పాస్‌పోర్టు.. బ్లాక్‌ మెయిల్‌ | Gulf Agents Harrased In Nizamabad District | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్టు.. బ్లాక్‌ మెయిల్‌

Dec 15 2017 12:32 PM | Updated on Aug 21 2018 3:08 PM

Gulf Agents Harrased In Nizamabad District - Sakshi

నిజామాబాద్‌, మోర్తాడ్‌(బాల్కొండ): మోర్తాడ్‌కు చెందిన సబ్బని సాయికుమార్‌ బీటెక్‌ పూర్తి చేశాడు. గల్ఫ్‌లో మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని వేల్పూర్‌ మండలం జాన్కంపేట్‌కు చెందిన గల్ఫ్‌ ఏజెంటు నమ్మించాడు. సాయికుమార్‌ ఒరిజినల్‌ పాస్‌పోర్టును తీసుకున్న ఏజెంటు వీసా ఇవ్వడానికి మూడు నెలల నుంచి తిప్పించుకుంటున్నాడు. చివరకు ఒక నకిలీ వీసా చేతిలో పెట్టాడు. దీనిని పరిశీలించిన సాయికుమార్‌ ఇదేమిటని ఏజెంటును ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం లేదు. చివరకు తన పాస్‌పోర్టు తనకు వాపసు ఇవ్వాలని సాయికుమార్‌ ఏజెంటును కోరగా వీసా కోసం తాను రూ.20వేల ఖర్చు చేశానని అందులో కనీసం రూ.15 వేలు చెల్లించాలని ఏజెంటు డిమాండ్‌ చేస్తున్నాడు. తనకు ఇచ్చింది నకిలీ వీసా అని, తన వీసా కోసం నయాపైసా ఖర్చు చేయకున్నా ఒరిజినల్‌ పాస్‌పోర్టు తన చేతిలో ఉందనే ధీమాతో ఏజెంటు తనను వేధింపులకు గురి చేస్తున్నాడని సాయికుమార్‌ వాపోతున్నాడు. ఇది ఒక సాయికుమార్‌కు ఎదురైన ఘటనే కాదు. గల్ఫ్‌ ఏజెంట్ల చేతిలో నలిగిపోతున్న ఎంతో మంది నిరుద్యోగుల వేదన. 

గల్ఫ్‌ ఏజెంట్లు నిరుద్యోగుల పాస్‌పోర్టుల జిరాక్సు కాపీలను తీసుకోకుండా ఒరిజినల్‌ పాస్‌పోర్టులను తీసుకుని అన్ని విధాలుగా వంచిస్తున్నారు. ఇమిగ్రేషన్‌ చట్టం ప్రకారం గల్ఫ్‌ వీసాలను జారీ చేసే అధికారం లైసెన్స్‌ ఉన్న ఏజెంట్లకు మాత్రమే ఉంది. కాని ఎలాంటి లైసెన్స్‌లు లేకుండా గల్ఫ్‌ ఏజెంట్లుగా చెలామణి అవుతున్న ఎంతో మంది మోసగాళ్లు తమ వద్దకు వచ్చే నిరుద్యోగులను ఎదో ఒక విధంగా ఇబ్బందికి గురిచేస్తూనే ఉన్నారు. ఒరిజినల్‌ పాస్‌పోర్టులను తమ గుప్పిట్లో ఉంచుకుంటున్న ఏజెంట్లు వీసాల కోసం ప్రయత్నం చేయకుండానే పాస్‌పోర్టులు వాపసు ఇవ్వడానికి అందినకాడికి దండుకుంటున్నారు.

లైసెన్స్‌ ఉన్న ఏజెంట్లు కొందరే...
జిల్లాలో లైసెన్స్‌ కలిగి ఉన్న గల్ఫ్‌ ఏజెంట్లు ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉన్నారు. గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్‌లను పొందాలనుకునే ఏజెంట్లు ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో డిపాజిట్‌ను చూపాల్సి ఉంటుంది. ఏజెంట్లు రూ.1కోటికి పైగా బ్యాంకు డిపాజిట్‌ చేసిన తరువాతనే ప్రభుత్వం అన్ని పరిశీలించి లైసెన్స్‌లను జారీ చేస్తుంది. లైసెన్స్‌ ఉన్న ఏజెంటు మోసం చేస్తే బ్యాంకులో ఉన్న డిపాజిట్‌ సొమ్మును బాధితులకు పంపిణీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అందువల్ల లైసెన్స్‌ ఏజెంట్లు వీసాల వ్యాపారాన్ని సక్రమంగానే నిర్వహిస్తారు. అయితే ఒక్కో వీసాకు ఎక్కువ మొత్తంలో లైసెన్స్‌ ఉన్న ఏజెంట్లు వసూలు చేస్తుండటంతో నిరుద్యోగులు లైసెన్స్‌ లేని ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు.

లైసెన్స్‌ లేని ఏజెంట్లు వందల్లోనే...
గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి చూపడానికి వీసాలు ఇప్పిస్తామని లైసెన్స్‌ లేకుండా ఉన్న ఏజెంట్ల సంఖ్య వందల్లోనే ఉంది. గ్రామానికి ఇద్దరి నుంచి ఐదుగురు వరకు లైసెన్స్‌ లేని ఏజెంట్లు ఉన్నారు. అంతేగాక పాస్‌పోర్టు, విమాన టిక్కెట్‌ల పేరిట ట్రావెల్స్‌ సంస్థలను నిర్వహిస్తున్నవారు కూడా ఎలాంటి అనుమతి లేకుండా వీసాలను జారీ చేస్తున్నారు. లైసెన్స్‌ లేని ఏజెంట్లను నమ్మవద్దని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా నిరుద్యోగులు తమ ఉపాధి కోసం తప్పనిసరి నమ్మి బలి అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement