సమాజహితానికే సోషల్‌ మీడియా | Sakshi
Sakshi News home page

సమాజహితానికే సోషల్‌ మీడియా

Published Sat, Feb 1 2020 10:24 AM

Karimnagar CP Kamal Haasan Interview In Sakshi

సాక్షి, కరీంనగర్‌ : సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం, రాజకీయ వైషమ్యాలు సృష్టించడం కోసం సోషల్‌ మీడియాను ఉపయోగించడం చట్టరీత్యా నేరమని, కఠిన చర్యలకు సాక్ష్యాలు సృష్టించుకోవడమే అవుతుందని స్పష్టం చేశారు. కరీంనగర్‌ జిల్లాలో ఇటీవలి కాలంలో మత, రాజకీయ, దేశభద్రత వంటి అంశాల్లో సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టింగ్‌లు వైరల్‌ అవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్‌ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వూ్యలో సామాజిక మాధ్యమాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

ఆరోగ్యకర చర్చలకు అభ్యంతరం లేదు
ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా సమాజానికి మంచి చేస్తే స్వాగతిస్తాం. కరీంనగర్‌లో కొందరు విద్యావంతులైన యువకులు, సామాజిక బాధ్యత తెలిసి న వారు కలిసి అలాంటి గ్రూపుల ద్వారా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్లాస్టిక్‌ నిషేధం, క్లీన్‌ కరీంనగర్, క్లీన్‌ మానేరు వంటి అంశాలతో ఫేస్‌బుక్‌ గ్రూపులలో యాక్టివ్‌గా ఉన్నారు. అదే సమయంలో కరీంనగర్‌ క్లబ్‌ వంటి గ్రూపులు ఫేస్‌బుక్‌లో విషం చిమ్మే ప్రయత్నం చేశాయి. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఫేస్‌బుక్‌లో కరీంనగర్‌ క్లబ్‌ గ్రూపును కొందరు వినియోగించుకున్నారు. దీనిపై నిఘా పెట్టాం. పోలీసు హెచ్చరికల నేపథ్యంలో గత నెల చివరి వారం నుంచి పోస్టింగ్‌లు ఆగిపోయాయి. అడ్మిన్‌పై చర్యలకు సిద్ధమవుతున్నాం. వాట్సప్, ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో వైరల్‌ చేసిన వివాదాస్పద అంశాలు, విద్వేషాలను రెచ్చగొట్టేవి, ఉన్నత స్థాయిలో ఉన్న నేతల పట్ల అసభ్యకరమైన రీతిలో పోస్టింగ్‌లు పెట్టేవారిని సైబర్‌క్రైం టీం గుర్తించి, కేసులు నమోదు చేస్తోంది. ఇలాంటి తీవ్రమైన అంశాలకు సంబంధించి 30 కన్నా ఎక్కువ మందిపై కేసులు నమోదు చేశాం. 

పోస్టింగ్‌లే శిక్షలకు సాక్ష్యాలు
భావప్రకటన స్వేచ్ఛ ఆరోగ్యకరమైన పోస్టింగ్‌ల వరకే. రాజకీయాలు, దేశానికి సంబంధించి ఆరోగ్యకరమైన చర్చలు జరిగితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఎక్కడో ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే సోషల్‌ మీడియాలో దాన్ని ఇక్కడికి అన్వయించి ప్రజలను భయాందోళనలకు గురి చేయడం, విదేశాల్లోని ఊచకోతలు, మరణాలు, ప్రమాదాలను ఇక్కడ జరిగినట్టుగా మార్ఫింగ్‌లతో తప్పుదోవ పట్టించి పోస్టింగ్‌లు చేయడం నేరం. సోషల్‌ మీడియాలో చేసే పోస్టింగ్‌లన్నీ రికార్డెడ్‌. కేసులు పెడితే కోర్టుకు అవే ఆధారాలు. ఆ సాక్ష్యాలతో శిక్షలు పడేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. భావప్రకటన స్వేచ్ఛకు కూడా పరిమితులు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ల పట్ల ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలి. వచ్చిన పోస్టులన్నింటినీ గ్రూపుల్లో ఫార్వర్డ్‌ చేయడం వల్ల అడ్మిన్‌ మీద, పోస్టు చేసిన వారి మీద కేసులు నమోదు చేస్తున్నాం. 

ఆవేశాలకు లోను కావద్దు
ఒక మత పరమైన సమస్య గురించో, దేశంలో తీసుకొస్తున్న చట్టాల గురించో పూర్తిస్థాయిలో చదవి తెలుసుకోవాలి. సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌(సీఏఏ)కు సంబంధించి పార్లమెంటు స్థాయిలో నిర్ణయాలు జరిగాయి. ప్రజా స్వామ్య పద్ధతిలో ఆ నిర్ణయాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవచ్చు. కానీ దేశ అత్యున్నత ప్రజాప్రతినిధులు కలిసి తీసుకున్న నిర్ణయాలపై వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఇష్టానుసారంగా పోస్టింగ్‌లు పెడితే తీవ్రమైన కేసులు నమోదవుతాయి. దేశ శాసనకర్తలను కించపరిచేలా, బూతులు తిడుతూ పోస్టింగ్‌లు పెట్టిన వారి మీద ఇప్పటికే కేసులు నమోదు చేశాం. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు ఆవేశాలకు గురికావద్దు. వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. సైబర్‌క్రైం కింద కేసులు నమోదయితే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు ఇబ్బంది ఏర్పడుతుంది. విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు, విసాలు కూడా  పోలీస్‌ వెరిఫికేషన్‌లో తిరస్కరించే పరిస్థితి ఉంటుంది. 

రెండేళ్లుగా అవగాహన కల్పిస్తున్నాం
సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం, ఎవరో పెట్టిన పోస్టులను ఇతర గ్రూపుల్లోకి ఫార్వర్డ్‌ చేయడం వంటి విషయాల్లో విజ్ఞతతో వ్యవహరించాలని కమిషనరేట్‌ పరిధిలో రెండేళ్లుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అయినా అదే ధోరణితో వ్యవహరిస్తే ఉపేక్షించం. గ్రూపుల్లో వచ్చిన పోస్టులను ఎన్ని వేల మంది షేర్‌ చేసినా, ముందుగా పోస్టింగ్‌ పెట్టిన వ్యక్తి ఎవరో, అడ్మిన్‌ ఎవరో పోలీస్‌ యంత్రాంగం తెలుసుకుంటుంది. పోలీసుల వద్ద ఉన్న అధునాతన టెక్నాలజీతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్‌ నెట్‌వర్క్‌ వల్ల నిందితులు తప్పించుకునే అవకాశమే లేదు. టెక్నాలజీని వినియోగించుకొని ఎక్కడ నేరం జరిగినా, అతి తక్కువ సమయంలో నిందితులను పట్టుకోగలుగుతున్నాం. నేరాల సంఖ్యనే తగ్గించాం. సోషల్‌ మీడియా, సైబర్‌ నేరాలను కూడా కట్టడి చేయగలిగాం. 

విద్వేషాలు రెచ్చగొట్టినా శిక్షార్హమే
రాజకీయ పార్టీలకు చెందిన కొందరు అత్యుత్సాహవంతులు ఎదుటివాళ్లను రెచ్చగొట్టే పోస్టింగ్‌లు పెడుతున్నారు. జరగని దాడులను జరిగినట్టుగా, ఇంకేదో జరగబోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేసే ధోరణి కూడా వచ్చింది. రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా శిక్షార్హమే అవుతుంది. మతపరమైన, రాజకీయ పరమైన, దేశభద్రతకు సంబంధించిన అంశాలపైన పోస్టింగ్‌లు పెట్టే ముందు, అలాంటి వాటిని షేర్‌ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. సోషల్‌ మీడియాను సమాజహితానికే వాడుకునేందుకు ఉపయోగించాలి.

Advertisement
Advertisement