రివార్డు మొత్తం పెంచండి

Increase the amount of rewards - Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి సీసీఎస్‌ ప్రతిపాదనలు 

సాక్షి, హైదరాబాద్‌: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుంది రాష్ట్ర పోలీసు శాఖలో రివార్డుల విధానం. కష్టపడి నేరగాళ్లను పట్టుకున్న పోలీసులకు అవార్డులు రివార్డులు వస్తే చెప్పుకోవడానికి గొప్పగానే ఉంటుంది. కానీ, రివార్డు పేరుతో ఇస్తున్న మొత్తం గురించి చెప్పుకోలేని బాధ పోలీసులకు. ఏదైనా కేసులో పోలీసుల పనితీరు మెచ్చి ఓ డీసీపీ వారికి రివార్డు ఇవ్వాలనుకుంటే ఆయన ఇవ్వగలిగిన మొత్తం రూ.750 మాత్రమే.

ఈ విధానాలను మార్చాలని కోరుతూ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులు ప్రతిపాదనలు రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు కోసం తయారు చేసిన ఈ ఫైల్‌ డీజీపీ కార్యాలయం నుంచి తుది అనుమతి కోసం ప్రభుత్వానికి చేరింది. తాజా రివార్డు మొత్తాలు నెల రోజుల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 

కనీస మొత్తం ఉండేలా... 
ఓ కేసు ఛేదన, నేరగాడిని పట్టుకోడానికి సంబం ధించి ఒకరికైనా, బృందానికైనా డీసీపీ గరిష్టంగా రూ.750, సంయుక్త పోలీసు కమిషనర్‌(జేసీపీ) రూ.1,000, అదనపు సీపీ రూ.1,500, సీపీ రూ.2,000 మాత్రమే మంజూరు చేసే అవకాశముంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు డీసీపీకి రూ.3,000, జేసీపీకి రూ.4,000, అదనపు సీపీ రూ.6,000, సీపీ రూ.8 వేల వరకు మంజూరు చేసేలా ప్రతిపాదనలు రూపొందించి డీజీపీ కార్యాలయానికి పంపారు.

డీజీపీ స్థాయి అధికారి తాను కోరుకున్న అధికారులకు గరిష్టంగా రూ.50 వేల వరకు రివార్డు ఇచ్చేలా ప్రతిపాదించారు. ఇన్‌స్పెక్టర్‌ ఆ పైస్థాయి వారిని కూడా రివార్డులకు అర్హులుగా చేయాలన్నారు.  కాగా, సీసీఎస్‌ రూపొందించిన ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చేస్తూ డీజీపీ కార్యాలయం ప్రభుత్వానికి నివేదించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top