ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌

Published Sat, Dec 21 2019 4:33 AM

Medicine And Health Department Decided To Keep Biometrics In Government Hospitals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ హాజరు వ్యవస్థను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. తొలుత 30 శాతం ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. హాజరు శాతం అత్యంత తక్కువగా ఉన్న అన్ని కేటగిరీ ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని శాఖ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులన్నింటిలోనూ దీన్ని అమలు చేస్తారు. వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు శాతం తక్కువగా ఉండటంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.

దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా పలుమార్లు హెచ్చరించారు. అయినా సిబ్బంది తీరులో మార్పు రావడంలేదు. దీనికి సంబంధించి గురువారం ‘సాక్షి’లో ‘పల్లె నాడి పట్టని డాక్టర్‌’శీర్షికతో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో బయోమెట్రిక్‌ వ్యవస్థను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యుల గైర్హాజరుకు చెక్‌ పెట్టేందుకు దీనిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. హాజరు తక్కువగా ఉన్న 30 శాతం ఆస్పత్రుల వివరాలను అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జాబితా ఆధారంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement