పనులు సరే.. బిల్లులేవి? | Months of development works are completed in villages | Sakshi
Sakshi News home page

పనులు సరే.. బిల్లులేవి?

Jun 1 2017 3:10 AM | Updated on Sep 5 2017 12:28 PM

గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా..అందుకు సంబంధించిన బిల్లులు అందని దుస్థితి నెలకొంది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెల ముగుస్తుంది..

 గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా..అందుకు సంబంధించిన బిల్లులు అందని దుస్థితి నెలకొంది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెల ముగుస్తుంది...నెలాఖరులోపు సీసీ రోడ్డు వేస్తేనే బిల్లులు వస్తాయని లేకుంటే..ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు వెనక్కిపోతాయని అధికారులు చెప్పడంతో  అప్పులు తెచ్చి మరీ సదరు కాంట్రాక్టర్లు, నాయకులు గ్రామాల్లో పనులు పూర్తి చేశారు. కానీ ఇప్పుడు బిల్లులు మంజూరు కాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే బిల్లులు విడుదల చేయాలని వేడుకుంటున్నారు.

సూర్యాపేటరూరల్‌ : సూర్యాపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు 3 కోట్ల 60 లక్షల రూపాయలతో 28 సీసీ రోడ్లు వేశారు. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం శాఖ అధికారులు 90 శాతం పనులను మార్చి నెలాఖరులోపు సదరు కాంట్రాక్టర్లతో పూర్తి చేయించారు. మార్చి 31లోపు చేసిన పనులకు ఎంబీ రికార్డులు చేశారు. వారం రోజుల్లో బిల్లులు వస్తాయని అధికారులు చెప్పారని, నెలలు దాటినా బిల్లులు అందలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేయించేందుకు వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులు, సిమెంట్‌ వ్యాపారుల వద్ద సిమెంట్‌ తెచ్చి సీసీ రోడ్లు పోయించామని.. ఇప్పుడు బిల్లులు రాకపోవడంతో వారు డబ్బులివ్వాలని ఒత్తిడి చేస్తున్నారని సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టిన నాయకులు, కాంట్రాక్టర్లు వాపోతున్నారు.

కృషియల్‌ బ్యాలెన్స్‌ నిధులదీ అదే పరిస్థితి..
కృషియల్‌ బ్యాలెన్స్‌ (సీబీఎఫ్‌) నిధులు రూ.50 లక్షలతో సూర్యాపేట మండలంలోని రత్నపురం, బాలెంల గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో గాను 10 సీసీ రోడ్లు నూతనంగా వేశారు. ఒక్కో రోడ్డుకు రూ.5లక్షలు కేటాయించారు. రూ.5లక్షల పని చేస్తే అంతో ఇంతో డబ్బులు మిగులుతాయనే ఆశతో చోటామోటా నాయకులు సీసీ రోడ్లకు సంబంధించిన పనులు చేసి 8 నెలలకు పైగా అవుతాన్నా...  బిల్లులు మాత్రం అందడం లేదు. దీంతో రోడ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన డబ్బులకు వడ్డీలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటిౖMðనా సంబంధిత అధికారులు చొరవ చూపి ప్రభుత్వం, సంబంధితశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల బిల్లులు విడుదల చేయించాలని పలువురు కోరుతున్నారు.

త్వరలోనే అందుతాయి
సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్‌ బిల్లులు త్వరలోనే అందుతాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల్లోనే బిల్లులు విడుదల కానున్నాయి.
– మనోహార్,  పంచాయతీరాజ్‌ ఏఈ, సూర్యాపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement