
ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, టిల్లర్లపై భారీగా తగ్గనున్న ధరలు
విత్తనాలు, ఫెర్టిలైజర్ డ్రిల్ టిన్‌లు కూడా..
పాల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకూ మేలే..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం జనరల్ సర్వీస్ గూడ్స్ (జీఎస్టీ) శ్లాబులను ఈనెల 22వ తేదీ నుంచి తగ్గించనున్న నేపథ్యంలో వ్యవసాయరంగం పురోగతికి మార్గం సుగమం అవుతోంది. వ్యవసాయ పరికరాల ధరలు భారీగా తగ్గడం రైతులకు మేలు చేకూర్చేది అయితే.. అదే సమయంలో పాల ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు శ్వేతవిప్లవానికి మరింత ఊతం ఇస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయానికి వినియోగించే పలు పరికరాలపై జీఎస్టీ తగ్గింపు అనుకూలంగా ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
వివిధ రకాల పరికరాల వినియోగంలో రూ. 5 వేల నుంచి దాదాపు రూ. 1.90 లక్షలు రైతులకు ఆదా అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరికరాల తగ్గింపు ఒకటైతే.. రైతులు విక్రయించే పాలతో చేసే ఉత్పత్తులపై కూడా జీఎస్టీ తగ్గింపు వల్ల వీటి వినియోగం పెరగడం, దీని వల్ల ఉత్పత్తులు పెరిగి రైతులకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపు 10 కోట్ల మంది పాల ఉత్పత్తిదారులకు జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రయోజనం చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది, పాలు, పన్నీర్‌పై జీఎస్టీని పూర్తిగా తొలగించడంతో పాల ఉత్పత్తిదారులతోపాటు, వినియోగదారులకు కూడా మేలు జరుగనుంది.
సహకార సంఘాలు, ఆహారాలను శుద్ధిచేసే పరిశ్రమలు తయారుచేసే చీజ్, పాస్తా, నమ్కీన్, జామ్స్, జెల్లీ, ఫ్రూట్ పల్ప్, ఆహార పానీయాలపై కొత్త జీఎస్టీ విధానంలో ఐదు శాతానికి తగ్గించనున్నారు. ఈ ధరను తగ్గించడం వల్ల కుటుంబంపై నెలసరి భారం కొంతమేరకు తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 1,800 సీసీ ఉండే ట్రాక్టర్లు, అలాగే రైతులు వినియోగించే అమ్మోనియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్‌లపై కూడా జీఎస్టీ తగ్గిస్తున్నట్లు అధికారవర్గాలు వివరించాయి. బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్‌పై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీ శ్లాబును ఐదు శాతానికి తగ్గించడం వల్ల రైతులపై భారం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.
సేంద్రియ, ప్రకృతి వ్యవసాయానికి ఆలంబనగా ఉంటుందని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి ఈ తగ్గింపు కారణంగా ప్రయోజనం చేకూరనుంది. డెయిరీ రంగంలో రైతులు, మహిళా సంఘాలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. రైతులు వినియోగించే కొన్ని పరికరాల ధరలు ప్రస్తుతం జీఎస్టీ తగ్గింపు వల్ల ఏ మేరకు తగ్గుతాయో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ధరలు తగ్గేవాటిలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి.