ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు!  

MPP Reservations Mahabubnagar - Sakshi

అచ్చంపేట: వరుస ఎన్నికలతో మరోసారి పల్లెలు సందడిగా మారనున్నాయి. లోక్‌సభతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్‌ వరకు ఎన్నికల కోలాహలం ఉండడంతో రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. ఇక అధికారులు ఓటర్లు, మున్సిపల్‌ వార్డులు, పరిషత్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక్కో తంతు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పార్లమెంట్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మమ్మురమైంది.

ఇప్పటికే ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలోని 71మండల ప్రజాపరిషత్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలో ఒక మండలం ఏజెన్సీ ఏరియాలో ఉంది. మిగిలిన 70మండలాల్లో 50శాతం అంటే 35మండలాల ఎంపీపీ స్థానాలను జనరల్‌కు కేటాయించారు. మిగిలిన వాటిలో ఏడు ఎస్టీలకు, 14 ఎస్సీలకు, 14 బీసీలకు రిజర్వ్‌ చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరిలో అన్ని స్థానాల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్‌ చేయాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన, బీసీ రిజర్వేషన్లు ఓటర్ల ప్రకారం నిర్ణయించారు.

గతంలో ఇలా.. 
గతంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీలు జిల్లా పరిషత్‌లో నామినేషన్లు వేయగా, ఎంపీటీసీలు ఆయా మండలాల్లో సమర్పించేవారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని సవరించి జెడ్పీటీసీలు మండల కేంద్రాల్లోని మండల పరిషత్‌ కార్యాలయాల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా మూడు ఎంపీటీసీ నియోజకవర్గాలకు ఒక రిటర్నింగ్‌ అధికారిని నియమించి నామినేషన్లు స్వీకరించే విధంగా నిర్ణయించారు. దీంతో ఇటు జెడ్పీటీసీ, అటు ఎంపీటీసీ అభ్యర్థులకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఉమ్మడి జిల్లా ఉన్న సమయంలో జిల్లాలో దూర ప్రాంతాల నుంచి జిల్లాకేంద్రానికే వచ్చి నామినేషన్ల పత్రాలు సమర్పించే విషయంలో ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు ఎన్నికల సంఘం వెసులుబాటు కలిగించడంతో ఊరట కలగనుంది. 

600–700మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం 
600 మంది నుంచి 700 మంది ఓటర్ల వరకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు ఓటరు జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం తిరిగి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టింది. ఈ ఎన్నికల్లో చాలా ఓట్లు గల్లంతు కావడంతో వాటిని తిరిగి చేర్పించేందుకు ఓటర్ల నమోదు ముసాయిదా నిర్వహించారు.

ఓటర్లు కూడా పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నారు. అసెంబ్లీ ఓటర్లతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో దాదాపు 2లక్షల ఓటర్లు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. తుది జాబితాను ఫిబ్రవరి 22వ తేదీన ప్రకటించారు. ఈ జాబితాను ఆధారంగా చేసుకునే ఈ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్లను విభజించనున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాకు కసరత్తు  మొదలుపెట్టారు. ఇటీవల నూతనంగా తయారు చేసిన ఓటర్ల జాబితాను కలెక్టర్‌ ద్వారా తీసుకున్నారు. దాని ఆధారంగానే గ్రామాల వారీగా ఆయా వార్డుల జాబితాను తయారు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వీటి ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు.

అనంతరం ఎంపీటీసీల నియోజకవర్గాల వారీగా తయారు చేసి ఈ నెల 27న తుది జాబితాను ప్రకటించనున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కొత్తగా పదర, చారకొండ, పెంటవెల్లి, ఊర్కొండ, వనపర్తి జిల్లాలో చిన్నంబావి, మదనాపురం, శ్రీరంగాపూర్, జోగుళాంబ జిల్లాలో కేటీ దొడ్డి, రాజోళి, ఉండవెల్లి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో మరికల్, మూసాపేట, రాజాపూర్, కృష్ణా మండలాలు ఏర్పడ్డాయి. పాత మండల పరిషత్‌లో ఉన్న ఈ మండలాల్లో కొత్త పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఏ జిల్లాకు ఆ జిల్లా  జెడ్పీటీసీలతో కొత్తగా జిల్లా పరిషత్‌ ఏర్పాటు కానుంది. మొత్తం ఉమ్మడి జిల్లాలో కలిపి ప్రస్తుతం 71 జెడ్పీటీసీ, 804 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top