‘కమ్యూనికేషన్‌’ కష్టాలు

Hyderabad Traffic Police Suffering With Other State Vehicles - Sakshi

సైబరాబాద్‌లో ఇతర రాష్ట్ర వాహనాల ట్రాఫిక్‌ ఉల్లంఘనలు

కేవలం ఈ–చలాన్‌లకే పరిమితం, రూ.లక్షల్లో పేరుకుపోయిన జరిమానాలు

ఆర్టీఏ డాటాబేస్‌లో వివరాలు లేకపోవడంతో సంప్రదించ లేకపోతున్న ట్రాఫిక్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో:  మహారాష్ట్ర నంబర్‌ ప్లేట్‌ ఉన్న ఓ వాహనానికి రూ.రెండు లక్షల వరకు ఈ–చలాన్ల రూపంలో జరిమానా పడింది. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల కెమెరాతో పాటు ఆయా ట్రాఫిక్‌ జంక్షన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన  ఈ వాహనానికి దఫాలవారీగా భారీ మొత్తంలో జరిమానా విధించారు. అయితే సదరు వాహన యజమాని ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.  

తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌) నంబర్‌ గల ఓ వాహనం దాదాపు ఏడాదిన్నరగా  పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండానే తిరుగుతోంది. సదరు వాహనం ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తుండటంతో దఫాలవారీగా లక్షన్నర వరకు ఈ–చలాన్లు జారీ అయ్యాయి.
ఈ రెండు కేసుల్లోనే కాకుండా పలు ఇతర రాష్ట్ర వాహనాలు, టీఆర్‌ నంబర్‌ గల  వాహనాల వివరాలు తెలంగాణ రాష్ట్ర ఆర్టీఏ డాటాబేస్‌లో అందుబాటులో లేకపోవడంతో కేవలం ఈ–చలాన్లను వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేయడం వరకే పరిమితమవుతోంది. అయితే సదరు వాహనదారుల చిరునామాతో పాటు సెల్‌నంబర్లు లేకపోవడంతో వారికి సమాచారం అదించడం తలనొప్పిగా మారుతోంది. వారికి పోస్ట్‌ చేద్దామంటే చిరునామా లేకపోవడం, సంక్షిప్త సమాచారం పంపేందుకు సెల్‌ నంబర్‌ లేకపోవడంతో ‘కమ్యూనికేషన్‌’ కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే సదరు వాహనదారులు కూడా ఈ–చలాన్‌ వెబ్‌సైట్‌లో ఈ–చలాన్లను చెక్‌ చేసుకోకపోవడంతో జరిమానాలు పేరుకుపోతున్నాయి. 2014 తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్‌ వాహనాల సమాచారం కూడా డాటాబేస్‌లో లేకపోవడంతో పొరుగు రాష్ట్ర వాహనాల బాధలు రెట్టింపయ్యాయి. నగరంలో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌...తదితర రాష్ట్రాలకు చెందిన వాహనాలు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా  పోలీసులు ఈ–చలాన్‌ విధించడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. అయితే స్పాట్‌ చలాన్‌ డ్రైవ్‌లో దొరికిన సమయంలో ఈ వాహనదారుల జాతకం బయటపడి చిరునామా, సెల్‌నంబర్‌లు దొరుకుతున్నాయి.   

టీఆర్‌ నంబర్లతో పరేషాన్‌...
నగరంలో కొత్త వాహనాల కొనుగోలు పెరిగిపోవడంతో పాటు వాహనదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌(టీఆర్‌)తోనే ఎక్కువ కాలం వెళ్లదీస్తున్నారు. నెలరోజుల్లోగా శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉన్నా పట్టించుకోకుండా టీఆర్‌ నంబర్‌తోనే వాహనాలు నడుపుతూ ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తూ నిఘానేత్రాలకు చిక్కుతున్నారు. ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద సీసీటీవీ కెమెరాలకు చిక్కిన సిగ్నల్‌ జంపింగ్‌ కేసుల్లోనూ టీఆర్‌ నంబర్‌ వాహనాల సంఖ్య వేలల్లోనే ఉంది. అయితే టీఆర్‌ వాహనాల వివరాలు డాటాబేస్‌లో లేకపోవడంతో వారికి పోస్టు, ఎస్‌ఎంఎస్‌లు పంపడం వీలుకావడం లేదు. కేవలం ఈ–చలాన్‌ వెబ్‌సైట్‌లో జరిమానా వివరాలను ట్రాఫిక్‌ పోలీసులు నిక్షిప్తం చేస్తున్నారు. సదరు వాహనదారులు ఈ–చలాన్‌లు తనిఖీ చేసుకోకపోవడంతో రికవరీ సాధ్యం కావడం లేదు.  

తరచు తనిఖీ చేసుకోవాలి
సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఇతర రాష్ట్ర వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. టీఆర్‌ వాహనాలదీ కూడా అదే పరిస్థితి. అయితే వీరి వివరాలు ఆర్టీఏ డాటాబేస్‌లో లేకపోవడంతో ఈ–చలాన్‌లు పోస్టు చేయడం, ఎస్‌ఎంఎస్‌ పంపడం సాధ్యపడటం లేదు. ఈ–చలాన్‌ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తున్న ఈ–చలాన్‌లను వాహనదారులు తనిఖీ చేసుకుని క్లియర్‌ చేయాలి. వాహనం పట్టుబడితే సీజ్‌ చేస్తాం. అవసరమైతే వాహనదారుడిని జైలుకు పంపిస్తాం.– ఎస్‌.విజయ్‌ కుమార్,సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top