నేటి నుంచి అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌  

International Conference In KU From Today - Sakshi

కేయూలో నిర్వహణకు   ఏర్పాట్లు పూర్తి

పరిశోధన పత్రాల సమర్పణకు  రానున్న ప్రతినిధులు

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం, ఇండియన్‌ డిస్టెన్స్‌ ఎడ్యూకేషన్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా శని, ఆదివారాల్లో నిర్వహించే అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘ఇంప్రూవ్డ్‌ యాక్సెస్‌ టు డిస్టెన్స్‌ ఎడ్యూకేషన్‌ హయ్యర్‌ ఎడ్యూకేషన్‌ ఫోకస్‌ ఆన్‌ అండర్‌ సర్వ్‌డ్‌ కమ్యూనిటీస్‌ అండ్‌ అన్‌కవర్డ్‌ రీజియన్స్‌’ అనే అంశంపై నిర్వహించనున్నారు.

దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి, సింగపూర్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర చోట్ల నుంచి 108 పరిశోధన పత్రాలను సమర్పించేందుకు ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉన్నత విద్యకు దూరమైన వారికి దూరవిద్య అనేది ఓ వరం. దూరవిద్య ద్వారా వివిధ ఉన్నత విద్యా కోర్సులు అందిస్తున్నాయి. అయితే ఆయా కోర్సులను మారుమూల ప్రాంతాల వారికి కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎలాంటి మార్పులు తీసుకురావాలనే అంశాలపై ఈ కాన్ఫరెన్స్‌లో చర్చించనున్నారు.

దూరవిద్య ప్రస్తుతం అందిస్తున్న కోర్సులు, వాటి సిలబస్, ఆన్‌లైన్‌ కోర్సులు తదితర అంశాలపై చర్చిస్తారు. ఉదయం 11 గంటలకు కేయూ సెనేట్‌హాల్‌లో జరిగే అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ ప్రారంభ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ వర్సిటీ వీసీ ఆచార్య కె.నాగేశ్వర్‌రావు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ టి.పాపిరెడ్డి, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఆచార్య కె.సీతారామారావు, ఇండియన్‌ డిస్టెన్స్‌ ఎడ్యూకేషన్‌ అసోసియేషన్‌ (ఐడియా) అధ్యక్షుడు ఆచార్య కె.మురళీమనోహర్, జనరల్‌ సెక్రటరీ ఆచార్య రోమేష్‌వర్మ, దూరవిద్యకేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ దినేష్‌కుమార్‌ ఈకాన్ఫరెన్స్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, కన్వీనర్‌గా దూరవిద్యా కేంద్రం జాయింట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ టి.శ్రీనివాస్‌రావు వ్యవహరిస్తున్నారు.

మొదటి ప్లీనరీ సమావేశంలో ముంబై విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ హరిచందన్‌ భారతదేశంలో దూరవిద్య పాత్రపై, రెండో ప్లీనరీ సమావేశంలో ఇగ్నో ప్రొఫెసర్‌ ఆర్‌.సత్యనారాయణ ప్రసంగిస్తారు. ఆచార్య రామ్‌రెడ్డి మెమోరియల్‌ లెక్చర్‌ను కేయూ మాజీవీసీ ఆచార్య ఎన్‌.లింగమూర్తి ప్రసంగిస్తారు. ఈనెల 12న ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా దూరవిద్యకు సంబంధించిన వివిధ యూనివర్సిటీల దూరవిద్య డైరెక్టర్‌లతో సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు.

ఆదివారం సాయంత్రం ముగింపు సమావేశంలో మధ్యప్రదేశ్‌లోని బోజ్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ రవీంద్రా ఆర్‌ కనహార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. కేయూ వీసీ ప్రొఫెసర్‌ ఆర్‌.సాయన్న, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.పురుషోత్తమ్‌ పాల్గొంటారు. కాగా అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ ఏర్పాట్లపై శుక్రవారం దూర విద్యా కేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ దినేష్‌కుమార్, ఐడియా అధ్యక్షుడు ప్రొఫెసర్‌ మురళీమనోహర్, ఇతర అధ్యాపకులు సమావేశమై చర్చించారు.

సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రాలను రాబోయే రోజుల్లో పుస్తకరూపంలోకి తీసుకొస్తామని, సదస్సులో చర్చించిన అంశాలు, సూచనలను భారత దూరవిద్య మండలికి నివేదిస్తామని దూరవిద్యాకేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top