హైదరాబాద్‌ని వదలని వాన.. | Huge Rains leaves Hyderabad roads flooded | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ని వదలని వాన..

Sep 26 2019 3:29 AM | Updated on Sep 26 2019 11:03 AM

Huge Rains leaves Hyderabad roads flooded - Sakshi

బుధవారం రాత్రి భారీ వర్షానికి జలమయమైన అమీర్‌పేట్‌

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరుసగా రెండో రోజూ కుండపోతగా వాన కురిసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం బలంగా ఉండటంతో కుంభవృష్టి కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎడతెరసి లేకుండా వర్షం పడింది. అధిక వర్షాలతో హైదరాబాద్‌ నగర జనజీవనం అతలాకుతలమైంది. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీగా ట్రాఫిక్‌ జాం కావడంతో ఇళ్లకు వెళ్లేందుకు గంటలకొద్దీ ప్రయాణించాల్సి వచ్చింది. రోడ్లపై నిలిచిన నీటిని పారదోలేందుకు ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ కార్మికులు శ్రమించారు.
 
నగరం అతలాకుతలం.. 
మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు క్యుములోనింబస్‌ మేఘాలు ఒకదానితో ఒకటి సమ్మిళితం (కన్వర్జెన్స్‌) కావడం వల్ల ఆకాశానికి చిల్లు పడినట్లయింది. హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీ, గణాంక భవన్, సెస్, మణికొండ, విజయనగర్‌ కాలనీలోని ఫుట్‌బాల్‌ గ్రౌండ్, కవాడిగూడ, రెడ్‌హిల్స్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా సరాసరి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ శాస్త్రవేత్త రాజారావు తెలిపారు. 2017 సెప్టెంబర్‌ 14న మల్కాజిగిరిలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెప్పారు.  

గోడకూలి వృద్ధురాలు మృతి 
బుధవారం రాత్రి కురిసిన వర్షానికి కిషన్‌బాగ్‌ మహమూద్‌నగర్‌లో ఇంటి గోడ కూలి ఓ వృద్ధు రాలు మృతి చెందింది. మన్సూర్‌బేగం (65) కుమారుడు ఫైజల్, కోడలితో కలసి నివసిస్తోంది. మూసీ నాలా చివరన ఉన్న వారి ఇంటి గోడలు 2 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బాగా తడిసి బుధవారం రాత్రి 7 గంటలకు కుప్పకూలి మన్సూర్‌బేగంపై పడ్డాయి. ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

అత్యధికంగా 11.18 సెంటీమీటర్లు.. 
నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో అత్యధికంగా 11.18 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. సిరికొండ మండలంలోని జినిగ్యాల గ్రామ సమీపంలోని మైసమ్మ చెరువు తెగిపోయింది. బాల్కొండలో 11.15 సెం.మీ. వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, మెదక్‌ జిల్లా శంకర్‌పేటలో 7 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. డిచ్‌పల్లి, గన్నారం, పెర్కిట్, కల్హేర్, పిట్లం, లక్ష్మీసాగర్, మగిడి, వెల్దండలో 6 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లాలోని మొర్ర చెరువుకు వరద నీరు పోటెత్తడంతో వనపర్తి–పెబ్బేరు రహదారిపై వరద భారీగా పారుతోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.  

నేడు, రేపు వర్షాలు.. 
ఇంటీరియర్‌ కర్ణాటక, దాన్ని ఆనుకుని ఉన్న రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి జార్ఖండ్‌ వరకు తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఇంటీరియర్‌ ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో గురు, శుక్రవారాల్లో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ఒకేసారి రావడంతో క్యుములోనింబస్‌ మేఘాలు ఉధృతమే అనేకచోట్ల ఒకేసారి కుండపోత వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఎడతెరపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. 


మెట్రోకు స్వల్ప అంతరాయం..
రాజధానిలో కురిసిన భారీ వర్షాలకు మెట్రో రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. ఎల్బీనగర్‌–మియాపూర్‌ మార్గంలో సుమారు 30 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆటోమేటిక్‌ విధానంలో కాకుండా.. మాన్యువల్‌గా నడపడంతోనే రైళ్లు కాస్త ఆలస్యంగా నడిచినట్లు మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జాం కావడంతో బుధవారం మెట్రోలో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. 


వర్షాలతో అప్రమత్తంగా ఉండండి: కిషన్‌రెడ్డి 
సాక్షి, హైదరాబాద్‌: జంట నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్త వ్యస్తమైందని, దీని మీద తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ కమిషనర్, అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు ప్రవేశించి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వచ్చేలా ఏర్పాటు చేస్తామన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కోరితే సహకరించడానికి కేంద్రం ఎప్పుడు సిద్ధంగా ఉందని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement