
సాక్షి, హైదరాబాద్ : మెట్రో రైలు విషయంలో చిల్లర రాజకీయాలు చేయదలచుకోలేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ మాట్లాడుతూ... మెట్రో ప్రాజెక్ట్‌లో క్రెడిట్, డెబిట్‌ల గురించి తాము ఆలోచించడం లేదన్నారు. మెట్రో ప్రారంభోత్స పనులను కేటీఆర్ మంగళవారం సమీక్షించారు. మియాపూర్‌లో ఆయన అధికారులతో కలిసి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో మెట్రో సూపర్ డూపర్ కావడం ఖాయమన్నారు. మెట్రో రైలుతో నగరవాసుల ప్రజా రవాణా వ్యవస్థ సులభతరంగా మారుతుందని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుందని అన్నారు. మెట్రో వల్ల కొత్త తరహా ఆర్థిక కార్యకలాపాలు మొదలవుతాయని, మెట్రో రైలు ఓ కీలకమైన ప్రజా రవాణా ప్రాజెక్టు అని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం 2:15 గంటలకు మియాపూర్‌లో మెట్రో రైలును ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆయన మెట్రో రైలులో కూకట్‌పల్లి వరకు అయిదు కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నారు. తిరిగి కూకట్‌పల్లి నుంచి మళ్లీ మియాపూర్‌కు ప్రయాణిస్తారు.






