కన్నీటి నిరీక్షణ

Man In Prison From Five Years In Gulf - Sakshi

 ఐదేళ్లుగా జైల్లోనే..

కన్నకొడుకునూ చూసుకోని దుస్థితి

ఆ యువకుడి విడుదలకు కుటుంబం ఎదురుచూపు  

 కోరుట్ల (జగిత్యాల జిల్లా) : ఉపాధి కోసం ఏడారి దేశం బాట పట్టిన ఆ యువకుడు అనుకోని పరిస్థితుల్లో కటకటాలపాలయ్యాడు. ఐదేళ్లుగా జైలులోనే మగ్గుతున్నాడు. జైలు నుంచి అతడిని తిరిగి రప్పించాలని కుటుంబ సభ్యులు ఎందరిని వేడుకున్నా ఫలితం దక్కడం లేదు.  జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన కొత్త గంగన్న ఉపాధి నిమిత్తం కొన్ని సంవత్సరాలుగా కువైట్‌కు వెళ్లి వస్తున్నాడు.

తన కొడుకు రాహుల్‌ను కూడా కువైట్‌ తీసుకెళ్తే ఏదో ఓ పనిచేసుకుని బాగుపడతాడని యోచించాడు. ఈ క్రమంలోనే ఇరవై సంవత్సరాల వయసులోనే 2012లో సరితతో రాహుల్‌కు వివాహం జరిపించారు. పెళ్లయిన నాలుగు నెలల పాటు స్థానికంగా ఉన్న రాహుల్‌ తన భార్య సరిత గర్భం దాల్చిన సమయంలోనే కువైట్‌కు పయనమయ్యాడు.

కువైట్‌లో పనిచేసుకుని ఏడాదిలోగా తిరిగివస్తాడన్న ఆశతో సరిత భర్తను సంతోషంగా పంపించింది. కువైట్‌ చేరుకున్న తరువాత రెండు నెలల పాటు బాగానే పనిచేసుకుంటూ కాలం గడిపాడు. ఇంతలో సరిత కొడుకుకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రాహుల్‌ ఎంతో సంబరపడ్డాడు. త్వరలోనే సెలవుపై ఇంటికి వస్తానని భార్య సరితతో చెప్పాడు. అయితే రాహుల్‌ 2013 సంవత్సరం ప్రారంభంలో  విపత్కర పరిస్థితుల్లో ఇరుక్కుపోయాడు. 

దిక్కుతోచని స్థితిలో.. 

2013 సంవత్సరం జనవరి నెలలో కువైట్‌లో రాహుల్‌ ఉంటున్న రూంకు చెందిన ఓ వ్యక్తిని అక్కడి పోలీసులు మత్తుపదార్థాలు సరాఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. ఆయనతో పాటు అదే గదిలో ఉంటున్న రాహుల్‌ను, మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కువైట్‌లోనే ఉంటున్న రాహుల్‌ తండ్రి గంగన్నకు అక్కడి పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన లేకపోవడంతో తల్లడిల్లిపోయాడు.

భార్య, కోడలుకు ఈ విషయం తెలియజేశాడు. కొడుకును జైలు నుంచి విడిపించడానికి కువైట్‌లో ఎవరిని కలవాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక గంగన్న దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడాడు. చివరికి అక్కడ తెలిసిన వాళ్లతో కలిసి ఓ న్యాయవాదిని సంప్రదించి కొడుకును విడిపించేం దుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

ఐదేళ్లుగా.. 

ఐదేళ్లుగా రాహుల్‌ జైలులోనే ఉన్నాడు. తండ్రి గంగన్న నెల రోజుల క్రితం కువైట్‌ నుంచి బోర్నపల్లికి వచ్చాడు. నెలకోసారి కువైట్‌లోని జైలుకు వెళ్లి కొడుకు రాహుల్‌ను కలుస్తున్నప్పటికీ అతను ఎప్పటికి విడుదల అవుతాడో తెలియని పరిíస్థితి. ఆరు నెలల క్రితం రాహుల్‌ తల్లి లక్ష్మీ, భార్య సరితలు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కలిసినా ఫలితం దక్కలేదు.

నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్‌లకు విన్నవించినా  ప్రయోజనం చేకూరలేదు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చొరవ చూపితే తప్ప రాహుల్‌ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు లేవని గంగన్న చెప్పాడు. రాహుల్‌ను తలుచుకుని తల్లి లక్ష్మీతో పాటు భార్య సరిత కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top