వాతావరణ మార్పుతోనే విష జ్వరాలు : కేటీఆర్‌

KTR Holds Review Meeting Over Viral Fever - Sakshi

సాక్షి, హైదారాబాద్‌ : అంటు వ్యాధుల నిర్మూలనకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అవగాహన సదస్సులతో పాటు త్వరలోనే మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. సోమవారం ఆయన మంత్రి ఈటల రాజేందర్, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఇతర అధికారులతో కలిసి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో విష జ్వరాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణ మార్పులతోనే విషజ్వరాలు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రమంతటా ప్రజలు వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు. అందరికి వైద్యం అందేలా ప్రభుత్వం యుద్ధప్రాతిక చర్యలు చేపబట్టబోతుందన్నారు. ఆస్పత్రుల్లో పరిస్థితిని మంత్రి ఈటల రాజేందర్ సమీక్షిస్తున్నారన్నారు.

మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, రోడ్ల పరిస్థితిపై సమీక్షించామని, సీజనల్‌ వ్యాధులపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక క్యాలెండర్‌ రూపొందించాలని మంత్రి సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో దోమలను నివారించవచ్చునని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కేబినెట్‌ ఆమోదిస్తే బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచుతామన్నారు. స్కూళ్లు, కాలేజీలు, అపార్ట్‌మెంట్లు, బస్తీల్లో అంటువ్యాధులు, నివారణపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అధికారులు ఉదయం 6 గంటలకల్లా విధుల్లో ఉండాలని సూచించారు. డెంగీని 15 రోజుల్లో అదుపులోకి తెస్తామని మంత్రి తెలిపారు.

వినాయక మండపాల వద్ద పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. నిర్మాణరంగ వ్యర్థాలపై నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే వాహనాలను కూడా సీజ్‌ చేస్తామన్నారు. మేయర్‌, కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో డ్రైనేజీ పెరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం జీహెచ్‌ఎంసీ బాధ్యత అని కాకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top