
ఏం తమాషాగా ఉందా?
‘ప్రభుత్వ పాఠశాలలంటే తమాషాగా ఉందా.. రోజూ పాఠశాలకు వెళుతున్నారా.. విద్యార్థులకు ఏం చెబుతున్నారు.. ఏమన్నా అంటే యూనియన్లు అంటారు.
‘పది’లో ఉత్తీర్ణత తగ్గడంపై మంత్రి మహేందర్‌రెడ్డి మండిపాటు
తాండూరు: ‘ప్రభుత్వ పాఠశాలలంటే తమాషాగా ఉందా.. రోజూ పాఠశాలకు వెళుతున్నారా.. విద్యార్థులకు ఏం చెబుతున్నారు.. ఏమన్నా అంటే యూనియన్లు అంటారు. ఉత్తీర్ణత తగ్గితే ఏమనాలి?’ అంటూ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులపై మండిపడ్డారు. శుక్రవారం జిల్లా విద్యాధికారి రమేశ్ అధ్యక్షతన రంగారెడ్డి జిల్లా తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల ఎంఈవోలు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు.
తాండూరు మండలంలో పదో తరగతిలో కేవలం 45 శాతం ఉత్తీర్ణత సాధించడం పై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జినుగుర్తిలో 18 శాతం ఉత్తీర్ణత రావడంపై విస్తుపోయారు. మంచి ఫలితాలు సాధించిన పాఠశాలల హెచ్‌ఎంలను మంత్రి ప్రశంసించారు. బషీరాబాద్ ఉర్దూ మీడియంలో 30 శాతం ఫలితాలే రావడంపట్ల వికారాబాద్ ఉప విద్యాధికారి హరిశ్చందర్‌ను మంత్రి ప్రశ్నించారు. ఉత్తీర్ణత తగ్గిన పాఠశాలల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఈవోను మంత్రి ఆదేశించారు.