మాస్క్‌లు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌ల తయారీ

Masks And Sanitization Projects Income For Dwcra And Women Groups - Sakshi

మహిళా సంఘాలకు ఆదాయ మార్గాలు

నైపుణ్యం గల సభ్యులను గుర్తిస్తున్న డీఆర్‌డీఏ

యూనిట్‌ స్థాపనకు రూ.2.50 లక్షల చేయూత

ఇప్పటికే 4 లక్షల మాస్క్‌ల ఆర్డర్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలను స్వయం సహాయక మహిళా సంఘాలు ఆదాయ వనరులుగా మలుచుకుంటున్నాయి. వైరస్‌ కట్టడిలో భాగస్వాములు కావడమే కాకుండా జీవనోపాధి కూడా పొందనున్నారు. కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడంలో మాస్క్‌లు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లు కీలకంగా మారుతున్న విషయం తెలిసిందే. వీటిని తయారు చేయడంపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. ఈ బాధ్యతలను మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. మాస్క్‌లు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌ల తయారీకి మహిళా సంఘాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) గుర్తించే పనిలో నిమగ్నమైంది. 

మాస్క్‌ల తయారీ..
మాస్క్‌ల తయారీ బాధ్యతలను ఫరూఖ్‌నగర్, నందిగామ, మహేశ్వరం, శంకర్‌పల్లి మండలాల్లో మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. టైలరింగ్‌లో నైపుణ్యం గల 400 మంది సభ్యులను గుర్తిస్తున్నారు. తిరిగి వినియోగించగలిగే (రీ యూజ్‌) మాస్క్‌ల తయారీకి అవసరమైన వస్త్రం, దారం, ఎలాస్టిక్‌ తదితర ముడిసరుకులు కొనుగోలు చేయాల్సి ఉంది. టెస్కో నుంచి వస్త్రాన్ని తీసుకునే అంశాన్ని యంత్రాంగం పరిశీలిస్తోంది. ఒక్కో మాస్క్‌ నాణ్యత, పొడవు, వెడల్పుని బట్టి ధర నిర్ణయిస్తారు. ఇప్పటికే తమకు నాలుగు లక్షల మాస్క్‌లు కావాలని డీఆర్‌డీఏకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలిసింది.

ఖరారైన ధరను బట్టి ఆ మొత్తాన్ని డీఆర్‌డీఏకు వైద్యశాఖ చెల్లించనుంది. ఈ మాస్క్‌లను ఉపాధి కూలీలు, పింఛన్‌దారులు, నిస్సహాయులకు అందించనున్నారు. నిర్దేశిత ఒక్కో మండలంలోని సభ్యులు లక్ష చొప్పున మాస్క్‌లు కుట్టాల్సి ఉంటుంది. ఇవిగాక మరో లక్ష మాస్క్‌ల ఆర్డర్‌ కూడా వచ్చింది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్, కలెక్టరేట్‌ తదితర విభాగాలు తమకు మాస్క్‌లు కావాలని కోరింది. వీటిని గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని విద్యార్థులు, ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అందించనున్నారు.  

మహిళా సంఘాలకు బాధ్యత
ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌ తయారీ బాధ్యతలను మంచాల, ఫరూఖ్‌నగర్, తలకొండపల్లి, శంషాబాద్‌ మండలాల్లోని మహిళా సంఘాలకు ఇవ్వనున్నారు. ఒక్కో మండలంలో 15 నుంచి 20 మంది సభ్యులకు దీని ద్వారా ఉపాధి లభించనుంది. ఆర్డర్లను బట్టి వీటిని తయారు చేస్తారు. పరిమాణాన్ని బట్టి ధరలు నిర్ణయించనున్నారు. వీటి తయారీ కోసం ఆర్థిక సహాయాన్ని కూడా యంత్రాంగం అందిస్తుంది. ఒక్కో మండలంలో యూనిట్‌ నెలకొల్పడానికి రూ.2.50 లక్షల చొప్పున ఇవ్వనుంది. ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గులలో ఇప్పటికే సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న శానిటైజర్‌ తయారీ యూనిట్‌లో మరింత బలోపేతం చేయనున్నారు. అదేవిధంగా తలకొండపల్లి, మంచాల, శంకర్‌పల్లి, శంషాబాద్‌ మండలాల్లోని మహిళా సభ్యులు హ్యాండ్‌వాష్‌ తయారు చేయనున్నారు. ఈ యూనిట్‌ నెలకొల్పేందుకు కూడా ఒక్కో మండలానికి రూ.2.50 లక్షల ఆర్థిక చేయూతను ప్రభుత్వం ఇవ్వనుంది. ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌ ఆర్డర్‌ ఇస్తే తయారు చేసి అందజేస్తారు. పరిమాణాన్ని బట్టి ధరను త్వరలో నిర్ణయించనున్నారు.  

సభ్యులను గుర్తిస్తున్నాం..
ప్రభుత్వం సూచనల మేరకు కోవిడ్‌–19 యాక్టివిటి కింద మహిళా సంఘాలకు మాస్క్‌లు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌ల తయారీ బాధ్యతలను ఇవ్వనున్నాం. నైపుణ్యం గల సంఘాల సభ్యులను గుర్తిస్తున్నాం. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ కొలిక్కి రానుంది. సంఘాల సభ్యుల జీవనోపాధికి ఇది చక్కటి మార్గం. అంతేగాక ఈ పనులు చేయడానికి వారికి ఆర్థికంగా కూడా చేయూతనందిస్తున్నాం.– ప్రశాంత్‌కుమార్, డీఆర్‌డీఓ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top