మేడారం మహాజాతరకు ప్రతిసారి సుమారు కోటికి పైగా మంది భక్తులు తరలివస్తుంటారు.
జంపన్నవాగుపై మొత్తం 3500 మీటర్ల స్నానఘట్టాల నిర్మాణం
బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద ఒకేసారి 1.20 లక్షల మంది స్నానాలు
భవిష్యత్‌లో స్నానఘట్టాల నిర్మాణం లేకుండా శాశ్వత చర్యలు
మేడారం మహాజాతరకు ప్రతిసారి సుమారు కోటికి పైగా మంది భక్తులు తరలివస్తుంటారు. వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చే వారు తొలుత జంపన్నవాగులో స్నానమాచరిస్తారు. అయితే చీమల పుట్టగా ఉండే రద్దీతో చాలామంది స్నానాలు చేసేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో వాగులోని నల్లాల కింద ఒకేసారి 1.20 లక్షల మంది పవిత్రస్నానం
ఆచరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్‌లో ఇక స్నానఘట్టాల నిర్మాణం లేకుండా శాశ్వత పనులు చేపడుతున్నారు.
మేడారం (ఎస్‌ఎస్‌తాడ్వాయి) : మేడారంలోని జంపన్నవాగుపై ప్రస్తుతం నిర్మిస్తున్న స్నానఘట్టాలతో భవిష్యత్‌లో మరిన్ని కట్టడాలు లేకుండా పోతాయి. గతంలో వాగుపై రెండు వైపులా కలుపుకుని 2700 మీటర్ల పొడవునా స్నానఘట్టాలను నిర్మించారు. అయితే ప్రతీ రెండేళ్లకోసారి జరిగే జాతరకు భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. వాగులో లక్షలాది మంది భక్తులు స్నానమాచరించే సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన అధికారులు ఈసారి రూ. 20 కోట్లతో మరో 800 మీటర్ల పొడువునా స్నానఘట్టాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కొత్తూరు లోలైవల్ కాజ్‌వే నుంచి జంపన్నవాగు రెండు వైపులా కలుపుకుని ప్రస్తుతం చేపట్టిన స్నానఘట్టాలను కలుపుకుని 3.4 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్నారు.
స్నానఘట్టాలకు ఇక స్థలం లేదు..
గతంలో నిర్మించిన 2700 మీటర్లతోపాటు ప్రస్తుతం చేపడుతున్న 800 మీటర్ల స్నానఘట్టాలతో భవిష్యత్‌లో జంపన్నవాగుపై మరిన్ని కట్టడాలు చేపట్టేందుకు ఖాళీ స్థలం లేకుండాపోయింది. కాగా, సమ్మక్క కొలువుదీరిన చిలకలగుట్టను ఆనుకుని జంపన్నవాగు పరిసరాల్లో జాతరలో లక్షలాది మంది భక్తులు విడిది చేస్తుంటారు. అయితే గత జాతర లో భక్తుల సౌకర్యార్థం 300 మీటర్ల మేరకు స్నానఘట్టాలు నిర్మించారు. అయితే ప్రతీ ఏడాది వర్షాకాలంలో జంపన్నవాగు వరద ఉధృతికి సమీపంలోని రైతుల పొలాలు కోతకు గురవుతున్నాయి. దీంతో జంపన్నవాగు ఒడ్డుకు కరకట్ట నిర్మించాలని రైతులు అధికారులకు మొర పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఈసారి కూడా మిగిలిన ఖాళీ స్థలం లో 550 మీటర్ల స్నానఘట్టాలు నిర్మిస్తున్నారు. అలాగే ఊరట్టంలో ధ్వంసమైన కాజ్‌వే అవతల కూడా 100 మీటర్ల పొడవునా చేపడుతున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న స్నానఘట్టాలతో జంపన్నాగుపై భవిష్యత్‌లో జాతర సమయంలో పాత స్నానఘట్టాలకు మరమ్మతులు చేయడం తప్ప కొత్త వాటిని చేపట్టేందుకు ఖాళీ స్థలం లేకపోవడం గమనార్హం.
అదనంగా 80 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు..
గత జాతరలో స్నానఘట్టాలపై 260 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, 4,680 నల్లాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న స్నానఘట్టాలపై 80 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో స్నానఘట్టాలపై ఈసారి మొత్తం బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ 340తోపాటు 6120 నల్లాలు బిగించనున్నారు. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నల్లాల కింద గంటలో లక్ష 20 వేల మంది భక్తులు స్నానాలు చేస్తారని ఎంఐ ఏఈఈ శ్యాం ‘సాక్షి’కి తెలిపారు. జనవరి 15 కల్లా నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.