ్వాలంటే, ఏడీఏ పోస్టుల్లో ఖాళీలు ఉండాలి. కానీ ఏడీఏ నుంచి డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టులకు పదోన్నతులు జరపకుండా, ఖాళీలు ఎలా ఏర్పడతాయని వ్యవసాయ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అతి కొద్దిగా మాత్రమే రిటైర్‌మెంట్లు ఉంటాయి. కాబట్టి పూర్తిస్థాయిలో ప్రమోషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఇక ఏఈఓ నుంచి ఏఈలుగా పదోన్నతులు ఇవ్వాలన్నా అటువంటి క్లిష్టమైన పరిస్థితే తలెత్తుతుంది. పైస్థాయిలో కూడా ప్రమోషన్లు ఇవ్వకుండా మొదటి, రెండోస్థాయి గెజిటెడ్‌ ఆఫీసర్ల పదోన్నతులు చేయడం కుదరదని అంటున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులువ్యవసాయశాఖలో దాదాపు 500 మందికి పైగా పదోన్నతు లకు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒకేసారి అన్ని శాఖల్లో పదోన్నతులు జరిగినా, వ్యవసాయశాఖలో మాత్రం చేయలేదు. ఉద్యోగ సంఘాల మధ్య సమన్వయం లేదని సాకులు చెబుతూ పదోన్నతులు ఆపేశారని అంటున్నారు. ఏఓ స్థాయి నుంచి అడిషనల్‌ డైరెక్టర్‌ కేడర్‌ వరకు పదోన్న తులు జరగాలి. సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం పదోన్నతులు నిర్ణీత కాలంలో జరపకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని సంఘాల నేతలు అంటున్నారు. పదోన్నతులు రాకపోవడం వల్ల సీనియర్లు మనోవేదనకు గురవుతున్నారు. దీనివల్ల పోస్టింగ్‌ల్లోనూ అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నా రు. ఇప్పుడు కేవలం రెండు కేడర్లలో పదో న్నతులకు మాత్రమే డీపీసీని ఏర్పాటు చేశారు. దీని వల్ల పైస్థాయిలో కద లిక రాకుంటే వీటికి కూడా ప్రమోషన్లు ఇచ్చే పరి స్థితి ఉండదని అంటున్నారు. ఆయా విషయాలపై ఇటీవ ల అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌ వ్యవ స్థాపక అధ్యక్షుడు కె.రాము లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎన్నికలకు ముందే విజ్ఞప్తి చేశారు. కానీ ప్రక్రియ మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. బదిలీల మాటేంటి?గత ప్రభుత్వంలో అంటే దాదాపు ఐదారేళ్ల క్రితం వ్యవసాయ శాఖలో బదిలీలు జరిగాయి. అవి కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అనేకమంది ఉద్యోగులు ఒకే చోట తిష్టవే యగా, కొందరు కుటుంబాలకు దూరంగా ఉంటూ అన్యా యానికి గురవుతున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు వ్యవసా య ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నాయి. ఉద్యోగు ల్లో దాదాపు 2 వేల మందికి పైగా బదిలీలకు ఎదు రుచూస్తున్నారు. కొందరైతే అక్రమ బదిలీలు చేయించుకుంటున్నారన్న విమర్శ లున్నాయి. మరికొందరైతే డిప్యూ టేషన్లు చేయించుకుంటున్నారు. వ్యవసాయ శాఖ లో చాలామంది డిప్యూటేషన్లు, ఓడీలు, ఫారిన్‌ సర్వీసులపై ఉంటున్నారు. బదిలీలు జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికీ డిప్యూటేషన్లకు వందల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆ అధికారి వెల్లడించారు. నిర్ణీత సమయం ప్రకారం బదిలీ లు జరగాలని, అది ఉద్యోగుల హక్కు అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement