
‘మాఫీ’పై వారంలో మార్గదర్శకాలు
రైతుల రుణ మాఫీపై వారంలోగా మార్గదర్శకాలు వెలువడే అవకాశముందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) అభిప్రాయపడింది.
ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ దాస్ వెల్లడి
లక్షలోపు రుణాలు వడ్డీతో కలిపి రూ. 18 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణ మాఫీపై వారంలోగా మార్గదర్శకాలు వెలువడే అవకాశముందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) అభిప్రాయపడింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదే శాలు రాలేదని కమిటీ కన్వీనర్ దాస్ గురువారం వెల్లడించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకర్ల నుంచి సమాచారం సేకరిస్తామని, ఆ తర్వాతే పూర్తి లెక్కలు తేలుతాయని గురువారం ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ‘మా వద్ద ఏమీలేదు. మేం కేవలం బ్యాంకులకు, ప్రభుత్వానికి మధ్యవర్తులం మాత్రమే. ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా రుణమాఫీ ఉంటుంది. ఎప్పుడు ఏ సమాచారం కావాలంటే దాన్ని ప్రభుత్వానికి అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా, ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రద్దయ్యే లక్ష లోపు పంట రుణాల మొత్తం దాదాపు రూ. 18 వేల కోట్లుగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో అసలు రూ. 15 వేల కోట్లు కాగా.. వడ్డీ రూ. 3 వేల కోట్లుగా ఉంది. ఆర్‌బీఐ నిబంధనల మేరకు రీ-షెడ్యూల్ అయ్యే రుణాలు సుమారు రూ. 5500 కోట్లు ఉండొచ్చని అంచనా. 50 శాతం పంట దిగుబడి తగ్గడం లేదా 50 శాతం లోపు పంటలు వేయడం, కరువు, వరదలు తదితర పరిస్థితుల్లో రీ-షెడ్యూల్ చేస్తారు. ఇక సహకార సంఘాల ద్వారా ఆప్కాబ్ ఇచ్చిన రుణాలు రూ. 2,634 కోట్ల వరకు ఉన్నాయి. ఇందులో 97 శాతం వరకు అంటే రూ. 2,555 కోట్ల రుణాలు లక్షలోపువే. ఇవ న్నీ రుణమాఫీ కింద రద్దయ్యే అవకాశమున్నట్లు ఆప్కాబ్ జీఎం నాగమల్లేశ్వరరావు పేర్కొన్నారు. తద్వారా 9.5 లక్షల మంది రైతులు లబ్దిపొందుతారు. వీరంతా రెండు మూడు ఎకరాల ఆసాములే. రుణమాఫీతో లబ్దిపొందే వారిలో పావు వంతు మంది సహకార రుణాలు తీసుకున్న రైతులే. ఒకరకంగా చెప్పాలంటే వాణిజ్య బ్యాంకుల్లో తీసుకున్న రుణాల కంటే తమ వద్ద తీసుకున్న రుణాలే పూర్తిగా రద్దవుతాయని ఆప్కాబ్ వర్గాలు చెబుతున్నాయి.