ఠాణాలో బెల్లం మాయం ?  

Jaggery Disappeared from police station - Sakshi

పట్టుబడిన బెల్లాన్ని అమ్మేసిన సిబ్బంది

సుమారు 20 క్వింటాళ్ల విక్రయం

సాక్షి, మహబూబాబాద్‌ : పోలీస్‌ స్టేషన్‌లో బెల్లం మాయమైంది. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. స్టేషన్‌లో దొంగతనం ఏంటి.. ఏ దొంగకు అంత ధైర్యం ఉంటుందనే కదా మీ డౌటు. కానీ కేసముద్రం పోలీస్‌ స్టేషన్‌లో మాత్రం బెల్లం, మోటారు వాహనాల స్పేర్‌ పార్టులు కూడా  మాయమవుతాయనే ఆరోపణలు ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రోజువారి తనిఖీల్లో పట్టుబడిన బెల్లాన్ని పోలీసులు సాధారణంగా ఎక్సైజ్‌ శాఖకు అప్పగించాల్సి ఉంటుంది.

కానీ  వర్షాకాలం రావటం, బెల్లం తడిసి కారుతూ వాటి చుట్టూ ఈగలు ముసురుతుండటంతోపాటు,  దుర్వాసన వస్తుండటంతో కేసముద్రం స్టేషన్‌లోని బెల్లాన్ని బావిలో వేయాలని స్థానిక ఎస్సై సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది.

ఇదే అదనుగా పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు సుమారు 20 క్వింటాళ్ల బెల్లాన్ని పాడుబడ్డ బావిలో వేస్తామని చెప్పి ట్రాక్టర్‌లో పట్టుకెళ్లారు. కానీ బెల్లాన్ని కేసముద్రం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరిసరాల్లోకి తీసుకెళ్లాక వేరే వాహనంలోకి తరలించి, నామమాత్రంగా అందులో కొంత బెల్లాన్ని గ్రామశివారులోని బావిలో వేసినట్లు సమాచారం.

సదరు కానిస్టేబుళ్లు ఇద్దరు గతంలోనూ ఇలాంటి పనులు చేయటంతో పాటు, స్టేషన్‌కి వచ్చే ఫిర్యాదుదారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిజానిజాలు వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు.

వెంటనే రికవరీ చేశాం : ఎస్సై సతీష్‌ 

ఇదిలా ఉండగా ఈ విషయమై కేసముద్రం ఎస్సై సతీష్‌ వివరణ కోరగా అలాంటిది ఏమి లేదని, ఐదు క్వింటాళ్ల బెల్లంను బావిలో పడేయడానికి తీసుకెళ్తున్న క్రమంలో కూలీలు ఐదు బస్తాలు కాలేజీ ఆవరణలో విసిరేశారని తెలిపారు. సమాచారం తెలుసుకొని వాటిని వెంటనే రికవరీ చేసినట్లు వివరణ ఇచ్చారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top