దేశం చూపు.. తెలంగాణ వైపు | Sakshi
Sakshi News home page

దేశం చూపు.. తెలంగాణ వైపు

Published Thu, Jul 19 2018 4:27 AM

Harish Rao seeks national status for Kaleshwaram project - Sakshi

సాక్షి సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టుతో అన్ని కాలాల్లో ప్రతి గ్రామానికి గోదావరి నీటిని అందించే బృహత్తర పథకాన్ని చేపట్టిన తెలంగాణ వైపు దేశం మొత్తం చూస్తోందని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. జిల్లా కేంద్రంలో హజ్‌ యాత్రికులకు సన్మానం, పెద్దకోడూరులో రూ.3 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్‌ హాస్టల్‌ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో ప్రాజెక్టులు నిర్మించడానికి 30 ఏళ్లు పట్టేదని, తెలంగాణ వచ్చాక 20 నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు.

దసరా నాడు అటూ ఇటూ గోదావరి నీటి ని తరలిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు బీమా పథకంతో ధీమాను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రూ.వెయ్యి కోట్లతో రాష్ట్రంలోని ప్రతి మండలంలో గోదాంలను నిర్మించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో సివిల్, ఎలక్ట్రికల్‌ కోర్సులకు మంచి డిమాండ్‌ ఉందని, ప్రభు త్వ, ప్రైవేటు రంగంలోనూ అవకాశాలున్నాయన్నా రు. మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ పాటుపడుతున్నారని చెప్పారు.   

ఏడాదిలో ఎల్కతుర్తి జాతీయ రహదారి...
ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ సమయంలో వరంగల్‌–ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చుచేసే విధంగా కేంద్ర ప్రణాళికలో చేర్పించామని హరీశ్‌రావు వెల్లడించారు. సిద్ది పేట జిల్లాలో రైల్వే లైన్‌ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. జిల్లాకు రెండు జాతీయ రహదారులు మంజూరు కావడంతో పారిశ్రామికంగా సిద్దిపేట మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట పరిసర ప్రాంతంలో ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రంగనాయక సాగర్‌ ద్వారా లక్షా పది వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. సమావేశం లో ఎమ్మెల్యే బాబూమోహన్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫరూఖ్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement