చుక్కల్లో ‘దీపం’ | Large increases in lights prices | Sakshi
Sakshi News home page

చుక్కల్లో ‘దీపం’

Oct 18 2017 12:52 PM | Updated on Mar 28 2018 11:26 AM

Large increases in lights prices - Sakshi

దీపావళి వంటి పండుగ సందర్భంగా ప్రతి ఇంటా కొవ్వొత్తులు, నూనె పోసి దీపాంతలతో దీపాలు వెలిగించడంతోపాటు టపాకాయలు కాల్చడం ఆనవాయితీగా వస్తుంది. మహిళలు ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు దొంతులు పెట్టి బొమ్మల కొలువు చేసి పండగను జరుపుకుంటారు. ఇలాంటి ప్రాధాన్యత కలిగిన దీపావళి పండుగ ఈ ఏడాది సామాన్య ప్రజలకు భారంగా మారింది. రోజురోజుకు కుల వృత్తులు అంతం అవుతున్న నేపథ్యంలో ఆయా వస్తువుల ధరలకు రెక్కలొస్తున్నాయి. గ్రామాల్లో దీపావళి  వచ్చిందంటే ఎక్కడ చూసినా కుమ్మరుల ఇంటి ముందు దీపాలు చేయడం, దొంతులు చేయడంలో నిమగ్నమయ్యేవారు. అయితే వృత్తుల మీద వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ కష్టం అవుతుండటంతో క్రమంగా వారు వృత్తులకు దూరం అవుతున్నారు. దీంతో దీపాంతలు తయారీ, దొంతులు తయారీ చేయడం పూర్తిగా మానుకున్నారు. పట్నం నుంచి దిగుమతి చేసుకొని వాటిని అమ్ముతున్నారు.

 ఇబ్రహీంపట్నం మార్కెట్లో ప్రస్తుతం ఈ దొంతులు , దీపాంతాలు లభిస్తున్నాయి. గత సంవత్సరం డిజైన్లను బట్టి డజను(12)దీపాంతాలకు రూ.45నుంచి 50 అమ్మేవారు. ప్రస్తుతం రూ.70–80 అమ్ముతున్నారు. దొంతులు గత సంవత్సరం రూ.60–70 అమ్మేవారు ప్రస్తుతం రూ.100లకు అమ్ముతున్నారు. బొమ్మలను కూడా రూ.100కు విక్రయిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీపావళి ముందు రోజు నుంచే మొదలు పెట్టి పండుగ ముగిసిన మరో రెండు రోజుల వరకు కూడా గడపకు రెండు చొప్పున ఇంటి చుట్టూ దీపాంతలు పెట్టి దీపాంతాలు పెడుతుంటారు. అయితే ధరలు ఏకంగా రూ.20–30 పెరగడంతో కొనుగోళ్లు పూర్తిగా తగ్గాయి. గతంలో ఒక్కొక్కరు పదుల డజన్ల చొప్పున దీపాంతాలను కొనుగోలు చేసే వారని.. ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో రెండు మూడు డజన్లు కొనుగోలు చేస్తున్నారని విక్రయదారులు వాపోతున్నారు.

ధరలు భాగా పెరిగాయి
గతం కంటే ఈసారి దీపాంతల ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది. నిత్యవసరాల ధరలతోపాటు వీటి ధరలు అమాంతం పెంచారు. వృత్తులు కాపాడితే ఇలా ధరలు పెరిగేవి కాదు. ఉన్నోళ్లు మాత్రమే పండుగ జరుపుకునే పరిస్థితి నెలకొంది. ఇలా పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లలో దీపావళి కాంతులు ప్రసరించవు.
– పోరెడ్డి సుమతి, సర్పంచ్‌ ఉప్పరిగూడ

ఒక్కో దొంతి రూ. 100   
ఏటా దీపావళికి ఆడ పిల్లలకు బొమ్మలు కొలువు చేస్తుంటాము. ఈసారి మా పాపకు దొంతులు పెడదామని మార్కెట్‌కు వెళితే ఏకంగా రూ.100కు ఒక్కటి అని చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత ధర లేదు.  ఇలాంటి పరిస్థితుల్లో పండుగ నిర్వహణ ఖర్చుతో కూడుకుంటోంది. ఇప్పటికే బెల్లం దొరకడం లేదు.  
– లక్ష్మి, గృహిణి  

వ్యాపారం బాగా తగ్గింది  
గతేడాదితో పోలిస్తే ఈసారి వ్యాపారం బాగా తగ్గింది. రెండు మూడు రోజులకు ముందుగా తె  చ్చినా సరుకు అమ్ముడుపోయేది. ఈ ఏడాది మాత్రం అమ్ముడవం కష్టంగా ఉంది. ధరలు పెరిగాయి.. డిమాండ్‌ తగ్గింది. అప్పు చేసి మాల్‌ తీసుకొచ్చాము. అమ్ముడు పోకపోతే మిగిలేది అప్పే.              
– రాజేష్, వ్యాపారి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement