‘పాలమూరు’కు నికరజలాలు

Net waters to the Palamuru says harish rao - Sakshi

     మంత్రి హరీశ్‌రావు ధీమా 

     పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయింపులపై ఆశాభావం 

     గోదావరి ద్వారా ఖమ్మం, నల్లగొండలో సింహభాగానికి నీరు 

     పాలమూరు–రంగారెడ్డి లిఫ్టును 120 రోజులు నడిపిస్తాం 

     నారాయణపేట సాగునీటి సాధన సభలో మంత్రి ప్రసంగం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: దేశంలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టుగా రూపొందుతున్న పాలమూరు–రంగారెడ్డికి త్వరలోనే నికరజలాలు రావడం ఖాయమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తోందని త్వరలో కృష్ణాజలాల్లో తెలంగాణ వాటా అవార్డు పాస్‌కానుందని, తీర్పు రాష్ట్రానికి అనుకూలంగా వస్తుం దని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. తద్వారా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నికరజలాలు లభించనున్నాయని అన్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో శనివారం స్థానిక ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ‘సాగునీటి సాధన సభ’లో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. ప్రస్తుతం వరద జలాల ఆధారంగా చేపడుతున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపు ఉంటుందన్నారు. అప్పుడు నీటి పంపింగ్‌ ప్రక్రియ 60 రోజుల నుంచి 120 రోజులకు పెరుగుతుందన్నారు. అయితే కోర్టులో కేసు ఉన్నందున బహిరంగంగా అన్ని విషయాలు చెప్పలేమన్నారు. కృష్ణాలో లభ్యమయ్యే నీటి ద్వారా ప్రప్రథమంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు లాభం చేకూరుతుందని వెల్లడించారు. అలాగే గోదావరి జలాల ద్వారా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని మెజార్టీ భాగానికి నీరందిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో వలసల జిల్లా పాలమూరును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని హరీశ్‌రావు వివరించారు. 

ఉత్తమ్‌ క్షమాపణ చెప్పాలి
రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి సాగునీరి వ్వడానికి సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్‌ నేతలు  కేసులు వేస్తూ అడ్డు పడుతున్నారని, అందుకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల నల్లమల అటవీప్రాంతం దెబ్బతింటుందని కాంగ్రెస్‌ నేత హర్షవర్ధన్‌రెడ్డి గ్రీన్‌ట్రిబ్యునల్‌ లో కేసు వేశారని, ప్రాజెక్టు కింద భూములను సేకరించవద్దంటూ మరో కాంగ్రెస్‌ నేత హైకోర్టులో కేసు వేశారన్నారు. వీరి వల్లే ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు. కేసును ఉపసంహరించుకుంటే కేవలం 3 నెలల్లోనే లైనింగ్‌కాల్వల పనులు చేపడతామన్నారు. కాంగ్రెస్‌ నేతలకు రైతులపై ప్రేమ ఉంటే కేసును ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top