కరీంనగర్ జిల్లా సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌ను శుక్రవారం మూసివేశారు. పార్క్‌లోని 114 యూనిట్లకు తాళం వేసిన పారిశ్రామిక వేత్తలు సమ్మెకు దిగారు.
సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌ను శుక్రవారం మూసివేశారు. పార్క్‌లోని 114 యూనిట్లకు తాళం వేసిన పారిశ్రామిక వేత్తలు సమ్మెకు దిగారు. ఈ టెక్స్‌టైల్ పార్క్‌లో పరిశ్రమలు స్థాపించే వారికి పెట్టుబడిలో 20 శాతం కేంద్రం, మరో 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం రాయితీ మంజూరు చేయాల్సి ఉంది. కేంద్ర జౌళి శాఖ ద్వారా 20 శాతం సబ్సిడీ ‘టఫ్’ పథకంలో విడుదల కాగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 20 శాతం సబ్సిడీ విడుదల కావడం లేదు. రూ.7 కోట్ల మేరకు సబ్సిడీ మంజూరు కావాల్సి ఉంది.
మరోవైపు టెక్స్‌టైల్ పార్క్‌లోని పరిశ్రమకు 50 శాతం విద్యుత్ రాయితీ అమలవుతుండగా.. పరిశ్రమలకు విద్యుత్ రాయితీ ఇవ్వడంలేదు. ఈ క్రమంలో పార్క్‌లోని పరిశ్రమలకు 50 శాతం విద్యుత్ రాయితీ ఇవ్వాలని, సబ్సిడీలను విడుదల చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ పారిశ్రామిక వేత్తలు సమ్మెకు దిగారు.
దీంతో పార్క్‌లో మొత్తం 114 యూనిట్లు, 1,432 ఆధునిక మరమగ్గాలపై వస్త్రోత్పత్తి నిలిచిపోగా, రెండు వేలమంది కార్మికుల ఉపాధికి విఘాతం కలిగింది. పార్క్‌లో సమ్మె కొనసాగితే సిరిసిల్లలో కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉంది.