నవ కిశోరం

icds plans to develop skills in young girls - Sakshi

కిశోర బాలికల సంక్షేమానికి చర్యలు

కంప్యూటర్‌ శిక్షణ, మహిళల హక్కులపై అవగాహన

వీర వనితలుగా తీర్చిదిద్దేందుకు ఐసీడీఎస్‌ ప్రయత్నాలు

సిద్దిపేట జిల్లాలో కిశోర బాలికల సర్వే

హుస్నాబాద్‌రూరల్‌: బాలికల సంరక్షణ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లోని కిశోర బాలికలు ఎంత మంది ఉన్నారు? ఎంత వరకు చదువుకున్నారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? చదువు ఎందుకు మానేశారు? కుటుంబ నేపథ్యం, ఆరోగ్య సమాచారంపై సర్వే చేస్తున్నారు. బాలికలకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చి.. పురుషులకు సమానంగా నిలిపేలా చర్యలు తీసుకుంటున్నారు. బాలికలకు మహిళా సంక్షేమం, హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు.

జిల్లాలో 57,615 మంది కిషోర బాలికలు
సిద్దిపేట జిల్లాలోని 399 గ్రామాల్లో 57,615 మంది కిశోర బాలికలు ఉన్నట్టు ఐసీడీఎస్‌ అధికారులు సర్వే ద్వారా గుర్తించారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 25 మంది బాలికలను ఎంపిక చేసి.. వీరికి కంప్యూటర్‌ శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక ప్రాజెక్టులో బాలికలు శిక్షణ పొందుతున్నారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలలో బాలికలు, స్త్రీలలో చైతన్యం తీసుకొచ్చేలా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనే సమన్వయకర్తలను నియమించనున్నారు. పల్లెకు చేరి కిశోర బాలికలకు మహిళల హక్కులపై అవగాహన కల్పించడం, మహిళా సంక్షేమ పథకాలు, దగా పడ్డ మహిళలకు న్యాయ సలహాలు ఎక్కడ అందుతాయి? అనే విషయాలపై అవగహన కల్పించేలా సమన్వయకర్తలు పనిచేయనున్నారు.

కిశోర బాలికల ఆరోగ్య పరిరక్షణ
సరైన వసతులు లేక గ్రామీణ ప్రాంతాలకు చెందిన కిశోర బాలికలు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. అంతేకాదు కూలి పనులు సైతం చేస్తున్నారు. కాగా, అభద్రతా భావంతో కొందరు తల్లిదండ్రులు తమ కుమార్తెలను దూర ప్రాంతాల్లో చదువుకునేందుకు పంపించడం లేదు. ఫలితంగా చాలమంది బాలికల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు ఇంటర్మీడియట్‌ చేయడం లేదు. అదే ఇంటర్‌ చేసిన వారు డిగ్రీలో చేరడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కిశోర బాలికల సర్వే చేసి.. వారికి జీవన నైపుణ్యాల కల్పన చేపట్టనుంది.

జీవన నైపుణ్యాల కల్పన
ప్రభుత్వ ఆదేశాల మేరకు కిశోర బాలికల సర్వే చేపట్టి.. వారి వివరాలను అన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చదువులు మానేసిన బాలికలను చేరదీసి.. వారికి వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం గజ్వేల్, సిద్దిపేటలో కంప్యూటర్‌ శిక్షణ ఇస్తున్నాం. త్వరలో హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల ఐసీడీఎస్‌ పరిధిలోని బాలికలకు కంప్యూటర్‌ శిక్షణ ఇస్తాం. చదువు మానేసిన బాలికలను గుర్తించి.. వారికి మహిళా హక్కులపై అవగాహన కల్పిస్తాం. అంతేకాదు బాలికల ఆరోగ్య పరిరక్షణకు శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది.                  
 – జరీనాబేగం, ఐసీడీఎస్‌ పీడీ

త్వరలో కంప్యూటర్‌ శిక్షణ
గ్రామీణ బాలికలకు స్వయం ఉపాధి కోసం కంప్యూటర్‌ విద్యలో శిక్షణ ఇస్తున్నాం. ఇందుకోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో కిశోర బాలికలపై సర్వే పూర్తి చేశాం. ప్రాజెక్టు పరిధిలో 6,450 మంది కిశోర బాలికలు ఉన్నారు. 20 మందికి కంప్యూటర్‌ శిక్షణ ఇచ్చేందుకు బ్యాచ్‌ తయారు చేశాం. త్వరలో హుస్నాబాద్‌లో ప్రారంభిస్తాం. మహిళల హక్కులపై అవగహన కల్పించి.. బాలికలను శక్తిగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తున్నాం. 
– ఫ్లోరెన్స్, సీడీపీఓ, హుస్నాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top