మర ఆడించాలా.. మానేయాలా?

Khareef Season Grains Center Warangal - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: పౌర సరఫరాల శాఖ, రైసుమిలర్ల నడుమ ‘రా’ రైస్‌ వివాదం తారాస్థాయికి చేరింది. 2018–19 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) వ్యవహారంలో తలెత్తిన వివాదం.. రబీ ధాన్యాన్ని రైసుమిల్లుల్లో దింపుకునేందుకు నిరాకరించే వరకు చేరింది. ఈనెల 3వ తేదీ నుంచి రబీ సీఎంఆర్‌ ధాన్యం ముట్టబోమంటూ రైసుమిల్లర్ల సంక్షేమ సంఘం బాధ్యులు ఇటీవల ప్రకటించారు. దీంతో పది రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణను ముమ్మరం చేసిన పౌరసరఫరాల శాఖకు.. రైసుమిల్లర్ల నిర్ణయంతో చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు పౌరసరఫరాలశాఖ బియ్యం సేకరణను నిలిపివేయడం, ఓ వైపు రైసుమిల్లుల్లో బియ్యం నిల్వలు నిండిన నేపథ్యంలో రబీ ధాన్యాన్ని ఎలా నిల్వ చేసుకోవాలన్న ఆందోళనను మిల్లర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ గురువారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన, ఉన్నతాధికారులతో సమీక్షలకు వస్తుండడం గమనార్హం.

వివాదం ముదురింది ఇలా...
ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం మర ఆడించేందుకు(బియ్యంగా మార్చడం) మిల్లర్లకు సీఎంఆర్‌ కింద ధాన్యం కేటాయిస్తుంది. ఇదే క్రమంలో 2018–19 ఖరీఫ్‌ సీజన్‌లో వరంగల్‌ అర్బన్, రూరల్‌ జిల్లాల్లో మొత్తం 115 రా రైసుమిల్లులకు 1,25,499 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించారు. ఈ ధాన్యాన్ని మర ఆడించిన రైసుమిల్లర్లు 84,186 మెట్రిక్‌ టన్నుల బియ్యంను పౌరసరఫరాలశాఖ ద్వారా ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రైసుమిల్లర్లు 55,350 మెట్రిటన్నుల బియ్యం సరఫరా చేయగా.. ఇంకా 28,836 మెట్రిక్‌ టన్నుల బియ్యం అందజేయాల్సి ఉంది.

ఈ మొత్తం బియ్యాన్ని సైతం పంపేందుకు రైసుమిల్లర్లు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ సరఫరా చేసిన గన్నీ బ్యాగులపై స్టెన్సిల్‌(చాప) కొట్టి, కాంటా పెట్టి సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే ఫిబ్రవరి 14 నుంచి రా రైస్‌ సేకరణను నిలిపి వేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 80 రోజులుగా బియ్యం సేకరణ నిలిచిపోయింది. ఎఫ్‌సీఐకి పంపితే వారు కూడా తీసుకోవడం లేదని, ఫలితంగా బియ్యానికి పురుగులు పడుతున్నాయని రైసుమిలర్ల సంఘం నాయకులు ఇటీవల వెల్లడించారు. ఇకనైనా ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ స్పందించి బియ్యం తీసుకోనట్లయితే శుక్రవారం నుంచి రబీ సీఎంఆర్‌ ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా సహాయ నిరాకరణ చేపడుతామని బాయిల్, రా రైస్‌ మిల్లుల యజమానులు ప్రకటించడంతో సమస్య మరింత జఠిలంగా మారింది.

కమిషనర్‌ పర్యటన ఇలా...
పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డాక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ ఉదయం 8.30 గంటలకు వరంగల్‌ పోలీసు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని 10 గంటల వరకు అబ్కారీశాఖ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షిస్తారు. ఆ తర్వాత వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులు, జిల్లా మేనేజర్లతో సమీక్ష జరిపిన మీదట పలు రేషన్‌ దుకాణాలను పరిశీలిస్తారు. అలాగే, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను కూడా పర్యవేక్షించనున్నారు. ఆ తర్వాత జనగామ జిల్లాకు చేరుకోనున్న అకున్‌ సబర్వాల్‌ అక్కడ కూడా జాయింట్‌ కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా మేనేజర్‌ ఇతర అధికారులతో సమీక్ష జరిపి హైదరాబాద్‌ వెళ్తారు. కాగా, రైసుమిల్లర్లు, పౌర సరఫరాల శాఖల మధ్యన రా రైస్‌ వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆ శాఖ కమిషనర్‌ పర్యటించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  

రేపటి నుంచి సహాయ నిరాకరణ
మర ఆడించిన బియాన్ని తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మిల్లర్లు శుక్రవారం నుంచి సహాయ నిరాకరణకు దిగనున్నారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్‌ తదితర సంస్థల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా తరలిస్తే ఎట్టి పరిస్థితుల్లో మిల్లుల్లో దించుకోబోమని స్పష్టం చేస్తున్నారు. జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి వెంకటేశ్వర్‌రావు, కోశాధికారి దుబ్బ రమేష్‌ తదితరులు జిల్లా అధికారులకు ఈ విషయమై వినతిపత్రం సమర్పించడంతో పాటు రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ నిర్ణయాన్ని వెల్లడించారు. మిల్లుల్లో ఉన్న బియ్యం నిల్వలు ఖాళీ అయ్యే వరకు ప్రభుత్వానికి సహకరించేది లేదని స్పష్టం చేశారు. ఇదిలా వుండగా ప్రభుత్వ ఎక్స్‌అఫిషీయో కార్యదర్శి, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డాక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ గురువారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో పర్యటించన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top