రాములోరి దర్శనం అయిన తర్వాతే... | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ‘పుర’ పాలకవర్గ ప్రమాణస్వీకారం

Published Tue, Jan 28 2020 11:51 AM

Kapu Seetalaxmi Municipal Chairperson in bhadradri kothagudem - Sakshi

సాక్షి, కొత్తగూడెం: మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయిన తర్వాత చివరి ఘట్టమైన చైర్‌ పర్సన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. కొత్తగూడెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా 6వ వార్డు నుంచి గెలుపొందిన కాపు సీతాలక్ష్మి, వైస్‌ చైర్మన్‌గా 2వ వార్డు నుంచి గెలిచిన వేలుపుల దామోదర్‌ ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సబ్‌కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా ప్రకటించారు. చైర్‌పర్సన్‌గా సీతాలక్ష్మిని 14వ వార్డు కౌన్సిలర్‌ అఫ్జలున్నీసా బేగం, 27వ వార్డు కౌన్సిలర్‌ వేముల ప్రసాద్‌బాబు ప్రతిపాదించారు.

ముందుగా సబ్‌ కలెక్టర్‌ 36 మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీఆర్‌ఎస్‌ సభ్యులు 25 మంది, సీపీఐ సభ్యులు 8 మంది, కాంగ్రెస్‌ సభ్యుడు ఒకరు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు ప్రమాణం చేశారు. అంతకుముందు టీఆర్‌ఎస్‌ సభ్యులంతా ఒకే బస్సులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి భద్రాచలం నుంచి నేరుగా మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చారు. ముందురోజు వీరందిరినీ భద్రాచలం తీసుకెళ్లి అక్కడే బస చేశారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్‌రావు శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం చేయించుకుని టీఆర్‌ఎస్‌ సభ్యులను కొత్తగూడెం తీసుకొచ్చారు. ఆది నుంచి టీబీజీకేఎస్, టీఆర్‌ఎస్‌లో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమకారుడిగా కాపు కృష్ణకు పేరుండడంతో ఆయన భార్య సీతాలక్ష్మికి ఎమ్మెల్యే వనమా ప్రాధాన్యత ఇచ్చారు.

బీసీలకు పెద్దపీట వేసే లక్ష్యంతో వేలుపుల దామోదర్‌కు వైస్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. అయితే చైర్‌పర్సన్‌ పదవికి పోటీపడిన ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో గొడవ, అలజడి తలెత్తే ప్రమాదం ఉందని భావించారు. కానీ ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. మున్సిపాలిటీ వద్ద పటిష్ట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ్యులు కౌన్సిల్‌ హాల్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేశారు.

ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్‌గా 10వ వార్డు నుంచి గెలుపొందిన దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్‌ చైర్మన్‌గా 17వ వార్డు నుంచి గెలిచిన ఎస్‌డీ.జానీ ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులకు కూడా సింగిల్‌ నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఆర్డీఓ కనకం స్వర్ణలత వీరిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. నామినేషన్ల స్వీకారం అనంతరం ఐదు నిమిషాల సమయమిచ్చారు. ఆ తర్వాత దమ్మాలపాటిని చైర్మన్‌గా ప్రకటించారు. వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం నామినేషన్‌ వేసిన తర్వాత.. చేతులెత్తి మద్దతు ప్రకటించాలని ఆర్డీఓ సభ్యులను కోరగా.. 16 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు మద్దతుగా చేతులెత్తారు. వైస్‌ చైర్మన్‌ పదవిని ఆశించిన కొక్కు నాగేశ్వరరావు, కొండపల్లి సరిత చేతులెత్తలేదు. ముందుగా కౌన్సిలర్లతో ఆర్డీఓ ప్రమాణ స్వీకారం చేయించారు.

19 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులు, ఇద్దరు స్వతంత్రులు, సీపీఐ కౌన్సిలర్‌ ఒకరు, న్యూడెమోక్రసీ కౌన్సిలర్‌ ఒకరు ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్‌ఎస్‌ రెబెల్‌గా గెలుపొందిన మడత రమ సమావేశానికి గైర్హాజరయ్యారు. శనివారం ఓట్ల లెక్కింపు అనంతరం టీఆర్‌ఎస్‌ సభ్యులు 19 మంది, రెబెల్స్‌గా గెలుపొందిన మరో ఇద్దరు.. మొత్తం 21 మంది సభ్యులను ప్రత్యేక బస్సులో ఖమ్మం తీసుకెళ్లి, అక్కడి నుంచి విజయవాడ తరలించారు. వీరందరినీ ఎన్నికకు ముందు నేరుగా మున్సిపల్‌ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక అనంతరం పట్టణంలో ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. తరువాత పట్టణ సమీపంలోని మామిడితోటలో అభినందన సభ నిర్వహించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement