పోలీసులూ..మీకూ తప్పదు!

In Hyderabad even traffic cops Cant Escape Fines for Violating Rules - Sakshi

సిబ్బంది, అధికారులట్రాఫిక్‌ ఉల్లంఘనలపై డేగ కన్ను

ఇప్పటి వరకు 371 మందికి మెమోలు జారీ

30 మందిపై  బదిలీ వేటు

‘పోలీస్‌ అయినా...సాధారణ పౌరులైనా ట్రాఫిక్‌ నిబంధనల విషయంలో ఒక్కటే. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు’ అంటున్నారు పోలీస్‌ ఉన్నతాధికారులు. ఈమేరకు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని 371 మంది పోలీస్‌ సిబ్బంది, అధికారులకు చార్జ్‌ మెమోలు జారీ చేశారు. వీరిలో 30 మందిని హెడ్‌–క్వార్టర్స్‌ సహా వివిధ విభాగాలకు ఎటాచ్‌ చేస్తూ చర్యలు తీసుకున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తూ మీడియాకు చిక్కిన పంజగుట్ట ఎస్సై నర్సింహ్మ నాయక్‌పై ఆదివారం వేటు పడింది. అతడిని సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ హెడ్‌–క్వార్టర్స్‌కు ఎటాచ్‌ చేస్తూ కొత్వాల్‌ అంజినీ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల క్రితం రాంగ్‌ రూట్‌లో వాహనం నడిపిన ఓ పోలీసు డ్రైవర్‌ అంశాన్ని స్వయంగా గుర్తించిన డీజీపీ ఉల్లంఘనకు జరిమానా విధించడంతో పాటు బాధ్యుడికి తాఖీదు జారీ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సాధారణ ప్రజలకు జరిమానా మాత్రమే పడుతోంది. ఇదే పని పోలీసులు చేస్తే వారికి ఫైన్‌తో పాటు తాఖీదులు, తీవ్రమైన వాటికి పాల్పడితే వేటు తప్పట్లేదు. కొన్నాళ్ల క్రితం ప్రారంభించిన ఈ విధానాన్ని నగర పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 371 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు ఉన్నతాధికారులు చార్జ్‌మెమోలు జారీ చేశారు. వీరిలో 30 మందిని హెడ్‌–క్వార్టర్స్‌ సహా వివిధ విభాగాలకు ఎటాచ్‌ చేస్తూ చర్యలు తీసుకున్నారు. మరోపక్క పోలీసులకు సంబంధించిన అధికారిక, వ్యక్తిగత వాహనాలపై ఉన్న జరిమానాలను తక్షణం చెల్లించాల్సిందిగా సీపీ ఆదేశాలు జారీ చేశారు. 

అమలు చేయాల్సిన వారే తప్పు చేస్తే...
రహదారి భద్రతకు సంబంధించి అంశాలు, నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలు చేసే ట్రాఫిక్, శాంతిభద్రతల అధికారులే తప్పులు చేస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని హెల్మెట్‌ నిబంధన పక్కా చేసినప్పుడు కమిషనరేట్, సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌)కు ద్విచక్ర వాహనాలపై వచ్చే ప్రతి అధికారి/సిబ్బంది కచ్చితంగా హెల్మెట్‌ ధరించాల్సిందేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆయా వాహనాలను లోపలకు అనుమతించవద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానాన్ని మరింత విస్తరిస్తూ కొన్నాళ్ల క్రితం చర్యల నిర్ణయం తీసుకున్నారు.

యూనిఫాంలో ఉంటే సీరియస్‌...
నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న పది వేల మందికి పైగా సిబ్బంది నిత్యం ఇళ్ల నుంచి పోలీసుస్టేషన్‌/కార్యాలయం మధ్య, వ్యక్తిగత/అధికారిక పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ సందర్భంగా అత్యధిక శాతం యూనిఫాంలోనే ఉంటున్నారు. ఈ సిబ్బంది/అధికారులు వినియోగిస్తున్న వాటిలో ప్రైవేట్‌ వాహనాలతో పాటు ప్రభుత్వవాహనాలూ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులతో పాటు పోలీసు వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడటాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. వీరిలో మార్పు తీసుకురావడానికి కౌన్సిలింగ్‌ నిర్వహించిన అధికారులు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు తాఖీదులు జారీ చేయడం మొదలుపెట్టారు. అయినా మార్పు రాని వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.

పక్కా ఆధారాలతో...
పోలీసుల ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారని ట్రాఫిక్‌ పోలీసులు ‘సాక్షి’కి తెలిపారు. మొత్తం నాలుగు రకాల సాధనాల ద్వారా వీటిని సేకరిస్తున్నామని తెలిపారు. ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటున్న సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. దీంతో పాటు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచీ ఫొటోలు తీస్తున్నారు. ఈ రెంటితో పాటు సోషల్‌మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వాటిని, పత్రికల్లో ప్రచురితం/ప్రసారం అయిన ఫొటోలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇలా సేకరించిన ఫొటోలను కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సిబ్బంది అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపింది ఎవరు? అనేది నిర్థారించిన తర్వాత ప్రాథమికంగా సదరు పోలీసులను నుంచి జరిమానా వసూలు చేసి, ఆపై చార్జ్‌మెమో జారీ చేస్తున్నారు. ఉల్లంఘన తీవ్రతను బట్టి కొందరు అధికారులపై బదిలీ/ఎటాచ్‌మెంట్‌ వేటు కూడా వేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top