రాత.. దాత

Helping For Needy People in Writing in Exams Hyderabad - Sakshi

రోజులో కొన్ని గంటల సమయం మనది కాదనుకుంటే.. చూపులేని వారికి వెలుగు దారి చూపొచ్చు. మరచిపోయిన పరీక్ష హాలుని మరోసారి గుర్తు తెచ్చుకుంటూనే మరొకరికి ‘చే’యూత అందించిన గొప్ప జ్ఞాపకాన్ని మిగుల్చుకోవచ్చు. అందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న మార్గం అంధ విద్యార్థులకు పరీక్షల్లో రాత సాయం.

సాక్షి, సిటీబ్యూరో:అటు ఎండలతో పాటు ఇటు పరీక్షల వేడి కూడా నగరంలో రాజుకుంటోంది. రెండు రోజుల్లో ఇంటర్‌ పరీక్షలు మొదలు కానుండగా, పదో తరగతి పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సబ్జెక్టుల రికార్డింగ్స్‌ దగ్గర్నుంచి పరీక్షలు రాసే విషయం వరకూ ‘చే’యూత ఇచ్చేవారి కోసం అంధ విద్యార్థులు అన్వేషిస్తున్నారు. కొండంత చీకటిని పారదోలడంలో తమకు గోరంత సాయంగా, స్కైబ్స్‌గా పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతున్నారు.

తిప్పలు వర్ణణాతీతం..
అంధ విద్యార్థుల సమస్యలు చెబితే అర్థమయ్యేవి కావు. ముఖ్యంగా పరీక్షల సమయంలో వారి తిప్పలు వర్ణనాతీతం. అన్ని కష్టాలున్నా చదువుకోవాలనే వారి తపన చూస్తే ఎటువంటి వారికైనా మనసు కరగకమానదు. ఆర్థికంగా కాకపోయినా, అవసరమైన వారికి ఏదో ఒక రూపంలోసేవ చేద్దాం అనుకున్నవారికి స్క్రైబ్స్‌ఓ మంచి అవకాశం. నగరంలోని బేగంపేట, దిల్‌సుఖ్‌నగర్, దారుషిఫా, మలక్‌పేట.. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్, హోంలలో అంధ విద్యార్థులు స్క్రైబ్స్‌ కోసం నిరీక్షిస్తున్నారు.  

సహాయకుల కొరత..
రెమ్యూనరేషన్‌ నామమాత్రంగా ఉండటం, చెల్లించే పద్ధతిలో లోపాల కారణంగా స్క్రైబ్స్‌గా వచ్చేందుకు ఎక్కువ మంది సముఖత చూపడం లేదు. మరోవైపు కొందరు కేవలం డబ్బుల గురించి మాత్రమే స్క్రైబ్‌గా చేసే వ్యక్తికి ఉన్న విషయ పరిజ్ఞానం, విద్యార్హతల సమాచారం గురించి తెలియక తాము చెప్పిన ఆన్సర్లు సరిగా రాయగలరో లేదోనని అంధ విద్యార్థులు ఆందోళనకు లోనవుతున్నారు. ‘నాకు స్క్రైబ్‌గా స్కూల్‌ అటెండర్‌ను నియమించారు. అతడికి స్పెల్లింగ్‌లు కూడా సరిగా రాక బాధలు పడ్డా’నని ఓ విద్యార్థ వాపోయాడు. ‘గ్రూప్‌–2 పరీక్ష రాస్తున్నప్పుడు సహాయకుడిగా వచ్చిన వ్యక్తికి కనీస పరిజ్ఞానం కూడా లేదు. దాంతో ఆ పరీక్షల్లో 450 మార్కులకు బదులు కేవలం 223 మాత్రమే వచ్చాయి’ అని మరో అంధ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. తమ సహాయకులకు ప్రభుత్వం రెమ్యునరేషన్‌ ఇస్తుందనే విషయం చాలా మంది అంధ విద్యార్థులకు తెలియకపోవడంతో అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 

