కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వండి 

Krishna Board Asks Telangana About Clarity  Of Andhra Pradesh Complaints - Sakshi

‘కృష్ణా’ప్రాజెక్టులపై ఏపీ చేసిన ఫిర్యాదుపై మీ అభిప్రాయం చెప్పండి

పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టుల వివరాలివ్వాలని తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ

కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ విస్తరణపైనా చెప్పాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై అభిప్రాయాలు చెప్పాలని కృష్ణా బోర్డు తెలంగాణను కోరింది. కొత్తగా నిర్మిస్తున్నారని ఏపీ చెబుతున్న ప్రాజెక్టులతో పాటు మరింత నీటిని వినియోగించుకునేలా విస్తరించిన ప్రాజెక్టుల డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు (డీపీఆర్‌) ఇవ్వాలని సూచించింది. బోర్డు, కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండానే తెలంగాణ పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్త రామదాస ఎత్తిపోతలతో పాటు మిషన్‌ భగీరథ, తుమ్మిళ్ల ఎత్తిపోతలు చేపట్టిందని ఏపీ చేసిన ఫిర్యాదుపై కృష్ణా బోర్డు స్పందించింది. ఈ ఫిర్యాదుపై అభిప్రాయాలు వెంటనే తెలపాలని తెలంగాణను కోరుతూ బోర్డు సభ్యుడు హరికేశ్‌ మీనా మంగళవారం లేఖ రాశారు.

తెలంగాణ చేపట్టిన 5 కొత్త ప్రాజెక్టులతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టిన ప్రాజెక్టులకు నీటి అవసరాలు తీరడం కష్టతరంగా మారుతుందని ఏపీ ఫిర్యాదు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. దీంతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంకు కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టుల నుంచి నీటిని తీసుకునే సామర్థ్యాన్ని సైతం పెంచారని ఏపీ చేసిన ఫిర్యాదును గుర్తుచేసింది. ఏపీ అభ్యంతరం చెబుతున్న ప్రాజెక్టులపై గతేడాది అక్టోబర్‌లో తెలంగాణ వివరణ కోరామని, ప్రాజెక్టుల డీపీఆర్‌ ఇవ్వాలని అడిగినా స్పందించని విషయాన్ని బోర్డు దృష్టికి తెచ్చారు. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని 85(8)(డీ) ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు కట్టినా బోర్డుకు ప్రతిపాదన పంపాలని, జల వివాదాల ఉల్లంఘనæ జరగట్లేదని తేలాకే బోర్డు అనుమతులు ఇస్తుందని పేర్కొన్నారు. బోర్డు అనుమతులు ఇచ్చాకే ప్రాజెక్టులపై ముందుకు పోవాల్సి ఉంటుందని తెలిపారు. పదో షెడ్యూల్‌ పేరా–7 ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై చేపడితే అపెక్స్‌ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. ఇప్పటికైనా తెలంగాణ.. అభ్యంతరాలు చెబుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కోరింది.

నీటి విడుదలను ఆపండి..
ఏపీ ఈఎన్‌సీకి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి లేఖ

నాగార్జునసాగర్‌ కుడి కాల్వ, హంద్రీ–నీవా ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు కేటాయింపుల కంటే ఎక్కువగా నీటిని వాడుకున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడాన్ని ఆపేయాలని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డికి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఎ.పరమేశం కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన లేఖ రాశారు. నాగార్జునసాగర్‌ కుడి కాల్వకు 158.225 టీఎంసీలు కేటాయిస్తే 158.264 టీఎంసీలు వాడుకున్నారని, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 47.173 టీఎంసీలు కేటాయిస్తే 47.328 టీఎంసీలు వినియోగించుకున్నారని లేఖలో పేర్కొన్నారు. కేటాయించిన నీటి కంటే అధికంగా వాడుకున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు నీటిని విడుదలను ఆపేయాలని కోరారు. రుతుపవనాలు ప్రవేశించి.. వర్షాలు కురిసే వరకూ అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. నీటి కేటాయింపు ఉత్తర్వులను విధిగా పాటించాలని.. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top