ఎమ్మెల్యే స్టిక్కర్లు ఇంకానా

MLA stickers are still on Ex MLAs Cars in Telangana - Sakshi

     అసెంబ్లీ రద్దయినా హోదా విడువని తాజా మాజీలు

     వాహనాలపై ఇంకా ఎమ్మెల్యే స్టిక్కర్లు తీయని వైనం

     ఎన్నికల నిబంధనల ఉల్లంఘనే అంటున్న అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ రద్దయి నెల రోజులు గడిచింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ సైతం అమల్లోకి వచ్చింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలతో ప్రచారపర్వం వేడెక్కింది. అయితే, శాసనసభ రద్దయిన రోజు నుంచే ఎమ్మెల్యేలు మాజీలుగా మారారు. కేవలం సీఎం, మంత్రులు మాత్రమే తమ శాఖలోని పనులను ఆపద్ధర్మంగా నిర్వర్తిస్తున్నారు. వీరు తమ వాహనాలపై వారి హోదాను తెలియజేసేలా స్టిక్కర్లు ఉంచుకోవచ్చు. కానీ, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలు తమ కార్లపై ఎమ్మెల్యే స్టిక్కర్లు తొలగించలేదు. ఇలాంటి వాహనాలు మారుమూల ప్రాంతాలు, నియోజకవర్గాల్లోనే కాకుండా సాక్షాత్తూ రాజధానిలోనే కనిపిస్తుండటం గమనార్హం. 

నగరంలో తరచుగా.. 
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇలాంటి వాహనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమ ఉనికిని చాటుకోవడానికే తాజా మాజీ ఎమ్మెల్యేలు ఇలా స్టిక్కర్లను కొనసాగిస్తున్నారనే వాదనలున్నాయి. జిల్లాల్లో వీరికి ఒకటికి మించి వాహనాలుంటాయి. ఎమ్మెల్యే కాకుండా ఆయన అనుచరులు, పీఏలు ఇతరులు మిగిలిన వాహనాల్లో వివిధ పనులపై వెళ్తుంటారు. ఎన్నికల కోడ్‌ వెలువడిన కొత్తలో కొన్ని వాహనాలపై ఈ స్టిక్కర్లు తీశారు. మిగిలిన వాహనాలపై అలాగే కొనసాగిస్తున్నారు. వివిధ పనులపై తాజా మాజీలు నగరానికి, జిల్లా కేంద్రాలకు తిరుగుతున్నారు. ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉంచుకునే ముందుకు సాగుతున్నారు. అధికార, ప్రతిపక్షమన్న తేడా లేకుండా దాదాపుగా అన్ని పార్టీల వారు ఇదే రీతిలో వ్యవహరిస్తుండటం గమనార్హం. అయితే ఇది ఎన్నికల నియమావళి నిబంధనలకు విరుద్ధమని అధికారులు చెబుతున్నారు.

ఇటు ‘టోల్‌’.. అటు పోలీసులు
వాస్తవానికి అసెంబ్లీ రద్దయిన వెంటనే ఎమ్మెల్యేలుగా వారికి రాజ్యాంగపరంగా వర్తించే సదుపాయాలు, మినహాయింపులు దూరమవుతాయి. ఇలాంటి సదుపాయాల్లో ఒకటే టోల్‌గేట్‌ రుసుము. కానీ, చాలా చోట్ల తాజా మాజీ ఎమ్మెల్యేలు తమ స్టిక్కర్లు తీయకపోవడంతో టోల్‌గేట్‌ నిర్వాహకులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. మరోవైపు పోలీసు అధికారులు తమ ముందే ఇలాంటి వాహనాలు వెళ్తున్నా.. పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఈ వాహనాలు రాజధానిలోనూ యథేచ్ఛగా ఎమ్మెల్యే స్టిక్కర్లతో సంచరిస్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top