స్వచ్ఛందంగా రావా(యా)లి..
సమస్యలున్నా.. ప్రభుత్వ ఆధ్వర్యంలో చదివే వారికి ప్రభుత్వ పరంగా కొంత అండ ఉంటే ఆర్ఫాన్‌ హోమ్స్‌ వగైరాల్లో ఆశ్రయం పొందుతూ చదువుకునే అంధ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వీరి పరీక్షలకు సంబంధించి ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి, అర్హత కలిగిన స్క్రైబ్స్‌ కొరతను తీర్చడానికి, స్వచ్ఛంద సేవకుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి స్క్రైబ్స్‌గా పనిచేయడానికి వచ్చేవారిని ప్రోత్సహించాలని, వారి పేర్లను నమోదు చేసుకుని అవసరానికి అనుగుణంగా వారిని ఉపయోగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ‘స్వచ్ఛంద సేవకుల్ని స్క్రైబ్స్‌గా ప్రభుత్వం ప్రోత్సహించాలి. రాష్ట్రస్థాయిలో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసి సేవాగుణమున్న గృహిణులు, ఐటీ ఉద్యోగులకు తర్ఫీదు ఇవ్వాలి’ అని ఆసరా ఎన్‌జీఓ అధ్యక్షుడు ఆర్‌.జగదీష్‌బాబు అభిప్రాయపడ్డారు. 

స్క్రైబ్స్‌గా సేవలందించాలంటే..
పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, ఐడీ ప్రూఫ్, పదవ తరగతి మెమో ఉండి తెలుగు బాగా చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ప్రశ్నలు స్క్రైబ్స్‌ చదివి చెబితే సమాధానాలు విద్యార్థులు చెబుతారు. అందుకని ఒకటికి రెండుసార్లు ప్రశ్న చదివి వినిపించాలి. మిగతా వారితో పోలిస్తే అంధ విద్యార్థులకు పరీక్ష పూర్తి చేసేందుకు అరగంట సమయం అదనంగా ఇస్తారు. కేవలం ఒక పరీక్ష మాత్రమే రాస్తానన్నా, అన్ని పరీక్షలూ రాస్తామన్నా అవకాశం ఇస్తారు. ఏదేమైనా.. స్వచ్ఛందంగా సేవ అందించడం కాదు.. ఖచ్చితంగా పరీక్ష సమయానికి వెళ్లగలగడం అంటేనే చెప్పాలి. లేకపోతే అనవసరంగా ఓ విద్యార్థి జీవితానికే పరీక్షగా మిగులుతారు.  

రాసాయం చేశా..
ఓ ఎన్‌జీఓ వాళ్లు స్క్రైబ్స్‌ కావాలంటే వెళ్లి కలిశాను. అలా ఆర్‌బీఐ పరీక్షకు అటెండ్‌ అయిన ఓ అంధుడి కోసం స్క్రైబ్‌గా స్వచ్ఛందంగా రాశాను. ఆ తర్వాత ఎస్‌బీఐ క్లర్క్‌ కోసం రాశా. మరో 2 సార్లు రాశాను. పరీక్ష రాయడం కోసం ఆఫీసుకు సెలవు పెట్టాల్సి వచ్చింది. అయినా సరే అనుకుని రాశాను. ఇప్పటికీ ఏ మాత్రం అవకాశం ఉన్నా స్క్రైబ్‌గా సర్వీస్‌ అందిస్తా.– నరేష్, చార్టెర్డ్‌ అకౌంటెంట్‌

ఐదేళ్లుగా..
మా స్నేహితులతో పాటు నేను కూడా ఐదేళ్లుగా స్వచ్ఛందంగా స్క్రైబ్‌ సేవలందిస్తున్నా. అంధులకు మన వంతుగా దారి చూపడంలో గొప్ప ఆత్మసంతృప్తి లభిస్తుంది.  – భారతి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top