ఊపిరి పీల్చడం కష్టమే!

Increased Air pollution in Hyderabad - Sakshi

గ్రేటర్‌లో పెరిగిన వాయు కాలుష్యం

తగ్గిన వాయు నాణ్యత ...

గత వారంలో ఢిల్లీ కంటే నగరంలోనే అధికంగా నమోదు

ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావమే కారణం

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో గత వారం రోజులుగా వాయుకాలుష్యం అనూహ్యంగా పెరిగింది. జనాలు స్వచ్ఛమైన గాలిని పీల్చడమే గగనమవుతోంది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా ఆకాశం దట్టంగా మేఘావృతమైంది. దీంతో ధూళికణాలు, ఇతర వాయు ఉద్గారాలు భూమి ఉపరితల వాతావరణం నుంచి పైకి వెళ్లే అవకాశం లేకపోవడంతో వాయు కాలుష్యం పెరిగినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. ఇక కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం వాయు నాణ్యత సూచి 0–50 పాయింట్ల మధ్య ఉంటే కాలుష్య రహిత నగరంగా పిలుస్తారు.  గత వారం పీల్చే గాలిలోని సూక్ష్మ,స్థూల ధూళికణాలు, కార్భన్‌ మోనాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ సహా ఇతర కాలుష్య కారకాలను పరిగణలోకి తీసుకొని సీపీసీబీ తాజాగా వాయునాణ్యతా సూచీ(ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌)ను విడుదల చేసింది. ఈ సూచి గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో గత వారం 83 పాయింట్లకు చేరుకుంది. దీంతో ఇప్పటికిప్పుడే ప్రమాదం లేకపోయినా వాయు కాలుష్యం పెరిగినట్లు సుస్పష్టమౌతోంది. కాగా ప్రతీసీజన్‌లో వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరయ్యే దేశరాజధాని ఢిల్లీలో గత వారం వాయు నాణ్యతా సూచి 67 పాయింట్లకు తగ్గడం విశేషం. గతవారం వాయునాణ్యతా సూచి బెంగళూరులో 86 పాయింట్లు, చెన్నైలో 63 పాయింట్లు నమోదైంది. ఈ సూచిలో హెచ్చుతగ్గులకు వాతావరణ మార్పులకు దగ్గరి సంబంధం ఉందని పీసీబీ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో వరుస వర్షాల కారణంగా వాయుకాలుష్యం తాత్కాలికంగా తగ్గుముఖం పట్టినట్లు విశ్లేషిస్తున్నారు. అయితే వాయు నాణ్యత సూచి పాయింట్లు పెరిగితే సిటీజన్లకు ఊపిరితిత్తుల సమస్యలు, తలనొప్పి, బ్రాంకైటిస్‌ తదితర సమస్యలు తథ్యమని స్పష్టంచేస్తున్నారు. 

ఉక్కిరిబిక్కిరికి కారణాలివే..
నగరంలో సుమారు 50 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్‌ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులబెట్టడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి. శివారుప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడంతో సూక్ష్మ ధూళికణాలు పీల్చే గాలిలో చేరి సమీప ప్రాంతాల్లోని సిటీజన్ల ఊపిరితిత్తులోకి చేరుతున్నాయి. ఘనపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాలు(పీఎం2.5) మోతాదు 40 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో పలుమార్లు అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది.   
బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్‌ ప్రాంతాల్లో వా యుకాలుష్యం శృతిమించుతున్నట్లు తేలింది.   
ఆయా కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు బయటపడడం గమనార్హం.  
బాలానగర్, ఉప్పల్‌ ప్రాంతాల్లో ఏడాదికి 200 రోజులకు పైగానే కాలుష్య ఉధృతి అధికంగా ఉన్నట్లు తేలింది.  
గ్రేటర్‌ పరిధిలో రాకపోకలు సాగించే 50 లక్షల వాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది.
కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్ని రోడ్లపైకి ముంచెత్తుతుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
వాహనాల సంఖ్య లక్షలు దాటినా..గ్రేటర్‌లో  9 వేల కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగి సగటు వాహన వేగం గంటకు 15 కి.మీ.కి పడిపోతుంది. ఇదే తరుణంలో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది.

వాయు కాలుష్యంతో అనర్థాలివే..
పీఎం10,పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ, స్థూల ధూళి రేణువులు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశవ్యాధులు, పొడిదగ్గు,బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి.
దుమ్ము, ధూళి కళ్లలోకి చేరిరెటీనా దెబ్బతింటుంది.
చికాకు, అసహనం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.
తలనొప్పి, పార్శ్వపు నొప్పికలుగుతుంది.
ధూళి కాలుష్య మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల కేన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది.
ఇటీవల నగరంలో శ్వాసకోశసమస్యలు, ఆస్తమా, క్రానిక్‌ బ్రాంకైటిస్, సైనస్‌ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు, వాయుకాలుష్యమే.  
ముఖానికి, ముక్కుకు మాస్క్‌లు, కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా ఆర్‌ఎస్‌పీఎం వల్ల కలిగేదుష్ప్రభావాలను కొంతమేరనివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top