తలసరి ఆదాయంలో అట్టడుగున జగిత్యాల జిల్లా

Jagtial District Has The Lowest Per Capita Income - Sakshi

ఆదాయం అరకొరే ! 

వ్యక్తిగత ఆదాయం ఏడాదికి రూ.92 వేలు 

2015–16లో రూ.77,070

రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడి

సాక్షి, జగిత్యాల: జిల్లావాసుల వ్యక్తిగత ఆదాయం రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉంది. రాష్ట్రంలో ఏడాదికి ఒక వ్యక్తి పొందే ఆదాయం సగటున రూ.1,80,697 ఉండగా జిల్లా సగటు మాత్రం రూ.92,751గా ఉంది. తలసరి ఆదాయంలో జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది. జిల్లా భూ విస్తీర్ణం, సాగు విషయంలో రాష్ట్రంలో 12వ స్థానంలో ఉంది. వ్యవసాయాధారిత జిల్లాలో వ్యక్తిగత ఆదాయం రూ.93వేల లోపే ఉన్నట్లు సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడైంది. 2015–16తో పోలిస్తే మాత్రం వ్యక్తిగత ఆదాయంలో రూ.15వేలు వృద్ధి చెందినట్లు తెలుస్తుంది. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించిన సందర్భంగా ప్రభు త్వం 2017–18 కాలానికి సంబంధించిన సోషల్, ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ను విడుదల చేసింది.  

పక్క జిల్లాలు నయం 
తలసరి ఆదాయం విషయంలో జగిత్యాల జిల్లా కంటే పక్క జిల్లాలు మెరుగ్గా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా తలసరి ఆదాయం రూ.1,46,634 ఉండగా, కరీంనగర్‌ రూ.1,28,221, రాజన్న సిరిసిల్ల జిల్లా తలసరి ఆదాయం రూ.99,296గా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.4,57,034గా ఉంది. 2015–16లో రూ.77,070గా ఉన్న జిల్లా తలసరి ఆదాయం 2017–18 నాటికి రూ.92,751కి చే రింది. అయినా తలసరి ఆదాయంలో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా వెనుకంజలో ఉండటం గమనించాల్సిన విషయం. గ్రామీణ జనాభా ఎక్కువగా, పట్టణ జనాభా తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. పట్టణీకరణ పెరుగుతున్నప్పటికీ పారిశ్రామికీకరణ చెందకపోవడం కూడా వ్యక్తిగత ఆదాయంపై ప్రభావం చూపుతుంది.  

జీడీడీపీలో 12వ స్థానం 
స్థూల దేశీయోత్పత్తిలో జగిత్యాల రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. సంవత్సర కాలంలో జిల్లా భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల లెక్కింపు విలువే జీడీడీపీ(డిస్ట్రిక్ట్‌ గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌). జగిత్యాల జిల్లా జీడీడీపీ రూ.10,82,725 లక్షలుగా నమోదైంది.  

సాగు విస్తీర్ణం 1.60 లక్షల హెక్టార్లు 

జిల్లా భూవిస్తీర్ణం, సాగు విషయంలో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 1.85 లక్షల హెక్టార్ల భూవిస్తీర్ణం ఉండగా ఇందులో 1.60 లక్షల హెక్టార్లు సాగవుతున్నాయి. రాష్ట్రంలో 1.5 నుంచి 2 లక్షల హెక్టార్ల భూమి ఉన్న పది జిల్లాల సరసన జగిత్యాల జిల్లా నిలిచింది. గతంతో పోలిస్తే ఆహార పంటల సాగు కంటే వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. 2001–02లో 70.8 శాతం ఆహారపంటలు, 29.2 శాతం వాణిజ్యపంటల సాగుకాగా.. 2017–18లో ఆహారపంటల విస్తీర్ణం 61.3 శాతానికి తగ్గగా, వాణిజ్యపంటల సాగు 38.7 శాతానికి పెరిగింది. ఆహారధాన్యాలు, తృణధాన్యాలు, పప్పులు వంటి ఆహార పంటలు సాగు తగ్గిపోగా, పత్తి, నూనెగింజలు, పూలు, పసుపు వంటి వాణిజ్యపంటల సాగు పెరిగింది.

రాష్ట్ర అక్షరాస్యత రేటు 66.54 శాతంగా ఉండగా మహిళల కంటే పురుషుల అక్షరాస్యత శాతం మెరుగ్గా ఉన్నట్లు సర్వే తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర వృద్ధి రేటు 11.2 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వ్యవసాయ పంటల సాంధ్రత విషయంలో కరీంనగర్‌ జిల్లా 1.58 లక్షల హెక్టార్ల విస్తీర్ణంతో ప్రథమస్థానంలో నిలవగా, రాష్ట్ర సాంధ్రత సగటు మాత్రం 1.24 లక్షల హెక్టార్లుగా ఉంది. జిల్లా జనాభా 9,85,417కు చేరుకుందని ప్రభుత్వ సర్వే వెల్లడించింది. ఇందులో పురుషులు 4,84,079 మంది ఉండగా స్త్రీలు 5,01,338 మంది ఉన్నట్లు తెలిపింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు 7,64,081 మంది కాగా  2,21,336 మంది జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top