చేనేత కార్మికులకు అండగా ఉంటాం

Handloom Weavers Loan Waiver Scheme Etela Rajender karimnagar - Sakshi

కరీంనగర్‌ సిటీ: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చేనేత కార్మికులందరినీ కంటికి రెప్పలా కాపాడుకుని, అండగా ఉంటామని ఆర్థిక పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చేనేత వృత్తి గౌరవప్రదమైనదన్నారు. ఇప్పటివరకు దేశంలో పూర్తిస్థాయిలో ఈ వృత్తిని కాపాడడంలో అన్ని ప్రభుత్వాలు శ్రద్ధకనబర్చలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చేనేత కార్మికులు, సంఘాలు సంఘీభావం తెలిపారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చేనేత కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా చేనేత సంఘాలకు షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. రంగులపై, నూలుపై 40శాతం సబ్సిడీ ఇచ్చామని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేశామన్నారు.

ముఖ్యంగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో చేనేత సహకార సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో 6 కిలోల బియ్యం, లక్ష రూపాయల కల్యాణలక్ష్మి పథకం చేనేత కార్మికులకు కూడా వర్తిస్తుందన్నారు. చేనేత కార్మికుల సమస్యలను మంత్రి కేటీఆర్‌తో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.చేనేత కార్మికులలో చిరువ్యాపారాలు చేసుకొనే వారికి, వెనుకబడిన తరగతుల ఆర్థిక సహాయం రుణాల కింద మంజూరైన చెక్కులను మంత్రి అందజేశారు.వృద్ధ చేనేత కార్మికులను సన్మానించారు. పాఠశాలల్లో నిర్వహించిన పోటీపరీక్షలలో ప్రతిభచూపిన వారికి బహుమతులు అందించారు. శాసనమండలి సభ్యుడు నారదాసు లక్ష్మణ్‌రావు, చేనేత జౌళిశాఖ ఏడీ వెంకటేశం, ఎంపీపీ వాసాల రమేశ్, ఖాదీ రీజినల్‌ ఆఫీసర్‌ సతీష్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top