తాగిన మైకంలో నాలాలోకి దిగి... కొట్టుకుపోయి.. | man missed in nala | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో నాలాలోకి దిగి... కొట్టుకుపోయి..

Oct 15 2017 1:49 AM | Updated on Oct 15 2017 9:59 AM

man missed in nala

హైదరాబాద్‌: తాగిన మైకంలో నాలాలోకి దిగి, నీటి ఉధృతికి ఓ యువకుడు కొట్టుకుపోయిన సంఘటన హైదరాబాద్‌ జీడిమెట్లలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు భారీ వర్షం కురిసింది. అదే సమయంలో ఓ నల్ల చొక్కా వేసుకున్న యువకుడు చింతల్‌ మధుసూదన్‌రెడ్డి నగర్‌ నాలాలోకి దిగాడు. ఒక్కసారిగా నాలాలోని నీటి ఉధృతి పెరగడంతో కొద్దిసేపు సిమెంట్‌ దిమ్మెను పట్టుకుని నిల్చున్నాడు.

ఇది గమనించిన స్థానికులు గుంపులుగా అక్కడకు చేరుకుని, యువకుడిని రక్షించేందుకు నీటిలోకి తాడును విసిరారు. యువకుడు తాడును గట్టిగా పట్టుకోవడంతో నెమ్మదిగా లాగడం ప్రారంభించారు. ఇక బయటికి వచ్చినట్లే అనుకుంటుండగా తాడు యువకుడి చేజారింది. దీంతో ప్రవాహ ఉధృతిలో అతను కొట్టుకుపోయాడు. అంత మంది ఉండి.. కళ్ల ముందే ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోతుండటంతో కాపాడేందుకు కొందరు స్థానికులు నాలా వెంట పరుగు తీశారు.

నాలాలో నీరు ఎక్కువగా వస్తుండటంతో యువకుడు కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న ఎస్సై వీరబాబు ఇతర పోలీసులతో వెంటనే రంగంలోకి దిగారు. ద్వారకానగర్‌ నాలా వద్ద చెత్త తట్టుకుని ఉండటంతో జేసీబీతో తొలగించారు. ప్రవాహ వేగానికి అక్కడికి కొట్టుకుని వస్తాడని భావించినా, యువకుడి ఆచూకీ లభ్యంకాలేదు. కాగా తాగిన మైకంలోనే యువకుడు నాలాలోకి దిగాడని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ యువకుడు ఎవరన్న విషయం ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement