Sakshi News home page

యూపీఏ బాటలోనే ఎన్డీయే

Published Thu, Jul 31 2014 2:18 AM

యూపీఏ బాటలోనే ఎన్డీయే

* కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో బీజేపీ
* మైనార్టీ వర్గాలపై పెరిగిన దాడులు
* వామపక్షాలే దేశంలో ప్రత్యామ్నాయం
* త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్
* వరంగల్‌లో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలు

 
 సాక్షి ప్రతినిధి, వరంగల్: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం యూపీఏ దారిలోనే పయనిస్తోందని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విమర్శించారు. బీజేపీ పాలన.. పదేళ్ల యూపీయే ప్రభుత్వాన్ని తలపిస్తోందని చెప్పారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 8వ జాతీయ మహాసభలు వరంగల్‌లో బుధవారం ప్రారంభమయ్యూయి. ఆగస్టు 2 వరకు ఈ మహాసభలు జరుగనున్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో మాణిక్ సర్కార్ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో బీజేపీ సర్కార్ ఉందని, వారి ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోందని విమర్శించారు. రైల్వే, సాధారణ బడ్జెట్‌లలో ధనికులకు, కార్పొరేట్ శక్తులకు పెద్ద పీట వేశారని విమర్శించారు.
 
  రైల్వే రవాణా, ప్రయాణ చార్జీలు, పెట్రోల్ ధరలు పెరిగాయని విమర్శించారు. బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్ ఆత్మగా పనిచేస్తోందని, దీని పట్టు నుంచి తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మితవాద శక్తులు విజృంభించాయని పేర్కొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉపాధిహామీ చట్టాన్ని మార్పులు చేస్తామంటూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను అరికట్టి, దోపిడీ శక్తులను నిరోధించేందుకు వామపక్షాలే సరైన ప్రత్యామ్నాయమని చెప్పారు. దేశవ్యాప్తంగా విస్తరించి బలమైన ఉద్యమానికి ఈ మహాసభలు నాంది పలకాలని ఆకాంక్షించారు.
 
 సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్ ఆవేదన వ్యక్తం చేశారు.సామాన్యులకు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే సమయంలో పక్కదారి పట్టించేందుకు రెచ్చగొట్టే కుట్రలకు అవకాశం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చంద్రబాబు లాంటివారు ఈ విషయంలో ముందుంటారని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు ప్రసంగించారు. సభకు ముందు వరంగల్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

What’s your opinion

Advertisement