మా వాళ్లు లేరా ?

శంషాబాద్ విమానాశ్రయం టెర్మినల్‌ - Sakshi


శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరుపై అభ్యంతరం

యథాతథస్థితి కొనసాగించాలని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీర్మానం

విడిపోయినా వారి పేర్లేనా.. చర్చ ఎన్టీఆర్

గురించి కాదు.. పక్క రాష్ర్టం వారి పేరుపైనే

తెలంగాణలో పీవీ, కొమురం భీం వంటి వారెందరో ఉన్నారన్న కేసీఆర్

తీర్మానానికి కాంగ్రెస్, ఎంఐఎం, వైఎస్సార్‌సీపీ, వామపక్షాల మద్దతు

టీడీపీ వ్యతిరేకత.. సవరణలు కోరిన బీజేపీ

తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటన.. విపక్షాల తీవ్ర నిరసన    

సోమవారానికి  సభ వాయిదా


 

 సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ శుక్రవారం తీర్మానించింది. ఈ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్భాగంగా ఉన్న దేశీయ టెర్మినల్‌ను వేరు చేస్తూ ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తెలంగాణ శాసనసభ విచారం వ్యక్తం చేస్తోంది.

 

 ఈ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ  నిర్ణయం తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తపరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకుని యథాతథస్థితిని కొనసాగించాలని సభ విజ్ఞప్తి చేస్తోంది’ అని తీర్మానాన్ని కేసీఆర్ చదివి వినిపించారు. ‘ఎన్టీఆర్ పేరును పెట్టడంపై ఇక్కడ చర్చ జరగడం లేదు. పక్క రాష్ట్రం వారి పేరు పెట్టడంపైనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్‌ను అగౌరవ పరచాలనే ఉద్దేశం మాకు లేదు’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల కాపీని ఈ సందర్భంగా సభలో ప్రదర్శించారు. కేంద్రంతో తమకు ఘర్షణ వైఖరి లేదని, ఇది తమ విజ్ఞప్తి మాత్రమేనని, విపక్షాలు దీన్ని వివాదం చేయొద్దని సీఎం కోరారు. కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించగా బీజేపీ మాత్రం కొన్ని సవరణలు ప్రతిపాదించింది. ఇక తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది.

 

 ఎన్టీఆర్ పేరుపై సభలో దుమారం ఉదయం సభ ప్రారంభం కాగానే శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై అధికార, విపక్షాల వాదనలతో సభ అట్టుడికింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని కాంగ్రెస్ పట్టుబట్టగా.. దీనికి అధికార పార్టీ కూడా మద్దతు పలికింది. మరోవైపు టీడీపీ, బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు చేపట్టడంతో కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు. ఎన్టీఆర్ పేరు విషయంలో తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చించిన తర్వాతే మిగతా అంశాలకు వెళ్లాలని పట్టుబట్టారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో పేరు అవసరం లేదని, రెండు రన్‌వేలు ఉన్న చోటనే రెండు పేర్లు పెడతారని, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు.

 

  సీమాంధ్రకు చెందిన నేతల పేర్లు అక్కడే పెట్టుకోవాలన్నారు. కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని దుయ్యబట్టారు. సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తిరిగి సభ ప్రారంభం కాగానే.. ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశ పెడతారని స్పీకర్ ప్రకటించారు. ఆ వెంటనే సీఎం లేచి తీర్మానం చదువబోతుండగా.. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కల్పించుకొని దేనిపై తీర్మానం చేస్తారో ముందుగా చెప్పాలన్నారు. అంతకుముందున్న ఎన్టీఆర్ పేరును తీసేశారన్నారు. ‘మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరుతో ఢిల్లీలో ఘాట్ ఏర్పాటు చేయాలని మా నాయకుడు చంద్రబాబు లేఖ రాశారు.. మీరు రాశారా?’ అని దయాకర్‌రావు ప్రశ్నించడంతో సీఎం జోక్యం చేసుకున్నారు. ‘ఢిల్లీలో పీవీ ఘాట్ ఏర్పాటు చేసి, ఆయన విగ్రహం పెట్టాలని సీఎంగా నేనే లే ఖ రాశా. మీరు చెప్పేది చెప్పండి.. ఆరోపణ లెందుకు? బట్టకాల్చి మీద వేయడం ఎందుకు?’ అని ఎర్రబెల్లి వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

 

 మరణానికి కారకులెవరు?: అక్బరుద్దీన్ ఈ సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కల్పించుకుంటూ.. ‘మహానుభావుడైన ఎన్టీఆర్ పేరు ఉంచాలని దయాకర్‌రావు అంటున్నారు. కానీ, ఆయన ఓ విషయం మరిచిపోయారు. ఆ మహా నాయకుడు ఎందుకు చనిపోయారు? ఎవరు అందుకు బాధ్యులు? ఆయన మరణానికి కారకులు ఎవరు? తమ ప్రచారం కోసం ఆ మహానుభావుని పేరు వాడుకుంటున్నారు. పేరు మార్చాలనుకున్నపుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చించి కొన్ని పేర్లను పంపిస్తుంది. అందులోని ఏైదె నా పేరు పెట్టాలి. కానీ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే పేరు ఖరారు చేయడం తీవ్రమైన విషయం’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం వచ్చిం దని సంతోషంగా ఉన్న సమయంలో పక్క రాష్ట్ర సీఎం తెలంగాణను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజల మనోభావాల ప్రకారం ప్రభుత్వాలు నడుచుకోవాలని సీపీఎం నేత సున్నం రాజయ్య చెప్పారు. తెలంగాణ ఇప్పటికే ఎన్నో సమస్యల్లో ఉంటే అగ్నిలో ఆజ్యం పోసినట్లు కేంద్రం వ్యవహరించడం సరికాదని సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ అన్నారు.

 

 పీవీ, కొమురం భీం పేర్ల ప్రస్తావన ఈ క్రమంలోనే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని తాము బలపరుస్తున్నామని ప్రతిపక్ష నేత జానారెడ్డి చెప్పారు. పీవీ నరసింహారావు, కొమురం భీం పేర్లు పెట్టాలని తీర్మానంలో పొందుపర్చాలని బీజేపీ పక్ష నేత  లక్ష్మణ్ సవరణలు ప్రతిపాదించారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కేసీఆర్, జానారెడ్డి ఎన్టీఆర్ వద్దే రాజకీయాలు నేర్చుకున్నారు. గతంలో అన్ని పథకాలకు రాజీవ్, ఇందిర పేర్లే పెట్టారు. పీవీ, కొమురం భీం వంటి వారి పేర్లు ఎందుకు పెట్టలేదు. ప్రాంతీయ సెంటిమెంట్ ఉన్నందున వారి పేర్లు పెట్టాలని కేంద్రానికి సూచించాలి’ అని పేర్కొన్నారు. తీర్మానంపై టీడీపీ సభ్యులు కూడా అభ్యంతరం తెలిపారు. ‘దేశీయ టెర్మినల్‌కు గతంలో ఎన్టీఆర్ పేరు ఉంది. గత ప్రభుత్వం కావాలనే ఆ పేరును తొలగించింది. ఇప్పుడు అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్‌గాంధీ పేరే ఉంది. ఎన్టీఆర్, రాజీవ్‌లు వేరే రాష్ట్రాలకు చెందిన వారు. తీసేయాల్సి వస్తే ఆ ఇద్దరి పేర్లు తీసేయాలి.

 

 అంతర్జాతీయ విమానాశ్రయానికి పీవీ పేరు, దేశీయ టెర్మినల్‌కు మరో పేరు పెట్టాలి. కేంద్రానికి వ్యతిరేకంగా ఉండకుండా తీర్మానాన్ని సవరించాలి’ అని ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. శంషాబాద్ టెర్మినల్‌కు బాబా షరీఫుద్దీన్ పేరు పెట్టాలని అక్బరుద్దీన్ సూచించారు. ‘గతంలో అక్కడ షరీపుద్దీన్ హజ్రత్ దర్గా ఉండేది. అవన్నీ వక్ఫ్ భూములు. అందుకే ఆ పేరును పరిశీలించాలి’ అని కోరారు.  పేరు మార్చాల్సి వస్తే కొమురం భీం పేరు పెట్టాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని  ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. దీంతో ఇది ఏకగ్రీవం కాదని అడ్డుపడుతూ బీజేపీ, టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం మధ్యే సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.

 

 ఇది సాంస్కృతిక దాడి: కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు శాసనసభలో వివిధ పక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆవేశంగా మాట్లాడారు. ‘దీన్ని తెలంగాణ ప్రజలు అసహజ చర్యగా భావిస్తున్నారు. ఇది చాలా సున్నితమైన అంశం. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా ఉన్నప్పుడు తెలంగాణపై సాంస్కృతిక దాడి జరిగింది. ఇప్పుడిప్పుడే స్వయం పాలనలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే సమయంలో ఎయిర్‌పోర్టు పేరుపై నిర్ణయం తెలంగాణపై రాయి విసిరినట్లుగా ఉంది. తమ అస్తిత్వం..అస్తిత్వ చిహ్నాలపై దాడి జరిగిందనే బాధ ప్రజల్లో బలంగా ఉంది.

 

 శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు రాజీవ్‌గాంధీ పేరిట ఉంది. అక్కడి దేశీయ టెర్మినల్‌కు మరో పేరు పెట్టాలనుకుంటే తెలంగాణలో ఎంతో మంది మహానుభావులున్నారు. దళిత నాయకుడు భాగ్యరెడ్డి వర్మ, గిరిజన నాయకుడు కొమురం భీం, సాయుధ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, షేక్ బందగీ... వీళ్లందరి పేర్లు లేవా? దక్షిణ భారతం నుంచి ఇద్దరే ప్రధానులయ్యారు. దేవెగౌడ, పీవీ నరసింహరావు. మన ప్రాంతానికి చెందిన ముద్దుబిడ్డ పీవీ పేరు పెట్టమని అడుగుదాం. అలా కాదని ఆంధ్రా నాయకుల పేర్లు పెట్టడం తెలంగాణను కించపరిచే విధంగా ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ గురించి చర్చ కాదు. ఆయన మహానుభావుడు. ఆయనను అగౌరవ పరిచే దురుద్దేశం మాకు లేదు. కాని రాష్ట్రం విడిపోయాక కూడా వారి పేర్లే పెట్టాలా? తెలంగాణ మహానుభావులే లేరా? ఇక్కడి వారి పేరు పెడితే ఏంటి? లేదంటే యథాతథంగా ఉంచండి. ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో విమానాశ్రయాలున్నాయి. ఆ నాలుగింటికీ ఎన్టీఆర్ పేరు పెట్టండి’ అని సీఎం వ్యాఖ్యానించారు.  

 

 ఎన్టీఆర్ పేరుపై మండలిలోనూ రగడ సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానశ్రయం లో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై శాసన మండలి దద్దరిల్లింది. దీనిపై అధికార, విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మండలి చైర్మన్ స్వామిగౌడ్ తన స్థానంలో కూర్చొంటున్న సమయంలోనే.. సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరును కొనసాగించాలని, ఎన్డీయే నిరంకుశ వైఖరి నశించాలంటూ నినదించారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి సభను అడ్డుకున్నారు.

 

 కేంద్రం తీరును నిరసిస్తూ మండలి తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలు పూర్తయ్యాక  ఈ అంశంపై చర్చిద్దామని చైర్మన్ నచ్చజెప్పినా సభ్యులు వినకపోవడంతో సభ ను అరగంట పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత.. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంత్రి హరీశ్‌రావు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్భాగంగా ఉన్న డొమెస్టిక్ టెర్మినల్‌ను వేరుచేస్తూ, దానికి ఎన్టీ రామారావు పేరు పెట్టడంపై శాసనమండలి విచారం వ్యకం చేస్తోందని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానానికి మూజువాణి ఓటుతో శాసన మండలి ఆమోదం తెలిపింది.

 

 గత ప్రభుత్వ నిర్ణయాన్నే అమలు చేశాం పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు

 

 సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో ఇంటర్నేషనల్ టర్మినల్‌కు రాజీవ్‌గాంధీపేరు, డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్‌టీఆర్ పేరు పెడుతూ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్నే తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందని, కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు శుక్రవారం స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అనంతరం ఆయన నార్త్‌బ్లాక్ వద్ద మీడియాతో మాట్లాడారు. 1999 లోనే డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టారని ఆయన గుర్తు చేశారు. శంషాబాద్‌కు ఎయిర్‌పోర్టు తరలినప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదన్నారు.

 

  తెలుగువారంతా అభిమానించే ఎన్టీరామారావును ఒక ప్రాంతానికి పరిమితం చేయ డం తగదన్నారు. ఎన్టీఆర్, కేసీఆర్, తాను ఇలా అంతా ఒక ప్రాంతానికే పరిమితం కాదని అంతా భారతీయులమేనన్నారు. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోకుండా నే కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వస్తున్నాయని ప్రశ్నించగా, ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వమూ పేరు ప్రతిపాదించవచన్నారు.వాటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని వ్యాఖ్యానించారు.  కేసీఆర్ సైతం ఎన్టీఆర్‌పై అభిమానంతో తన కుమారుడికి రామారావు పేరు పెట్టారని ఆయన గుర్తుచేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top