నేడు ఐఐటీ హైదరాబాద్‌ 8వ స్నాతకోత్సవం

IIT Hyderabad Celebrates 8th Convocation In Sangareddy District - Sakshi

ముఖ్య అతిథిగా  నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌కాంత్‌

11 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో మలుపులు

దేశంలోని 23 ఐఐటీల్లో హైదరాబాద్‌కు 8వ ర్యాంకు

సాక్షి, సంగారెడ్డి: జిల్లాకు తలమానికంగా ఉన్న హైదరాబాద్‌ ఐఐటీ దేశంలోనే ఎంతోమంది ఇంజనీరింగ్‌ విద్యార్థులను తయారుచేస్తోంది. సుమారుగా 11ఏళ్ల ప్రస్థానంలో 250 మంది విద్యార్థులను పీహెచ్‌డీలో గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దింది. ఈ ఐఐటీ ప్రాంగణం 8వ స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ నెల 10వ తేదీ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు స్నాతకోత్సవం జరగనుంది. ఇందుకు ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. స్నాతకోత్సవానికి సంబంధించి ప్రొఫెసర్లు, విద్యార్థులు, సిబ్బంది రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నారు.
                 
సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారిపై హైదరాబాద్‌ ఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)ని 2008లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన ఈ ఐఐటీని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌.వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జిల్లాకు కేటాయించారు. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఐఐటీలో ప్రారంభంలో కేవలం మూడు ఇంజనీరింగ్‌ కోర్సులను మాత్రమే ప్రవేశపెట్టారు. ప్రారంభ సంవత్సరంలో బీటెక్‌ సీఎస్‌ఈ, ఈఈ, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు మాత్రమే ఉండేవి. వీటిలో 40 మంది విద్యార్థులకు ఒక కోర్సు చొప్పున 120 మంది విద్యార్థులకే ప్రవేశం ఉండేది.

ఇంతితై.. వటుడింతై
హైదరాబాద్‌ ఐఐటీ ప్రస్తుతం దేశంలోనే 8వ ర్యాంకులో ఉందంటే.. కేవలం దశాబ్ధ కాలంలోనే ఎంత ఎత్తుకు ఎదిగిందో ఊహించవచ్చు. దేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉన్నాయి. నాడు 120 మంది విద్యార్థులు.. మూడు ఇంజనీరింగ్‌ కోర్సులతో ప్రారంభమైన ఈ ఇన్‌స్టిట్యూషన్‌లో ప్రస్తుతం 10 కోర్సులు (డిపార్ట్‌మెంట్స్‌)తో 2,900 మంది విద్యార్థులున్నారు. సీఎస్‌ఈ, ఈఈ, మెకానికల్‌ కోర్సులతో పాటు గా ప్రస్తుతం సివిల్, కెమికల్, మెటీరియల్‌ సైన్స్, ఇంజనీరింగ్‌ ఫిజిక్స్, మాథమేటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్, ఇంజనీరింగ్‌ సైన్స్‌ కోర్సులలో విద్యాబోధన జరుగుతున్నది. ఈ సంవత్సరం నుంచి బీటెక్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, ఎం టెక్‌లో క్‌లైమేట్‌ చేంజ్‌ (వాతావరణ మార్పు లు) అనే కోర్సులను ప్రవేశపెడుతున్నారు. 

టీచింగ్‌తో పాటు రీసెర్చ్‌కు ప్రాధాన్యం
హైదరాబాద్‌ ఐఐటీలో కేవలం విద్యాబోధనకే కాకుండా రీసెర్స్‌ (పరిశోధన), ఇన్నోవేషన్స్‌ (కొత్త విషయాలను కనుక్కోవడం)కు ప్రాధాన్యత నిస్తున్నారు. కేవలం 120 మంది విద్యార్థులు.. 3 కోర్సులతో ప్రారంభమైన ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ విద్యాసంవత్సరంలో 2,900 మంది విద్యార్థులు.. 900 మంది పీహెచ్‌డీ విద్యార్థులు ఉన్నారంటే అనతికాలంలోనే ఎంత ఉన్నతస్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. టీచింగ్‌తో పాటు రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. 

మరో మూడేళ్లలో 5 నుంచి 6 వేల మంది విద్యార్థులు.. 
ప్రస్తుతం 2,900 మంది ఉన్న ఈ ఐఐటీలో రానున్న మూడేళ్ల కాలంలో మొత్తం 5 నుంచి 6 వేల మంది వరకు ఉండే అవకాశం ఉంది. రెండో దశ భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో కూడా రూ.90 కోట్లు కేటాయించారు. ఈ నిర్మాణాలను జపనీస్‌ సంస్థ ‘జైకా‘ చేపట్టింది. ఎల్‌అండ్‌టీ ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తవుతాయి. దీంతో ప్రస్తుతం ఉన్న విద్యార్థులతో కలిపి 5 నుంచి 6 వేల మంది విద్యార్థులకు ఈ ప్రాంగణం విద్యతో పాటుగా ఆశ్రమం (అకామిడేషన్‌) కల్పించనుంది. ఒకేసారి సుమారుగా 800 మంది కూర్చోవడానికి గాను ఆడిటోరియం నిర్మిస్తున్నారు.

మధ్యాహ్నం కార్యక్రమం..
హైదరాబాద్‌ ఐఐటీ 8వ స్నాతకోత్సవం శనివారం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ముఖ్య అతిథిగా రానున్నారు. పాస్‌అవుట్‌ విద్యార్థులతో పాటుగా ప్రతీ విద్యార్థి వెంట ఇద్దరిని అనుమతిస్తున్నారు. సుమారుగా 2వేల మంది ఈ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. ఈయనతో పాటుగా అతిథులుగా హైదరాబాద్‌ ఐఐటీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌ బీవీఆర్‌.మోహన్‌రెడ్డి, అఫిసియేటింగ్‌ (ఇంచార్జి) డైరెక్టర్‌ సీహెచ్‌.సుబ్రమణ్యన్‌ హాజరుకానున్నారు. మ ధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ స్నాతకోత్సవం జరుగుతుంది. ఈ ఐఐటీ నుంచి 560 మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ శిక్షణ పూర్తిచేసుకొని పాస్‌అవుట్‌ అవుతున్నారు. వీరిలో 68 మంది పీహెచ్‌డీ స్కాలర్స్‌ ఉన్నారు. 

 కొత్త ఆవిష్కరణలకు వేదిక
దేశంలోని ఏ ఐఐటీకి కూడా తీసిపోని విధంగా హైదరాబాద్‌ ఐఐటీని కొత్త ఆవిష్కరణలకు వేదిక చేశాం. మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా ఈ ఐఐటీలో ప్రవేశం పొందుతున్నారు. టీచింగ్‌తో పాటుగా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. దేశంలోని 23 ఐఐటీలలో ప్రస్తుతం 8వ ర్యాంకులో ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్‌ ఐఐటీని దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. మరో ప్రత్యేకత ఏమిటంటే..ఈ ఇన్‌స్టిట్యూట్‌లో విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు గల విద్యార్థులు ఉన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. ఫ్యాకల్టీకి కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 
– సీహెచ్‌. సుబ్రహ్మణ్యన్, ఇన్‌చార్జి డైరెక్టర్, హైదరాబాద్‌ ఐఐటీ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top