చివరి చూపు దక్కలేదు.. | Mother Died in Hyderabad Old City And Daughters In Saudi Arabia | Sakshi
Sakshi News home page

చివరి చూపు దక్కలేదు..

Mar 22 2018 8:33 AM | Updated on Mar 22 2018 8:33 AM

Mother Died in Hyderabad Old City And Daughters In Saudi Arabia - Sakshi

అఫ్సర్‌ బేగం (ఫైల్‌)

చార్మినార్‌: తన కూతుళ్ల కోసం నెలల తరబడి ఎదురు చూసిన తల్లి తన కోరిక తీరకుండానే బుధవారం ఉదయం కన్నుమూసింది. పాతబస్తీ బండ్లగూడకు చెందిన నూరీనగర్‌కు చెందిన అఫ్సర్‌ బేగం (57) గత కొంతకాలంగా విదేశాల్లో ఉన్న తమ ఇద్దరు కూతుళ్ల కోసం ఎదురు చూస్తుంది. ఈ మేరకు గత జనవరిలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు వినతిపత్రం అందజేసింది. వితంతువునైన తాను గత పక్షవాతంతో బాధపడుతున్నానని, సౌదీ అరేబియాలో నరకయాతన అనుభవిస్తున్న తన కుమార్తెలను త్వరగా దేశానికి తిరిగి రప్పించాలని కోరుతూ  ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లా ఖాన్‌ సహయంతో సుష్మా స్వరాజ్‌కు ఉత్తరం రాసింది. అయితే వారు రాకుండానే బుధవారం ఉదయం కన్నుమూసినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే నూరీనగర్‌కు చెందిన నూర్‌ ఉన్నీసా బేగం, రెహానా ఉన్నీసా బేగం అక్కాచెల్లెలు. వీరి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా తీసుకున్న కాటేదాన్‌కు చెందిన అజీం, ఉస్మాన్, మసూద్‌ అనే ముగ్గురు ట్రావెల్‌ ఏజెంట్లు సౌదీలో బ్యూటీషియన్‌గా ఉద్యోగం ఇప్పిస్తామని నూర్‌ ఉన్నీసా బేగంకు ఎరవేశారు.

అయితే నూర్‌ ఉన్నీసా బేగం వితంతువు కావడంతో ఒంటరిగా వెళ్లడానికి అంగీకరించకపోవడంతో ఆమె సోదరి రెహానా ఉన్నీసా బేగంను సైతం సౌదీకి పంపేలా వారి తల్లి అఫ్సర్‌ బేగంపై ఒత్తిడి తెచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో వీరిని వేర్వేరుగా సౌదీలోని అల్‌ కసర్, రియాద్‌లకు పంపించారు. అప్పటి నుంచి వీరి కష్టాలు మొదలయ్యాయి. బ్యూటీషియన్‌ ఉద్యోగం పేరుతో పంపించి అక్కడ ఇంటి పని మనుషులుగా కుదిర్చారు. భోజనం పెట్టకుండా జీతాలు ఇవ్వకుండా వేధిస్తుండటంతో వారు ఆఫ్సర్‌ బేగంకు ఫోన్‌ చేసి పరిస్థితి వివరించారు. దీంతో ఆమె తన కూతుళ్లను నగరానికి రప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ట్రావెల్‌ ఏజెంట్లపై ఫిర్యాదు చేయడంతో చాంద్రాయణగుట్ట పోలీసులు ఈ నెల 14న కేసు నమోదు చేశారు. సౌదీలోని తమ కూతుళ్ల కోసం నెలల తరబడి ఎదురు చూసిన అఫ్సర్‌ బేగం బుధవారం మృతి చెందడంతో నూరీనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి అంత్యక్రియలకు కూతులిద్దరూ హాజరయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లా ఖాన్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement