నిర్మాణ దశలోనే నీటిపాలు | Sakshi
Sakshi News home page

నిర్మాణ దశలోనే నీటిపాలు

Published Fri, Aug 1 2014 1:20 AM

నిర్మాణ దశలోనే నీటిపాలు

దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం నీట మునక  
నాలుగో యూనిట్ రక్షణగోడ, గేటు కూలడంతో ప్రమాదం
 ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మూడు యూనిట్లు..
 మరోమూడింటిలో పరికరాలు మునిగి భారీ నష్టం
 80 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్టే
 ప్రాణాలతో బయటపడిన 30 మంది సిబ్బంది
  కేంద్రంలో 258 అడుగుల వరకూ చేరిన నీరు
 నీటిని తోడేస్తే వివరాలు చెప్పగలం: జెన్‌కో సీఎండీ
 పునరుద్ధరణకు మూడు నెలలు పట్టే అవకాశం
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్, హైదరాబాద్: కృష్ణానదిపై మహబూబ్‌నగర్ జిల్లా జూరాల వద్ద నిర్మాణంలో ఉన్న దిగువ జూరాల (గుండాల) జల విద్యుత్ కేంద్రం నీట మునిగింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మూడు యూనిట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరో మూడు యూనిట్లకు సంబంధించిన యంత్ర సామగ్రి కూడా నీట మునగడంతో.. భారీగా నష్టం వాటిల్లింది. వరద ఉధృతికి జల విద్యుత్ కేంద్రం నాలుగో యూనిట్ రక్షణ గోడ, గేటు కూలడంతో ప్రమాదం జరిగినట్లు జెన్‌కో అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
 
 
 ఎగువ జూరాల జలాశయంలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవడంతో.. రెండు రోజులుగా తొమ్మిది గేట్లు ఎత్తి 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పది గంటల సమయంలో దిగువ జూరాల వద్ద నిర్మాణంలో ఉన్న విద్యుత్‌కేంద్రం నాలుగో యూనిట్ రక్షణ గోడ, ఇన్నర్ గేటు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బద్దలై.. వరద నీరు పవర్‌హౌస్‌లోకి చేరడం ప్రారంభమైంది. నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మూడు యూనిట్లలోకి వరద నీరు చొచ్చుకువచ్చింది. మొత్తంగా 307 అడుగుల (పది అంతస్తులు) ఎత్తున్న జల విద్యుత్ కేంద్రంలో 258 అడుగుల (ఆరో అంతస్తు) వరకు నీరు నిండిపోయింది.
 
 
 దీంతో ఒకటి, రెండు, మూడో యూనిట్ల టర్బైన్లు, ప్యానెల్ బోర్డులు, ఇతర యంత్ర సామగ్రి పూర్తిగా నీట మునిగింది. నిర్మాణంలో ఉన్న నాలుగు, ఐదు, ఆరో యూనిట్లకు చెందిన యంత్రాలు, సామగ్రి కూడా నీట మునిగాయి. ఘటన జరిగిన సమయంలో 30 మందికి పైగా అధికారులు, కాంట్రాక్టు సంస్థ కార్మికులు పవర్‌హౌస్‌లోనే ఉన్నారు. వరద నీటి చేరిక ప్రారంభం కాగానే అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది విద్యుత్ కేంద్రం పైభాగానికి చేరుకున్నారు. పవర్‌హౌస్‌లో చిక్కుకుపోయిన జెన్‌కో డీఈఈ శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరిని తాళ్ల సహాయంతో రక్షించారు. కేవలం పావుగంట వ్యవధిలోనే ఆరో అంతస్తు వరకు నీరు చేరినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
 
 రెండు మూడు నెలలు పట్టొచ్చు..
 
 ప్రమాదవార్త తెలుసుకున్న జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు గురువారం ఉదయం దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రానికి చేరుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై జెన్‌కో అధికారులు, కాంట్రాక్టు సంస్థ యాజమాన్యంతో సమీక్షించారు. జెన్‌కో ఎస్‌ఈ శ్రీనివాస్‌రావుతో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిర్వహణ, పర్యవేక్షణ లోపం కారణంగా ఈ ప్రమాదం జరగలేదని సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. 5-6 రోజుల్లో నీటిని పూర్తిగా తోడేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. నీటిని తోడేందుకు అవసరమైన భారీ పంపులను (500 హెచ్‌పీ సామర్థ్యం) పులిచింతల, టెయిల్‌పాండ్ తదితర విద్యుత్ కేంద్రాల నుంచి తెప్పించారు. పూర్తిస్థాయిలో విద్యుత్ కేంద్రాన్ని పునరుద్ధరించేందుకు 2-3 నెలలు పట్టే అవకాశం ఉందన్నారు.
 
 నాణ్యతా లోపంతోనే..?
 
 విద్యుత్ కేంద్రం నీటిలో మునగడంతో భారీగా నష్టం జరిగి ఉంటుందనే అంశాన్ని సీఎండీతో పాటు జెన్‌కో అధికారులు తోసిపుచ్చుతున్నారు. గతంలో శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం నీట మునిగిన ఘటనలో రూ. 30 కోట్ల నష్టం మాత్రమే వాటిల్లిందనే విషయాన్ని సీఎండీ ప్రభాకర్‌రావు గుర్తు చేశారు. నీట మునిగిన లోయర్ జూరాల విద్యుత్ కేంద్రంలో నిర్మాణంలో ఏవైనా నాణ్యతలోపాలు ఉన్నాయా? గేట్లను నిర్మించిన సంస్థ ఏది? కాంక్రీట్ డ్యాంను కట్టింది ఎవరు? నాణ్యత ప్రమాణాలు పాటించారా? లేదా? అన్న వివరాలపై సీఎండీ ప్రభాకర్‌రావు ఆరాతీశారు. అయితే జెన్‌కో కిందిస్థాయి అధికారులు మాత్రం నష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, నీరు భారీగా చేరడం వల్ల తోడేస్తే కానీ పూర్తి వివరాలు వెల్లడించలేమని అంటున్నారు. కాగా.. నీట మునిగిన ఈ జల విద్యుత్ కేంద్రాన్ని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బృందం సందర్శించింది. నష్టానికి కారకులెవరనే అంశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచిస్తామని ఎమ్మెల్యేల బృందం ప్రకటించింది. తెలంగాణలో నెలకొన్న విద్యుత్ కొరత నేపథ్యంలో రోజుకు 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నష్టపోవడమనేది తేలిగ్గా తీసుకునే అంశం కాదనే భావనను ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు.
 
 దిగువ జూరాల నేపథ్యమిదీ..
 
 ఎగువ జూరాల నుంచి విడుదలయ్యే వరద నీటి ఆధారంగా మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం జూరాల- మూలమల్ల శివారులో ‘దిగువ జూరాల (గుండాల) జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. 2005లో దీనికి శంకుస్థాపన చేయగా 2008లో పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఒక్కోటీ 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఆరు యూనిట్లు (మొత్తం సామర్థ్యం 240 మెగావాట్లు) నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ. 1,400 కోట్లు కాగా... ఇప్పటికే రూ. 1,250 కోట్లు వెచ్చించారు. ఒకటి, రెండు యూనిట్ల నిర్మాణం పూర్తికావడంతో గత ఏడాది ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఈ రెండు యూనిట్లలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పాదనకు జెన్‌కో సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే మూడో యూనిట్ నిర్మాణం కూడా పూర్తికావడంతో ట్రయల్న్ ్రనిర్వహించి ఆగస్టు పదో తేదీ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక నాలుగు, ఐదు, ఆరో యూనిట్లలో నిర్మాణ, యంత్ర పరికరాల బిగింపు పనులు 85 శాతం మేర పూర్తయ్యాయి. కానీ తాజాగా ప్రమాదంలో అవన్నీ మునిగిపోయాయి.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement