నా విజయం పీసీలదే..

Hyderabad CP Anjani Kumar Compleats One Year - Sakshi

కానిస్టేబుళ్ల సంక్షేమానికి ఎంత చేసినా తక్కువే

మా విధులు కుటుంబాలకు తెలియడానికే ఆత్మీయ సమ్మేళనాలు  

‘సాక్షి’తో నగర సీపీ అంజనీకుమార్‌

నేటితో కొత్వాల్‌గా ఏడాది కాలం పూర్తి

సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక పునాదులపై వెలసిన ఆధునిక నగరం హైదరాబాద్‌. విశాల భారతదేశానికి ప్రతీక. అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు కుల, మత, ప్రాంత, భాషలకు అతీతంగా నివాసం ఉంటున్నారు. మరోపక్క ప్రపంచంలో ఏ చిన్న అలజడి జరిగినా ఆనవాళ్లు, మూలాల కోసం ఇక్కడ వెతికే పరిస్థితి. అలాంటి నగరంలో శాంతి,భద్రతల పరిరక్షణ పూర్తిగా పోలీస్‌ వ్యవస్థదే. ఈ శాఖను సమన్వయం చేసి ప్రజారక్షణ బాధ్యతలు మోసేది మాత్రం నగర ‘కొత్వాలే’. ఓ పక్క పెరుగుతున్న జనాభా..మరోపక్క అదేస్థాయిలో పెచ్చుమీరుతున్న నేరాలను కట్టడి చేయడం కత్తిమీద సామే. ఎంతోమంది సమర్థవంతమైన అధికారులు నగర పోలీస్‌ విభాగానికి నేతృత్వం వహించారు. ప్రస్తుతం కొత్వాల్‌గా అంజనీకుమార్‌ ఉన్నారు. 2018 మార్చి 12న సిటీ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన సోమవారానికి ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సిటీలో తీసుకువచ్చిన కీలక సంస్కరణలు, ఆ ఆలోచనలకు మూలాలను వివరించారు. తాను సాధించిన విజయాలు క్షేత్రస్థాయిలో అహర్నిశలు కష్టపడే పోలీస్‌ కానిస్టేబుళ్ల (పీసీ) వల్లనే సాధ్యమైందన్నారు. ఆ వివరాలు సీపీ మాటల్లోనే.. 

‘‘అనునిత్యం శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాలు నిరోధించడం, కేసులు కొలిక్కి తేవడానికి శ్రమించే పోలీసులకు పని గంటలు అంటూ ఉండవు. దీంతో వీరు ఎప్పుడూ కుటుంబాలకు దూరంగా విధుల్లోనే ఉండాల్సి వస్తుంది. ఒకప్పుడు పోలీస్‌ స్టేషన్లు, అక్కడి మౌలిక వసతులు ఘోరంగా ఉండేవి. కనీసం కూర్చోడానికి కుర్చీలు లేకుండా భయంకరమైన వాతావరణంలో ఠాణాలు ఉండేవి. అనేక మంది కానిస్టేబుళ్లు, ఇతర అధికారుల కుటుంబాలు ఇప్పటికీ పోలీస్‌ స్టేషన్లను అలానే ఊహించుకుంటున్నారు. తమ వాళ్లు పనిచేసే ప్రాంతంపై, విధులపై కుటుంబీకులకు సరైన అవగాహన లేదని కొందరు పోలీసు కుటుంబాలను కలిసినప్పుడు గుర్తించాం. అప్పడే ప్రతి పోలీస్‌ స్టేషన్‌లోనూ ఆత్మీయ కలయికలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. వీటి నిర్వహణ ద్వారా ఆయా ఠాణాలో పనిచేసే వారి కుటుంబాలను ఆహ్వానించడం ద్వారా అక్కడి వాతావరణం, పోలీసుల పనితీరు వివరించడంలో సఫలీకృతమయ్యాం. వీటి నిర్వహణ తర్వాత సిబ్బందికి వారి కుటుంబాల నుంచి ప్రోత్సాహం పెరిగింది. 

పారదర్శకంగా పరిపాలన..
గతేడాది నుంచి నగర పోలీస్‌ విభాగంలో ఈ–ఆఫీస్‌ విధానం అవలంబిస్తున్నాం. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానిస్టేబుల్‌ నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరైనా గతంలో సెలవు తీసుకోవాలంటే దానికి భారీ తతంగం ఉండేది. దాన్ని మంజూరు చేశారా? తిరస్కరించారా? అనే విషయాలూ బయటకు వచ్చేవి కాదు. ఆన్‌లైన్‌లో లీవు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చాక ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో పాటు పరిపాలనలోనూ పారదర్శకత కోసం ఈ–ఆఫీస్‌ అమలుచేస్తున్నాం. దీని కారణంగా పోలీస్‌ విధి నిర్వహణలోనూ ఎన్నో ఉపయోగాలు వచ్చాయి. నగరంలో జరిగిన చిన్నచిన్న ధర్నాల నుంచి భారీ ఉదంతాల వరకు అన్నీ ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తున్నాయి. ఈ కారణంగా గత ఏడాది ఓ రోజున నగరంలో పరిస్థితులు ఏంటి? ఈసారి అదే రోజు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? అనేది తెలుసుకోవడానికి ఫైళ్లు తిరగేయాల్సిన పనిలేదు. కేవలం కొన్ని క్షణాల్లో తమ చేతుల్లో ఉన్న ట్యాబ్స్‌ ఆధారంగా అధికారులు తెలుసుకోగలుగుతున్నారు. 

‘వావ్‌’ మహిళా పోలీసుల సత్తా
భరోస, షీ–టీమ్స్‌ ఏర్పాటుతో ఇప్పటికే మహిళల భద్రతలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సిటీ పోలీస్‌ విభాగం మహిళా సిబ్బందికీ గస్తీలో ప్రాధాన్యం కల్పిస్తూ ‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌’ (వావ్‌) పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. దేశంలోనే తొలిసారిగా కంబాట్‌ సిస్టంలో శిక్షణ తీసుకుని రంగంలోకి దిగిన ఈ బృందాలు తమ సత్తాచాటుతున్నాయి. వీటి ఏర్పాటుతో సిటీ పోలీస్‌ విభాగం మరో రికార్డు సొంతం చేసుకుంది. పోలీసింగ్‌ అంటే రఫ్‌ అండ్‌ టఫ్‌ ఉద్యోగమని, మహిళలు ఈ విధులు నిర్వర్తించలేరనే అభిప్రాయం ఈ బృందాల ఏర్పాటుతో పోయింది. సమాజంలో సగం ఉండటమే కాదు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే వారిలోనూ మహిళా బాధితులు ఎక్కువే. వీరి భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళా పోలీసులకు ఈ బృందాల ఏర్పాటు మైలురాయి. పోలీస్‌ విభాగంలోని మహిళా సిబ్బంది పురుష సిబ్బందితో సమానంగా ఎదిగేలా అనేక చర్యలు తీసుకుంటున్నాం. 

‘వాయిస్‌’లో ఎప్పటికప్పుడుమనసులో మాట చెబుతూ..
సిటీ ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ రూపకల్పన నగర పోలీస్‌ విభాగంలో మరో మైలురాయి. కీలక బందోబస్తు అవసరాలకు కేవలం కేంద్ర బలగాల పైనే ఆధారపడకుండా తీసుకున్న చర్య ఇది. సిటీలో కీలక ఉదంతం జరిగినప్పుడు.. ఓ కీలక సందర్భాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు.. పోలీసులపై పాజిటివ్, నెగిటివ్‌ ఒపీనియన్స్‌ వచ్చిన సందర్భాల్లోనూ వాయిస్‌ మెసేజ్‌ల ద్వారా సిబ్బంది, అధికారుల్లో స్ఫూర్తి నింపుతున్నాం. వీటిని విన్న పోలీసు కుటుంబాలు సైతం నేరుగా వచ్చి కలిసి కృతజ్ఞతలు చెబుతున్నాయి. పోలీసుల సర్వతోముఖాభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నాం.. కుంటున్నాం.. ఇంకా తీసుకుంటాం. అయితే ఇప్పటికీ కొన్ని ఉదంతాలు సిటీ పోలీస్‌ విభాగంలో జరగకుండా ఉండి ఉండే బాగుండేదని అనిపిస్తుంటుంది. మంచిని ఏరకంగా ప్రోత్సహిస్తున్నామో.. అవినీతి, ఆరోపణలపై అదే స్థాయిలో స్పందిస్తున్నాం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం’’ అంటూ ముగించారు. 

వ్యక్తిగత సమస్యలూ చెప్పుకునే చనువు
సాధారణంగా ఉన్నతాధికారుల వద్దకు రావడానికి కానిస్టేబుల్‌ స్థాయి అధికారులు భయపడుతుంటారు. తమకు ఉన్న ఇబ్బందులను వారి దృష్టికి తేలేక.. అవి పరిష్కారం కాక సతమతమవుతూ ఉంటారు. అయితే, గడిచిన కొన్నాళ్లుగా సిటీ పోలీస్‌ విభాగంలో అమల్లోకి తెచ్చిన సంస్కరణలు కానిస్టేబుళ్లే కాదు.. హోంగార్డులు కూడా ధైర్యంగా ఉన్నతాధికారుల వద్దకు రాగలుగుతున్నారు. వీరితో పాటు కుటుంబ సభ్యులూ వచ్చి తమ ఇబ్బందులు, తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తున్నారు. ఇలా నా వద్దకు వచ్చిన దాదాపు 20 నుంచి 30 జంటల మధ్య ఉన్న అపార్థాలు, ఇబ్బందులను తొలగించడంతో వారి జీవితాల్లో మార్పు వచ్చింది. తన కుటుంబం బాగుంటేనే ఓ అధికారి పూర్తి స్థాయిలో విధి నిర్వహణకు అంకితం అవగలుగుతాడు. దీన్ని దృష్టిలో పెట్టుకునే అనేక చర్యలు తీసుకుంటున్నాం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top