‘అక్రమ మైనింగ్‌ సమాజానికి ప్రమాదకరం’

Illegal mining is Dangerous to society - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సమాజానికి అక్రమ మైనింగ్‌ ప్రమాదకారిగా మారిందని హైకోర్టు అభిప్రాయపడింది. అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న అక్ర మ మైనింగ్‌ వల్ల తీవ్ర స్థాయిలో పర్యావరణం ప్రభావితమవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కనిపించట్లేదని, ఎవరు తేలిగ్గా తీసుకున్నా తాము మాత్రం తేలిగ్గా తీసుకునేది లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. కరీంనగర్‌ జిల్లాలో గ్రానైట్‌ బ్లాకుల కొలతలను తక్కువగా చూపుతూ పలు గ్రానైట్‌ సంస్థలు భారీ మొత్తంలో వందల కోట్ల రూపాయల మేర సీనరేజీని ఎగవేశాయంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది.

ఈ వ్యవహారం పై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, గనులశాఖ డైరెక్టర్, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌తో పాటు సీనరేజీ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్వేతా ఏజెన్సీస్, శ్వేతా గ్రానైట్స్, ఏఎస్‌ షిప్పింగ్, జేఎం బాక్సి కంపెనీ, మైథిలీ ఆదిత్య, కేవీఆర్‌ ఏజెన్సీస్, అరవింద్‌ ఏజెన్సీస్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top