అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర పంటనష్టం

Heavy Loss Due To Unseasoned Rains In Telugu States - Sakshi

హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. పలుచోట్ల వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా వీచాయి. మరికొన్ని చోట్ల వడగండ్ల వాన కురియడంతో చేతికొచ్చిన పంట నేలపాలైంది. తెలంగాణాలో సిద్ధిపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జనగాం, కరీంనగర్‌, యాదాద్రి భువనగిరి, వరంగల్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, వ్యవసాయ, హార్టీ కల్చర్‌, సెరి కల్చర్‌ అధికారులకు సూచనలు చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ లేఖలు రాసింది.

తెలంగాణ వ్యాప్తంగా 30 వేల ఎకరాలల్లో తీవ్రంగా పంటనష్టం జరిగినట్లు అంచనాకు వచ్చారు. శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. తిరుపతి నగరంలో కూడా చిరుజల్లులు పడ్డాయి. కర్నూలు జిల్లా నల్లమల అటవీప్రాంతంలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో నంద్యాల- గిద్దలూరు రోడ్డు మార్గంలోని నల్లమల ఘాట్‌ రోడ్డులో వర్షపు నీరు భారీగా నిలిచి వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అకాలవర్షాలకు ఆంధ్రాలో కూడా పలుచోట్ల పంటనష్టం వాటిల్లింది.

తెలంగాణాలో వర్ష సూచన
ఈరోజు(శనివారం)తో పాటు రేపు కూడా ఉరుమలు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశముందని, అక్కడక్కడా వడగండ్లు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముంది. 

ఆంధ్రాలో ఈదురుగాలులతో కూడిన వర్షం
శనివారం నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top