రైతుల బంధువు కేసీఆర్‌

MP Kavitha Comments On CM KCR - Sakshi

అన్నదాతను ఆదుకునేందుకు పెట్టుబడి

రూ.25 వేల కోట్లతో  ప్రాజెక్టుల నిర్మాణం

నిజామాబాద్‌ ఎంపీ కవిత 

జగిత్యాలరూరల్‌/సారంగాపూర్‌/రాయికల్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే ఎక్కడా లేని, ఎవరూ కనీసం ఆలోచించని గొప్ప పథకం రైతుబంధును సీఎం కేసీఆర్‌ ప్రారంభించారని పేర్కొన్నారు. రైతుల బంధువుగా, అన్నదాత మోములో ఆనందం చూడాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతిష్టాత్మక రైతుబంధు పథకాన్ని జగిత్యాల మండలం గుల్లపేట, సారంగాపూర్‌ మండలం నాగునూర్, లచ్చక్కపేట, బీర్‌పూర్‌ మండలంలోని మంగేళ, రాయికల్‌ మండలం ఒడ్డెలింగాపూర్‌లో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రైతులకు పెట్టుబడి చెక్కులు, కొత్త పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎంపీ మాట్లాడారు.

రైతుబిడ్డ సీఎం కేసీఆర్‌ అని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎకరానికి పంటకు రూ.4 వేలు ఆర్థిక సహాయం రైతులకు అందించి పెద్ద కొడుకులా నిలిచారని అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా, తెలంగాణ మాగాణాను సస్యశ్యామలం చేయలని, లక్ష ఎకరాలను సాగులోకి తేవాలని కేసీఆర్‌ నిరంతంరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే రూ.25 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నారని, పంటలు సాగుచేసేందుకు రైతులు అప్పులు చేయకుండా ఉండేందుకు పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నారని చెప్పారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం ఈ పథకం ప్రవేశపెట్టలేదన్నారు. రైతు సంతోషంగా ఉండి పది మందికి పనికల్పించి వారికి అన్నం పెట్టే రోజు రావాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు.

రైతులు పండించిన పంటలకు రైతులే ధర నిర్ణయించాలని కేసీఆర్‌ రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశారని తెలిపారు. బీడీ కార్మికులకు పింఛన్లు, గొ ర్రెల పథకం, గంగపుత్రులకు చేపల పంపిణీ పథకాలు కూడా తెలంగాణలోనే ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో మిషన్‌ భగీరథ పథకం చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తరువాత 18 లక్షల మెట్రిక్‌టన్నుల గోదాముల నిర్మాణం జరిగిందన్నారు. సోషలిస్ట్‌ ఎజెండా, టీఆర్‌ఎస్‌ పార్టీ  ఎజెండా ఒక్కటేనని ఆమె మంగేళ గ్రామంలో జరిగిన సభలో పునరుద్ఘాటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తామని స్పస్టం చేశారు. ఒడ్డెలింగాపూర్‌ గ్రామంలో గౌడ సంఘం, వడ్డెర సంఘం, అంబేద్కర్‌ సంఘ భవనానికి ప్రహరీ, మహిళ సంఘ భవనానికి రూ.5 లక్షల చొప్పున, లోక్‌నాయక్, మాంక్త్యానాయక్‌ తండాకు రోడ్డు సౌకర్యం నిధులు మంజూరు చేస్తామన్నారు.

రాయికల్‌లో డిగ్రీ కళాశాలలో లెక్చరర్ల భర్తీ కోసం డెప్యూటీ సీఎంతో మాట్లాడి యుద్ధప్రతిపాదికన కాంట్రాక్ట్‌ లెక్చరర్లను తెస్తామని, జూన్‌లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తరగతులు నిర్వహిస్తామన్నారు. కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ జిల్లాలో రైతుబంధు పథకం కోసం వంద బృందాలను ఏర్పాటు చేశామన్నారు. రెండు లక్షల మంది రైతులకు రూ.167 కోట్ల చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 17 వరకు ఉదయం 7 గంటల నుంచి పంపిణీ ప్రారంభిస్తామన్నారు. అటవీ భూములకు కూడా జిల్లాలో రూ.3 కోట్ల పెట్టుబడి అందించడం జరుగుతుందన్నారు. అనంతరం జగిత్యాల మండలానికి రూ.10.30 కోట్ల చెక్కులను రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్లకు అందజేశారు.

కార్యక్రమాల్లో   ఆర్డీవో నరేందర్, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మీ,  తహసీల్దార్లు వెంకటేశ్, వసంత, రాజేందర్, ఎంపీడీవో పుల్లయ్య, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ సంజయ్‌కుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వినర్‌ చీటి వెంకట్రావు, జగిత్యాల మార్కెట్‌ చైర్‌పర్సన్‌ శీలం ప్రియాంక, రాయికల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మ న్‌ ఎనగందుల ఉదయశ్రీ, ఎంపీపీలు కొల్ముల శారద, పడాల పూర్ణిమ, సర్పంచులు  ముదిగొండ శేఖర్, అమృత, ఎంపీటీసీలు లక్ష్మి, గంగధర విజయ, విండో చైర్మన్‌ ముప్పాల రాంచందర్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఎంపీకి ఘన స్వాగతం..

జగిత్యాల మండలం గుల్లపేట గ్రామంలో ఎంపీ కవితకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో రాగా రైతులు ఎడ్లబండ్లతో వచ్చి ఎంపీ కవితను ఎడ్లబండిపై ఎక్కించుకుని సభా వేదిక వద్దకు తీసుకెళ్లారు. వేదికపై గీత కార్మికులు తాటిముంజలు అందజేయగా, రైతులు పండించిన ఎల్లిగడ్డలు, మామిడి కాయలతో దండచేసి అందజేశారు.

 వేదిక ఎక్కని జెడ్పీటీసీ..

జగిత్యాల మండలం గుల్లపేట గ్రామంలో చేపట్టిన రైతుబంధు పథకంలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరు కాగా సభ వేదిక వద్ద జెడ్పీటీసీ తమకు అధికారులు సమాచారం అందించలేదని, వేదిక ఎక్కకుండా జనంలోనే కూర్చున్నారు. కలెక్టర్‌ శరత్‌ జెడ్పీటీసీని స్టేజీపైకి రావాలని పిలిచినా వెళ్లలేదు. ఏడీఏ రాజేశ్వర్‌ జెడ్పీటీసీకి క్షమాపణ చెప్పినా ఆమె వేదికపైకి వెళ్లలేదు. అధికార పార్టీకి చెందిన జెడ్పీటీసీ వేదికపైకి వెళ్లకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top