మధుర ఫలం.. విషతుల్యం.. | mangos change with fruits with calcium carbide | Sakshi
Sakshi News home page

మధుర ఫలం.. విషతుల్యం..

May 25 2014 2:32 AM | Updated on Oct 9 2018 4:55 PM

ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ మొదలైంది. ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనిపిస్తున్నాయి.

 ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ మొదలైంది. ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనిపిస్తున్నాయి. మార్కెట్‌లో కంటికింపుగా కనిపించే మామిడి పండ్లు కొనుగోలు చేసిన ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. అందుకు కారణం వ్యాపారుల మధ్య ఉన్న పోటీ. సంపాదనే ధ్యేయంగా వ్యాపారులు మార్కెట్‌లోకి వచ్చే పచ్చి కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. కాల్షియం కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను వినియోగించి ఒక్కరోజులోనే కాయల రంగు, రుచి మార్చేస్తున్నారు. 30 కిలోల మామిడి కాయలను 200 గ్రాముల కాల్షియం కార్బైడ్ ఉపయోగించి పండబెడుతున్నారు.

 అలాగే ఇతర ప్రాంతాలను ఎగుమతి చేసే పండ్లను బాక్సుల్లో ప్యాక్ చేసి వాటి మధ్యలో కాల్షియం కార్బైట్ ప్యాకెట్‌లను ఉంచుతున్నారు. దీంతో అవి నిర్ధేశిత ప్రదేశానికి చేరుకునేలోగానే పండుతున్నాయి. ఇలా అన్నిదశల్లో కాల్షియం కార్బైడ్ వినియోగిస్తుండడంతో ఆ పండు సహజ రుచిని కోల్పోయి విషతుల్యం అవుతున్నాయి.  

 పట్టించుకోని అధికారులు....
 కాల్షికార్బైడ్ వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించినా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో యధేచ్ఛగా వినియోగిస్తున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా దానిని వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడతున్నారు.

 
 కాల్షియం కార్బైడ్‌తో వచ్చే వ్యాధులు....
 రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తిన్న ప్రజలు పలు వ్యాధులబారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గ ర్భిణులకు, చిన్న పిల్లలు తింటే అనేక రకాల ఆరోగ్య రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో అయితే శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు విరేచనాలు అయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేగాక కళ్ల సంబంధిత సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుందని, పరిస్థితి విషమిస్తే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులకు అబార్షన్ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కాల్షియం కార్బైడ్ వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  

 ఇలా అయితేనే మంచిది.....
 మామిడి పండ్లను చెట్టుపైనే బాగా ముదిరిన తర్వాత కోయాలి. ఆ తర్వాత గడ్డి వేసి అందులో కాయలు మగ్గబెట్టాలి. వారం రోజుల పాటు అలా ఉంచితే  మధురమైన వాసనతో పాటు రుచి, పోషక విలువలు ఉన్న మామిడి పండ్లు సిద్ధం అవుతాయి. గతంలో మామిడి పండ్లను ఇలానే పండించి విక్రయించేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement