కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు!

Kathi Mahesh Boycotted From Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై హైదరాబాద్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆయనపై నగర బహిష్కరణ వేటు వేశారు. తమ అనుమతి లేకుండా నగరంలోకి ప్రవేశించవద్దని కత్తిని ఆదేశించారు. ఈ మేరకు ఆయనను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని.. నగరం నుంచి తీసుకెళ్లారు. ఏపీలోనూ కత్తి మహేశ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్తూరులోని స్వగ్రామానికి కత్తి మహేశ్‌ను పోలీసులు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఆయనను హైదరాబాద్‌ నుంచి బహిష్కరించారా? లేక తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించారా? అన్నది తెలియాల్సి ఉంది. ఎన్ని నెలలపాటు కత్తి మహేశ్‌ను నగరం నుంచి బహిష్కరించారనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్‌ నగర బహిష్కరణ, స్వామి పరిపూర్ణానంద హౌస్‌ అరెస్టుపై మరిన్ని వివరాలు తెలిపేందుకు తెలంగాణ డీజీపీ మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి.

శ్రీరాముడిపై తాజాగా కత్తి మహేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, హిందూమతాన్ని కించపరిచేవిధంగా ఆయన మాట్లాడారని హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. శ్రీరాముడిపై వ్యాఖ్యల నేపథ్యంలో కత్తి మహేశ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. కత్తి మహేశ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ.. స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు బ్రేక్‌ వేసిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశముండటంతో కత్తి మహేశ్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

చదవండి : ధర్మాగ్రహ యాత్రకు నో.. పరిపూర్ణానంద హౌస్‌ అరెస్టు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top